దమ్ము, ధైర్యం ఉంటే నా మీద పగ తీర్చుకో: బాలినేని శ్రీనివాస్ రెడ్డి

మర్యాదగల కుటుంబంలో పుట్టామని, దమ్ము ఉంటే తనపైకి రావాలని సవాలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి విసిరారు.

దమ్ము, ధైర్యం ఉంటే నా మీద పగ తీర్చుకో: బాలినేని శ్రీనివాస్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఒంగోలుకు వచ్చిన ఆయనకు రైల్వే స్టేషన్ వద్ద వైసీపీ కార్యకర్తలు, బాలినేని అభిమానులు స్వాగతం పలికారు. తన రాజకీయ జీవితంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు.

ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తన మీద పగ తీర్చుకోవాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాలు విసిరారు. అంతేగానీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎదురు తిరగాలని అనుకుంటే తమ వాళ్లు ఏమీ తక్కువగా లేరని తెలిపారు. జనసేన నాయకులతో కలిసి తనపై వ్యతిరేకంగా ఒంగోలులో ప్లెక్సీలు వేయిస్తున్నారని అన్నారు.

తాను, తన కుమారుడు ఎక్కడికో పారిపోయానని చెబుతున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూకబ్జాలు చేశామంటూ దుష్ప్రచారం చేసి తమ కుటుంబ సభ్యులపై లేనిపోనివి ఆరోపణలు చేశారని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వారు దమ్ము ఉంటే ఈ ఆరోపణలను తేల్చాలని చెప్పారు.

తాము మర్యాదగల కుటుంబంలో పుట్టామని, దమ్ము ఉంటే తనపైకి రావాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాలు విసిరారు. వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేసే నీచ సంస్కృతి ఏంటని నిలదీశారు. తన ఓటమి వెనుకాల ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన తమ పార్టీలోని నాయకులు కూడా ఎవరనేది త్వరలోనే బయటపెడతానని అన్నారు. దామచర్ల జనార్దన్ చేసే ప్రతి అవినీతిని బయట పెడతానని చెప్పారు. ఎక్కడ అవినీతి జరిగినా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తానని అన్నారు.

కౌంటింగ్ రోజున ఎన్నికల మూడ్ చూసి బాధ వేసి ఒంగోలును విడిచి వెళ్లిపోయానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాను ఏ తప్పు చేశానని ప్రజలు భావించారో తనకు అర్థం కావడంలేదని అన్నారు. తాను 5 సార్లు గెలిచి అధికారంలో ఉన్న సమయంలో ఏ రోజూ ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని తెలిపారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారని చెప్పారు. తాను ఇక ఒంగోలును వదిలి పెట్టనని తెలిపారు.

Also Read: శ్వేత పత్రం విడుదల చేసి మరిన్ని సంచలన విషయాలు తెలిపిన చంద్రబాబు