చదువు మధ్యలోనే మానేశాను.. ఆ బాధేంటో నాకు తెలుసు: అక్బరుద్దీన్ ఒవైసీ ఎమోషనల్

చదువు అనేది చాలా ముఖ్యం. నేను పెద్దగా చదువుకోలేదని ఈ సభలో అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడను. నేను డాక్టర్ కావాలనుకున్నాను. కానీ ఎంబీబీఎస్ చదువు మధ్యలోనే వదిలేశాను.

చదువు మధ్యలోనే మానేశాను.. ఆ బాధేంటో నాకు తెలుసు: అక్బరుద్దీన్ ఒవైసీ ఎమోషనల్

Akbaruddin Owaisi comments on his education qualification in Telangana Assembly

Akbaruddin Owaisi Education Qualification: తెలంగాణలో గత పదేళ్లలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. విద్యారంగంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల 8 వేల 200 కోట్ల స్కాలర్‌షిప్‌ బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేశారు కానీ స్కాలర్‌షిప్‌ బకాయిల చెల్లించలేదని తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణ అక్షరాస్యత బాగా తగ్గిందని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు.

”సోషియో ఎకామిక్ సర్వే ప్రకారం మన దేశంలో అక్షర్యాసత 77 శాతం. తెలంగాణలో లిటరసీ రేటు 65 శాతంగా ఉంది. దాదాపు 17 లక్షల మంది పిల్లలు చదువు మధ్యలోనే మానేశారు. ఇది చాలా బాధాకరం. చదువు మధ్యలోనే మానేసిన పిల్లలను మళ్లీ బడులకు తీసుకురావడానికి పార్టీలకు అతీతంగా అందరం పనిచేయాలి. చదువు అనేది చాలా ముఖ్యం. నేను పెద్దగా చదువుకోలేదని ఈ సభలో అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడను. నేను డాక్టర్ కావాలనుకున్నాను. కానీ ఎంబీబీఎస్ చదువు మధ్యలోనే వదిలేశాను. ఇది నన్ను చాలా బాధ పెట్టింది. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని ఎవరైనా అడిగితే ట్వల్త్ పాస్ అని మాత్రమే చెప్పగలను. చదువుకోలేకపోయానన్న బాధ ఎలా ఉంటుందో నాకు తెలుస”ని అక్బరుద్దీన్ ఒవైసీ ఎమోషనల్ అయ్యారు.

రేవంత్ రెడ్డి మంచి స్నేహితుడు
సీఎం రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని అక్బరుద్దీన్ వెల్లడించారు. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సభాధ్యక్షుడి స్థానంలో ఆయనను చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన స్నేహితుడిని గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో సీఎం రేవంత్ చిరునవ్వులు చిందించారు.

Also Read : కోమటిరెడ్డిది హాఫ్ నాలెడ్జ్.. హ‌రీశ్‌రావుకు నాలెడ్జే లేదు: అసెంబ్లీలో మాటల యుద్ధం

స్కాలర్‌షిప్‌ బకాయిలు చెల్లించాలి
కాగా, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంఐఎం పార్టీ తరపున నిర్వహిస్తున్న విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి రూ. 76 కోట్ల స్కాలర్‌షిప్‌ బకాయిలు రావల్సి ఉందన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 20 కోట్లుపైగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి దాదాపు వంద కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నా ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం నిరాకరించడం లేదని, విద్యార్థులకు కూడా విద్య అందిస్తున్నామని చెప్పారు. 100 కోట్ల రూపాయల బకాయిలతో వైద్య, విద్య సంస్థలను నడపడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చాలా తెలివిగా 2024 బకాయిలు చెల్లిస్తామని హామీయిచ్చారని, గత ప్రభుత్వం హయాంలో పెట్టిన బకాయిలు మాటేమిటని ప్రశ్నించారు. వాళ్లనే అడగండి అంటూ సీఎం రేవంత్ అనడంలో సభలో నవ్వులు విరిశాయి.