కాంగ్రెస్‌ మరోసారి మా చెల్లిని ప్రయోగించింది.. ఇక బీజేపీ..: జగన్ సంచలన కామెంట్స్

ఎన్నికల్లో పోటీ తమ పార్టీకి, టీడీపీ, పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన మధ్యే ఉంటుందని ఆయన చెప్పారు. ఇక బీజేపీ ప్రభావం ఉండబోదని అన్నారు.

కాంగ్రెస్‌ మరోసారి మా చెల్లిని ప్రయోగించింది.. ఇక బీజేపీ..: జగన్ సంచలన కామెంట్స్

YS Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఇండియా టుడే సదస్సులో పాల్గొని సంచనల కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తమ సోదరిని ప్రయోగించిందని చెప్పారు. గతంలోనూ తమ బాబాయిని మంత్రిగా చేసి తమకు వ్యతిరేకంగా పోటీ చేయించారని అన్నారు. అలాగే తమ కుటుంబాన్ని కూడా విభజించారని చెప్పారు.

‘వారి పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు. కానీ అధికారం అనేది దేవుడు ఇచ్చేది. దేవుడ్ని నేను బలంగా నమ్మతాను. అంతా ఆయనే చూసుకుంటాడు’ అని వైఎస్ జగన్ చెప్పారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతుందని జగన్ అన్నారు.

విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని చెప్పారు. ఇక బీజేపీకి ఏపీలో బలం లేదని జగన్ అన్నారు. ఏపీ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తన వల్ల ప్రజలకు మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని ధైర్యంగా అడుగుతున్నానని జగన్ చెప్పారు.

ఏపీలోని అన్ని రంగాల్లో పెను మార్పులు తీసుకువచ్చామని జగన్ తెలిపారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు. తమ ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇదని అన్నారు.

చంద్రబాబు విషయంలో తమకు ప్రతీకారం అన్నది లేనే లేదని జగన్ చెప్పారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరిందని, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్‌ విధించిందని తెలిపారు. అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుందని అడిగారు. సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్‌, బీజేపీ ఉనికి పెద్దగా ఉండదని అన్నారు. ఎన్నికల్లో పోటీ తమ పార్టీకి, టీడీపీ, పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన మధ్యే ఉంటుందని ఆయన చెప్పారు.

Also Read: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. కర్నూలు వైసీపీలో టికెట్ ముసలం, బయటపడ్డ వర్గ విభేదాలు