విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 04:42 PM IST
విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Updated On : May 10, 2020 / 4:42 PM IST

విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై సీఎం జగన్..  మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం (మే 10, 2020) సాయంత్రం మరోమారు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, ఇటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందంటూ సీఎంకు వివరించారు.  గ్యాస్‌ బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులను మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. రేపు ఉదయం నుంచి ప్రభావిత గ్రామాల్లో ఇంటా, బయటా కూడా పూర్తిస్థాయిలో రసాయనాల అవశేషాలు లేకుండా శానిటేషన్‌ కార్యక్రమాలు  చేపట్టాలన్నారు.

సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకు మంత్రులు ఆయా గ్రామాల్లో రాత్రి బస చేయాలన్నారు. ఆస్పత్రిలో వైద్యం తీసుకుని, డిశ్చార్జి అవుతున్న ప్రజలు తిరిగి ఇళ్లకు చేరేంతవరకూ ప్రతి ఒక్కరి బాధ్యతను తీసుకోవాలని తెలిపారు. వారికి మంచి సదుపాయాలు అందేలా చూడాలని, తర్వాత కూడా వారికి వైద్య సేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలన్నారు. రేపు ఉదయం మంత్రులు, అధికారులు కలిసి మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

గ్యాస్‌ లీక్‌ కారణంగా ప్రభావితమైన వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆర్థిక సహాయం కోసం ప్రజలెవ్వరూ ఎక్కడా కూడా తిరగకుండా వారికి నేరుగా గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేయాలని సూచించారు. పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. తమకు అందాల్సిన సహాయం కోసం ప్రజలు ఎవ్వరూ కూడా పదేపదే విజ్ఞాపనలు చేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. 

పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్న అంశాన్ని నిపుణులు కూడా చెప్తున్నారంటూ సీఎంకు వివరించారు. అయినా సరే.. ఇంతటి ప్రమాదానికి కారణమైన స్టెరిన్‌ రసాయనాన్ని విశాఖపట్నంలో ఉంచడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. వివిధ ట్యాంకుల్లో, ఇతరత్రా చోట్ల ఉన్న స్టెరిన్‌ రసాయనాన్ని వెనక్కి పంపాలని సీఎం గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంచేసుకుని ఈ పని పూర్తిచేయాలన్నారు.