Pro Panja League 2023: రన్నరప్​గా కిరాక్ హైదరాబాద్​.. ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు జట్టు

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కిరాక్‌ హైదరాబాద్‌ 28-30 తేడాతో కొచి కెడిస్‌ చేతిలో పోరాడి ఓడిపోయింది.

Pro Panja League 2023: రన్నరప్​గా కిరాక్ హైదరాబాద్​.. ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు జట్టు

Pro Panja League 2023

Kirak Hyderabad Team: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్‌ రెజ్లింగ్‌) మొదటి సీజన్​లో తెలుగు రాష్రాల జట్టు కిరాక్‌ హైదరాబాద్‌ రన్నరప్‌‌గా నిలిచింది. లీగ్‌ దశతో పాటు సెమీఫైనల్లో అద్భుత ఆటతీరు కనబరిచిన హైదరాబాద్‌ జట్టు ఫైనల్లో టై బ్రేకర్‌లో పట్టు విడిచింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కిరాక్‌ హైదరాబాద్‌ 28-30 తేడాతో కొచి కెడిస్‌ చేతిలో పోరాడి ఓడిపోయింది. అండర్‌ కార్డు, మెయిన్ కార్డు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లూ సమంగా నిలిచాయి. టై బ్రేకర్‌ లో సత్తా చాటిన కొచ్చి తొలి సీజన్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. సీజన్‌‌లో అద్భుతంగా పోరాడి రన్నరప్‌‌గా నిలిచిన హైదరాబాద్​ ఆర్మ్‌ రెజ్లర్లను ప్రాంఛైజీ యజమానికి నెదురుమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్‌ రెడ్డి అభినందించారు.

Pro Panja League 2023

Pro Panja League 2023

 హోరాహోరీగా అండర్​ కార్డ్‌ మ్యాచ్‌లు ..

అండర్‌ కార్డు మ్యాచ్‌లు హోరీహోరీగా సాగాయి. ఇరుజట్లు సమంగా నిలిచాయి. తొలిదైన పురుషుల 60 మ్యాచ్‌లో ఎంవీ నవీన్​ 0–1తో రుద్ర నాయక్​ చేతిలో పరాజయం పాలయ్యాడు. అయితే, స్పెషల్​ కేటగిరీ మ్యాచ్​లో బుట్ట సింగ్​ 1–0తో కొచ్చి ఆర్మ్​ రెజ్లర్​ ఆసిఫ్​ అహెమ్​ను ఓడించాడు. మహిళల 53కేజీ మ్యాచ్​లో సవిత కుమారి 1–0తో అభిరామిపై విజయం సాధించి కిరాక్​ హైదరాబాద్​‌కు 2–1తో ఆధిక్యం కట్టబెట్టింది. అండర్​ కార్డ్‌లో చివరిగా 100 కేజీల పోరులో జగదీశ్​ 0–1తో ప్రిన్స్ కుమార్​ చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో, అండర్‌ కార్డ్‌ రౌండ్‌ను ఇరు జట్లూ 2–2తో ముగించాయి.

Pro Panja League 2023

Pro Panja League 2023

చివరిలో తడబాటు ..

మెయిన్​ కార్డ్‌లోనూ హైదరాబాద్​కు సరైన ఆరంభం లభించలేదు. కిరాక్​ హైదరాబాద్​ స్టార్ ఆర్మ్ రెజ్లర్​ మధుర మొదటిదైన 65 కేజీ మ్యాచ్​లో 0–5తో చేతన శర్మ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా హైదరాబాద్​ 2–7తో వెనుకబడింది. తర్వాత జరిగిన పురుషుల 70 కేజీ పోరులో స్టీవ్​ థామస్​ 10–0తో ఆకాశ్​ కుమార్​ను ఓడించడంతో హైదరాబాద్ 12–7తో ఆధిక్యంలోకి వచ్చింది. కానీ, 65 ప్లస్​ కేజీ కేటగిరీలో జిన్సీ జోస్​ 0–10తో యోగేశ్​ చౌదరి చేతిలో పరాజయం పాలవడంతో కొచ్చి 17–12తో ముందంజ వేసింది. కీలకమైన 80 కేజీ పోరులో హైదరాబాద్​ కెప్టెన్​ అస్కర్​ అలీ 10–0తో ప్రిన్స్​ ధిర్​ను చిత్తు చేయడంతో హైదరాబాద్​ 22–17తో మళ్లీ ఆధిక్యం సాధించింది. ఆపై, 90 కేజీ పోరులో సిద్దార్థ్​ మలాకర్​ 5–0తో కొచ్చి ఆర్మ్​ రెజ్లర్​ అక్బర్​ షేక్​ను ఓడించడంతో కిరాక్​ హైదరాబాద్​ 27–17తో పది పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. కానీ, చివరిదైన ప్లస్​ 100 కేజీల పోరులో ఉజ్వల్​ అగర్వాల్​ 0–10 తేడాతో మజాహిర్​ సైదు చేతిలో ఓడిపోవడంతో స్కోరు 27–27తో సమం అయింది.

టై బ్రేకర్‌‌లో బోల్తా ..

విజేతను నిర్ణయించే టై బ్రేకర్‌‌లో కిరాక్​ హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. మిక్స్​డ్​ వెయిట్​ కేటగిరీ తొలిపోరులో స్టీవ్​ థామస్​ 1–0తో రుద్ర నాయక్​పై గెలిచాడు. రెండో పోరులో కెప్టెన్‌ అస్కర్‌ అలీ 0–1తో ముజాహిర్‌ చేతిలో ఓడిపోయాడు. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మధుర 0–1తో చేతన శర్మ చేతిలో, జిన్సీ జోస్ 0–1తో యోగేశ్‌ చౌదరి చేతిలో పరాజయం పాలవడంతో హైదరాబాద్‌ ట్రోఫీని చేజార్చుకుంది.