Chandrababu Naidu: ఢిల్లీలో కేంద్ర మంత్రితో చంద్రబాబు నాయుడు కీలక భేటీ

ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 12 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలకు..

Chandrababu Naidu: ఢిల్లీలో కేంద్ర మంత్రితో చంద్రబాబు నాయుడు కీలక భేటీ

CM Chandrababu Naidu

Updated On : July 27, 2024 / 5:47 PM IST

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై జల శక్తి మంత్రితో చర్చించారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తామని కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం తెలిసిందే.

పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని కేంద్రం ప్రకటించినందుకు ఇటీవల ఏపీ క్యాబినెట్ కూడా కృతజ్ఞతలు తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తిస్థాయి మొత్తం ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను చంద్రబాబు నాయుడు కోరినట్లు తెలుస్తోంది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అంగీకరించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 12 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ అంగీకరించింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమయ్యే 12 వేల కోట్ల రూపాయల ఖర్చుతో పాటు మొత్తం 50 వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ప్రతిపాదనలకు ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వం పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరిగిందని, వచ్చే మూడేళ్లలో తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామని ఇటీవలే పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ మార్చి 2026 నాటికి పూర్తవుతుందని కేంద్ర మంత్రి అన్నారు.

Also Read: మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై నిర్మలా సీతారామన్ కౌంటర్