ఊసరవెల్లి వైరస్‌.. మ్యుటేషన్‌తో జీనోమ్‌లో మార్పులు.. షాక్ అవుతున్న సైంటిస్టులు!

  • Published By: sreehari ,Published On : June 30, 2020 / 08:44 PM IST
ఊసరవెల్లి వైరస్‌.. మ్యుటేషన్‌తో జీనోమ్‌లో మార్పులు.. షాక్ అవుతున్న సైంటిస్టులు!

ప్రపంచమంతా కరోనా వాక్సిన్ గురించి కలవరిస్తోంది . అందుక్కారణం ఒక్కటే . ఇప్పటికే కరోనా ప్రపంచాన్ని చుట్టేసింది . లక్షల మంది ప్రాణాలు బలిగొంది . రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతూ పోతోంది . మందు లేదు , చికిత్స లేదు . మరోపక్క వైరస్ మ్యుటేషన్ మరింత భయపెడుతోంది . తీరా వాక్సిన్ బయటకొచ్చినా వైరస్ మ్యుటేషన్ కారణంగా అది పని చెయ్యకపోతే పరిస్థితి ఏమిటి ? ఇలా అనేక ప్రశ్నలు మానవాళిని భయపెడుతున్నాయి.

ప్రపంచం లో కరోనా మహమ్మారి ప్రభావం ముగిసిందనుకుంటే పొరపాటు. నిజానికి ఇప్పుడే వేగం పుంజుకుంది. రోజూ దాదాపు రెండు లక్షల మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అవుతోంది. దీన్ని బట్టి మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా వైరస్ విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలిబుచ్చిన అభిప్రాయమిది. దీనర్ధం ముందుముందు కరోనా మహమ్మారి మరింతగా రెచ్చిపోయి మనుషుల ప్రాణాలు హరించవచ్చు. ఎందుకంటే వైరస్ మ్యుటేషన్ చెందుతున్న తీరు ఇదే చెబుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

కరోనా విజృంభణకు మరెవ్వరో కాదు ప్రపంచ దేశాలే కారణమని కూడా ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసుస్ ఆరోపించారు . ఎందుకంటే కాంటాక్ట్ ట్రేసింగ్ లో అన్ని దేశాలూ విఫలం అయ్యాయన్నారు . అందుకే వైరస్ కట్టడి సాధ్యం కావడం లేదన్నారు . కాంటాక్ట్ ట్రేసింగ్ లో విఫలమై సాకులు చెబుతున్నాయని కూడా అయన విమర్శించారు . కాంటాక్ట్స్ పెద్ద సంఖ్య లో ఉన్నారనీ , ట్రేసింగ్ చాలా కష్టమౌతోందనీ కుంటి సాకులు చెబుతున్నాయన్నారు .

కాంటాక్ట్ ట్రేసింగ్ తో మహమ్మారి కట్టడి అవుతుందంటే … ప్రాణాలొడ్డి అయినా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాల్సిందేనని, దానికి ప్రత్యామ్నాయం లేదన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికి పైగా కరోనా సోకింది. అయిదు లక్షల మందికి పైగా బలయ్యారు. రోజోరోజుకూ ఈ లెక్కలు పెరుగుతూనే ఉన్నాయి . మరోపక్క వైరస్ మ్యుటేషన్ మరింత భయపెడుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు . షికాగోలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయం నిర్ధారించారు.

కరోనా వైరస్ జీనోమ్‌లో జరుగుతున్న మార్పులు దాన్ని మరింత బలమైన అంటువ్యాధిలా మార్చుతోందని వారన్నారు . పరిశోధనల కోసం శాస్త్రవేత్తలు 50 వేల వైరస్ జీనోమ్‌లను అప్లోడ్ చేశారు . అందులో 70 శాతం మార్పు చెందాయి. స్థానికంగా ఉన్న కరోనా రోగుల నుంచి సాంపిల్స్ సేకరించిన శాస్త్రవేత్తలు అవి పదేపదే మార్పులు చెందడాన్నిగుర్తించారు . ఇలా మార్పులు చెందిన వైరస్ మరింత బలమైన అంటువ్యాధిలా మారుతోందని లేబొరేటరీ ప్రయోగాల్లో తేలింది . ఈ అధ్యయనాలను ఇతర శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించవలసి ఉంది . ఐరోపా దేశాలూ , అమెరికాలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఇదే కారణమని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి . పైగా ఒక్కో దేశంలో ఒక్కో తరహాలో ఈ వైరస్‌ నిర్మాణం కనిపిస్తోంది.

లక్షణాలు కూడా ఒక్కో మనిషిలో ఒక్కో తరహాలో ఉంటోంది. చాలామందిలో అయితే అసలు లక్షణాలనే చూపించడం లేదు. అంటే ఊసరవెల్లిలా పరిస్థితులకు తగ్గట్లుగా తన రూపాన్ని ఈ వైరస్‌ మార్చుకుంటోందన్నమాట. కరోనా వైరస్ తనకు తానుగా పునరుత్పత్తి చేసుకోలేదు . మనిషి కణాల్లోకి ప్రవేశించినప్పుడు మాత్రమే అది కొన్ని వేల వైరస్ లుగా వృద్ధి చెందుతుంది . ఈ కారణాలవల్లనే వేగంగా వాక్సిన్ సిద్ధం చేయడానికి ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి . తీరా వాక్సిన్ వచ్చాక వైరస్ పరివర్తనం కారణంగా అది పని చేస్తుందా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంటుంది . జీనోమ్ పరివర్తనం కారణంగా అది వాక్సిన్ కు లొంగుతుందా లేదా నిర్ధారణ కావలసి ఉంది . వైరస్ పరివర్తనం ప్రమాదకరం కాకుంటే వాక్సిన్ కు లొంగుతుంది . లేదంటే కష్టం . దీనిపైనా ఇప్పుడు అధ్యయనం జరగాల్సి ఉంది.