శివ సేఫ్.. త్వరలోనే కువైట్ నుంచి రాష్ట్రానికి తీసుకొస్తాం- మంత్రి నారా లోకేశ్

తనకు సాయం చేయాలని, కువైట్ నుంచి బయటపడేయాలని, లేదంటే తనకు చావే దిక్కంటూ కన్నీరుమున్నీరు అయ్యాడు.

శివ సేఫ్.. త్వరలోనే కువైట్ నుంచి రాష్ట్రానికి తీసుకొస్తాం- మంత్రి నారా లోకేశ్

Ap Man Struck In Kuwait : కువైట్ ఎడారిలో చిక్కుకుని తీవ్ర కష్టాలు పడుతూ దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు వ్యక్తి, కార్మికుడు శివను అక్కడి ఇండియన్ ఎంబసీ కాపాడింది. అతడు త్వరలోనే రాష్ట్రానికి తిరిగి వస్తున్నాడని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కువైట్ లో తన కష్టాలపై కన్నీళ్లు పెడుతూ శివ పెట్టిన సెల్ఫీ వీడియోపై 10టీవీ ప్రత్యేక కథనం రూపొందించింది. దీనిపై ఏపీ మంత్రి లోకేశ్ స్పందించారు. వెంటనే ఆ విషయంపై దృష్టి పెట్టాలని టీడీపీ ఎన్ఆర్ఐ బృందానికి మంత్రి లోకేశ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో శివను త్వరలోనే ఏపీకి తీసుకొస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.

అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ, శంకరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విదేశాలకు వెళ్లి నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆశతో కువైట్ కు వెళ్లాలని శివ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అప్పులు చేసి మరీ రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ ద్వారా 2 నెలల క్రితం కువైట్ వెళ్లాడు శివ. అయితే శివకు ఇప్పిస్తామని పని వేరు, అక్కడి అప్పగించిన పని వేరు. అక్కడ ఎడారిలో జన సంచారమే లేని ప్రాంతంలో కోళ్లు, పావురాలు, గొర్రెలు, బాతులను మేపే పనిలో శివను పెట్టారు. సంబంధిత యజమానులు నాలుగు రోజులైనా అక్కడికి రాలేదు. తినడానికి తిండి లేదు. కనీసం తాగడానికి నీరు కూడా లేదు.

తల దాచుకోవడానికి ఒక్క చెట్టు కూడా లేదు. దాంతో శివ భయపడిపోయాడు. ఎవరితోనైనా తన బాధ చెప్పుకుందామంటే కనుచూపు మేరలో జన సంచారమే లేదు. దీంతో కుంగిపోయిన శివ వెంటనే తన భార్యకు, ఏజెంట్ కు సమాచారం అందించాడు. అక్కడ పని చేయాల్సిందేనని, మరో దారి లేదని ఏజెంట్ తేల్చి చెప్పడంతో.. చేసేదేమీలేక తాను పడుతున్న నరకయాతనను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు శివ. తనకు సాయం చేయాలని, కువైట్ నుంచి బయటపడేయాలని, లేదంటే తనకు చావే దిక్కంటూ కన్నీరుమున్నీరు అయ్యాడు. మరో రెండు రోజులు ఎడారిలోనే ఉంటే సచ్చిపోతానని బోరున విలపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Also Read : కువైట్ ఎడారిలో చిక్కుకున్న వ్యక్తిని గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేశ్