Heavy Rains : తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

రాష్ట్రంలో శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ..

Heavy Rains : తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated On : July 19, 2024 / 11:46 AM IST

Heavy Rains In Telangana : తెలంగాణలో గత వారం రోజులుగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కాగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

Also Read : Coconut Plantation : కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో, వక్కసాగు.. అదనపు ఆదాయం అంటున్న రైతు

రాష్ట్రంలో శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఆ సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో గంటలకు 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవచ్చునని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా ఇవాళ (శుక్రవారం) నాలుగు జిల్లాల్లో, శనివారం ఆరు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Also Read : బాబోయ్.. పోలీసును కర్రతో దారుణంగా కొట్టిన వ్యక్తి, ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం అదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఆయా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గత వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లోనూ, తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. శుక్ర, శనివారాల్లో అతిభారీ వర్షాల కారణంగా.. పలు ప్రాతాల్లో ఒకేసారి వరద ముంచుకురావడం, రోడ్లు, లోలెవల్ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.