Badminton Asia Team Championships : బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ ఛాంపియ‌న్‌షిప్ విజేత‌గా భార‌త్‌.. చ‌రిత్ర‌లో తొలిసారి

బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ ఛాంపియ‌న్‌షిప్ విజేత‌గా భార‌త జ‌ట్టు నిలిచింది.

Badminton Asia Team Championships : బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ ఛాంపియ‌న్‌షిప్ విజేత‌గా భార‌త్‌.. చ‌రిత్ర‌లో తొలిసారి

India crowned Badminton Asia Team champions for 1st time

బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ ఛాంపియ‌న్‌షిప్ విజేత‌గా భార‌త జ‌ట్టు నిలిచింది. మలేషియాలోని సెలంగోర్‌లో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ జ‌ట్టును భార‌త్ 3-2 తేడాతో ఓడించి చ‌రిత్ర సృష్టించింది. క్రీడా చ‌రిత్ర‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కాంటినెంటల్ టీమ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ గెలుచుకోవడం ఇదే తొలిసారి.

భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్‌లు పీవీ సింధు, గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ, టీనేజ్ సంచలనం అన్మోల్ ఖర్బ్ లు త‌మ త‌మ మ్యాచుల్లో గెలుపొందారు. థామ‌స్ క‌ప్‌ను గెలుచుకున్న రెండేళ్ల త‌రువాత ఖండాంతర టోర్నమెంట్‌లో భారత్ అద్భుతంగా రాణించి చైనా, హాంకాంగ్, జపాన్, చివరికి థాయ్‌లాండ్‌లను ఓడించి క‌ప్పును గెలుచుకుంది.

పైన‌ల్స్‌లో మొద‌ట‌గా సుప‌నిందా కతేథాంగ్‌ను 21-12, 21-12 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఈ మ్యాచ్ కేవ‌లం 39 నిమిషాల్లోనే ముగిసింది. దీంతో భార‌త్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ 21-16, 18-21, 21-16తో కిటితారాకుల్‌-ర‌వింద్ర ప్ర జోంగ్‌జాయ్ పై విజ‌యం సాధించడంతో భార‌త్ 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

అయితే.. మూడో మ్యాచ్‌లో అష్మితా చ‌లిహా 11-21, 14-21తో బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్ పై ఓడిపోయింది. దీంతో భార‌త ఆధిక్యం 2-1కి త‌గ్గింది. నాలుగో మ్యాచ్‌లో ప్రియా కొంజెంగ్‌బామ్-శ్రుతి మిశ్రా ల జోడీ 11-21, 9-21తో బెన్యాప ఐమ్‌సార్డ్-తకర్న్ ఐమ్‌సార్డ్ పై ఓడిపోయింది. దీంతో ఇరు జ‌ట్లు 2-2తో స‌మంగా నిలిచాయి. కీల‌క‌మైన ఐదో మ్యాచ్‌లో భార‌త యువ సంచ‌ల‌నం అన్మోల్ ఖర్బ్ 21-14, 21-9తో పోర్న్‌పిచా చోయికీవాంగ్ పై గెల‌వ‌డంతో 3-2 తేడాతో భార‌త్ ఫైన‌ల్ మ్యాచ్ గెల‌వ‌డంతో పాటు మొద‌టి సారి బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ ఛాంపియ‌న్‌షిప్ విజేత‌గా నిలిచింది.