కనీసం ముఖం కూడా చూపించడం లేదు..! బీజేపీలో హాట్ టాపిక్‌గా ఆ ఐదుగురు ఎమ్మెల్యేల తీరు

గత వారం పార్టీ సమావేశానికి వచ్చిన రాజాసింగ్‌.. ఆ వెంటనే వెళ్లిపోయారు. నగరంలోనే ఉంటున్నా, పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీసం ముఖం కూడా చూపించడం లేదు..! బీజేపీలో హాట్ టాపిక్‌గా ఆ ఐదుగురు ఎమ్మెల్యేల తీరు

Gossip Garage : గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు పార్టీ గుమ్మం తొక్కడమే మానేశారట.. ఏదైన పార్టీ కార్యక్రమం ఉంటే ఒకసారి వచ్చి ముఖం చూపి.. మొక్కుబడి తంతుగా ముగించేస్తున్నారట… ప్రతిపక్షంలో ఉన్నామని.. సమస్యలపై ప్రజల గొంతుకై పోరాడాలనే కనీస ధర్మం విస్మరిస్తున్నారని సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆ ఎమ్మెల్యేలు… ఉన్న 8 మందిలో ఐదుగురు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించడం అటు పార్టీలోనూ.. ఇటు ప్రజల్లోనూ అసంతృప్తికి కారణమవుతుందంటున్నారు…. తెలంగాణ బీజేపీలో హాట్‌టాపిక్‌గా మారిన ఆ ఎమ్మెల్యేల ఎవరంటే..

కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదనే ఆరోపణలు..
తెలంగాణ బీజేపీలో కొందరి ఎమ్మెల్యేల తీరు విమర్శలకు కారణమవుతోంది. ముఖ్యంగా అప్పుడప్పుడు జరిగే పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతున్న సదరు ఎమ్మెల్యేలు.. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వారు రిలాక్స్‌గా ఉండటం కార్యకర్తల అసంతృప్తికి కారణమవుతోందంటున్నారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మాత్రమే ప్రభుత్వంపై పోరాటానికి ముందువరుసలో నిలబడుతున్నారు.

ఆర్‌ ట్యాక్స్‌, బి ట్యాక్స్‌, యూ టాక్స్‌ అంటూ సరికొత్త పద్ధతిలో విమర్శలకు దిగుతూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఆయనకు అండదండగా నిలవాల్సిన మిగిలిన ఎమ్మెల్యేలు కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, పాల్వాయి హరీశ్‌ మాత్రం అడపాదడపా వస్తున్నా ప్రతిపక్ష పాత్రలో పూర్తిస్థాయిలో పోరాడలేకపోతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్ర నిరాశలో కేడర్..
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పార్టీకి పెద్దగా ఎమ్మెల్యేల బలం లేకపోయినా, గట్టిగా పోరాడిన బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా బలపడింది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో కొంత నిస్తేజం కనిపిస్తోందని… దీనికి ఎమ్మెల్యేల తీరే కారణమనే టాక్‌ వినిపిస్తోంది. అలకలతో కొందరు… అలసత్వంతో మరికొందరు పార్టీ గుమ్మం తొక్కకపోవడంతో క్యాడర్‌లో ఉత్సాహం సన్నగిల్లుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడేందుకు క్యాడర్‌ సిద్ధంగా ఉన్నా.. ఎమ్మెల్యేలు మద్దతు లోపిస్తుండటంతో క్యాడర్‌ నిరాశకు గురవుతున్నట్లు చెబుతున్నారు.

సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ను ఓడించిన ఎమ్మెల్యే దర్శనం గగనం..
బీజేఎల్పీ లీడర్‌ మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌, పాయల్‌ శంకర్‌ తప్ప మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు గత ఏడు నెలల్లో పార్టీ ఆఫీసుకు వచ్చిన సందర్భాన్ని చేతివేళ్లపై లెక్కించొచ్చని అంటున్నారు కార్యకర్తలు. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ను ఓడించి… జెయింట్‌ కిల్లర్‌గా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి దర్శనం గగనంగా మారిందని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విధానాలపై పార్టీ కార్యాలయానికి వచ్చి మాట్లాడాల్సిందిగా, హైకమాండ్‌ కోరుతున్నా, ఎమ్మెల్యే కేవీఆర్‌ తేలిగ్గా తీసుకుంటున్నారని చెబుతున్నారు.

గౌరవం ఇవ్వడం లేదని రాజాసింగ్ అలక..
ఇక హైదరబాద్‌ నగరంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ పార్టీపై అలక వహించినట్లు ప్రచారం జరుగుతోంది. మూడుసార్లు గెలిచిన తనకు పార్టీలో సముచిత గౌరవం ఇవ్వడం లేదని ఆయన కినుక వహించారట… తన అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్న రాజాసింగ్‌… అప్పుడప్పుడు మాత్రమే పార్టీ కార్యాలయంలో కనిపిస్తున్నారు. గత వారం పార్టీ సమావేశానికి వచ్చిన రాజాసింగ్‌.. ఆ వెంటనే వెళ్లిపోయారు. నగరంలోనే ఉంటున్నా, పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాను హోంమంత్రి అవుతానంటూ చెప్పుకుంటున్నట్లు ప్రచారం..
ఇక ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సైతం పార్టీ కార్యాలయం ముఖం చూడటం లేదంటున్నారు. సోషల్ మీడియా ఇంటర్వ్యూలకు ప్రాధాన్యమిస్తున్న రాకేష్‌రెడ్డి… వచ్చేది బీజేపీ ప్రభుత్వమని… తాను హోంమంత్రి అవుతానంటూ చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు రాకేశ్‌రెడ్డి. పార్టీ కార్యక్రమాలు చేయకుండా, ప్రభుత్వంపై పోరాడకుండా… ఇలా కలలు కంటే ఉపయోగమేముందని నిలదీస్తున్నారు బీజేపీ నేతలు. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సైతం పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదంటున్నారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ కూడా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేల దారిలోనే నడుస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు ఇలా దూరం.. దూరంగా ఉండటంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడు నెలలయ్యాయని… ప్రభుత్వ హామీలు అమలు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒత్తిడి పెంచుతుంటే.. బీజేపీ ఎమ్మెల్యేలు నిస్తేజంగా ఉండటం సబబు కాదంటున్నారు ఆ పార్టీ నేతలు. మరి బీజేపీ ఎమ్మెల్యేల తీరు ఇప్పటికైనా, మారుతుందా? లేక ఎప్పటిలాగే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తారా? అన్నది వేచి చూడాల్సివుంది.

Also Read : రుణమాఫీ తర్వాత రేవంత్‌ సర్కార్‌ ముందున్న మరో అతిపెద్ద సవాల్ ఏంటి?