Telangana Congress : మల్లు రవితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల భేటీ.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామెదర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో శనివారం భేటీ అయ్యారు. వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. కూచుకుళ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా?

Telangana Congress : మల్లు రవితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల భేటీ.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా?

Kuchukulla Damodar Reddy Meets Mallu Ravi

BRS MLC Kuchukulla – Mallu Ravi : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పాలమూరు (Palamuru) పాలిటిక్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. ఏ పార్టీ నేతలు ఏ పార్టీలోకి చేరతారో అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తులు షురు చేస్తున్నాయి. పార్టీ మారాలనుకునే నేతలు మంతనాలు సాగిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అదే జోష్ లో తెలంగాణలో తమదే గెలుపు అనే ధీమాతో ఉంది. బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి ఎంతోమంది నేతలు రావటానికి ఆసక్తి చూపుతున్నారని.. తమకు టచ్ లో ఉన్నారని టీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే ఆమాటలు ప్రస్తావిస్తున్నారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామెదర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో శనివారం భేటీ అయ్యారు. వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. కూచుకుళ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా, అందుకేనా ఈ చర్చలు అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మల్లు రవి నివాసానికి వచ్చిన కూచుకుళ్ల దామెదర్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తన కుమారుడు రాజేశ్ రెడ్డిని కాంగ్రెస్ తరపున నాగర్ కర్నూల్ నుంచి బరిలోకి దింపాలని కూచుకుళ్ల యోచిస్తున్నారు. దీంట్లో భాగంగానే మల్లు రవితో సమావేశమయ్యారని తెలుస్తోంది.

ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లోకి చేరిక ఖరారు అయ్యింది. ఇక మరో మాజీ బీఆర్ఎస్ నేత జూపల్లి కష్ణారావు కూడా కాంగ్రెస్ లోనే చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వారిద్దరి బాటలోనే కుమారుడు రాజకీయ జీవితం కోసం కూచుకుళ్ల కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. మరోపక్క నాగం జనార్థన్ రెడ్డికి, కూచుకుళ్లకు మధ్య విభేధాలు ఉండటంతో వీరిద్దరి మధ్య సర్ధుబాటు కోసం కాంగ్రెస్ యత్నిస్తోంది.

ఇలా ఎంతోమంది నేతలు ఎన్నికల సమీపంలో ఇలా పార్టీలు మారటం సర్వసాధారణంగా మారిపోయింది. చాలామంది నేతలు మనం ఎంతో రాజీకీయ జీవితం అనుభవించాం.. ఇక వారసులను రంగంలోకి దింపుతామనే ఆలోచనతో కొడుకుల కోసం టికెట్లు ఆశిస్తున్నారు. మరికొందరైతే తమకు టికెట్ కావాలి, తమ కుమారులకు కూడా టికెట్ కావాలంటున్నారు. అలా టికెట్ లభించదనే వాతావరణం కనిపిస్తున్న క్రమంలో పార్టీల జంపింగ్ లు షురు చేస్తుంటారు. ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు, పదవిలో ఉన్నామా? లేదా? అనేదే ఇప్పుడు రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో పార్టీల మార్పులు అనేవి కామనే కదా అనేలా తయారైంది పరిస్థితి.

Also Read: దళిత బంధు పంపిణీలో అవినీతికి కేసీఆరే బాధ్యుడు : మురళీధర్ రావు

కాగా కూచుకుళ్ల గతంలో కాంగ్రెస్ తరపున సర్పంచ్ గా, ఎంపీపీగా, జడ్పీసీటీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీ గా గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. గత కొంతకాలంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డితో ఆయనకు విబేధాలు రావటంతో ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో గొడవ పెద్దదైంది. ఇక బీఆర్ఎస్ లో ఇమడలేక కూచుకుళ్ల కాంగ్రెస్ లోకి వెళ్లటానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.