Onion Cultivation : ఖరీఫ్ ఉల్లిలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

Onion Cultivation : ఖరీఫ్ ఉల్లిని జూన్-జూలై నుండి అక్టోబరు-నవంబరు వరకు సాగుచేయవచ్చు. నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు సాగుకు అనుకూలంగా వుంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి  120నుంచి 150రోజులలో పంట పూర్తవుతుంది.

Onion Cultivation : ఖరీఫ్ ఉల్లిలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

Onion Cultivation

Onion Cultivation : నిత్యావసరంగా నిత్యం వాడుకలో వుండే కూరగాయ  ఉల్లి. గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో కొంతమేర సాగవుతున్నా, ఒక్క కర్నూలు జిల్లాలోనే దాదాపు 75వేల ఎకరాల్లో ఉల్లి సాగులో వుంది. ప్రస్థుతం ఖరీఫ్ ఉల్లి నాటేందుకు అనువైన సమయం. ఉల్లి నుంచి నాణ్యమైన, అధిక దిగుబడులు పొందటానికి, సాగులో ఎలాంటి శాస్ర్తీయ విధానాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉల్లి.. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోను సాగు చేయటానికి అనువైన పంట. కూరగాయగానే కాక వాణిజ్యపరంగా కూడా ఉల్లికి మంచి డిమాండ్ వుంది. ఉల్లి గుండెజబ్బులకి దివ్యఔషధం. శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించటంలోను కీలక పాత్ర పోషిస్తుంది. కంటికి, జ్ఞాపకశక్తికి, జీర్ణక్రియకు ఉపయోగపడే ఉల్లి… మన దినసరి ఆహారపు అలవాట్లలో భాగమైంది. అందుకే తల్లిచేయని మేలు ఉల్లి చేస్తుందంటారు.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

ఖరీఫ్ ఉల్లిని జూన్-జూలై నుండి అక్టోబరు-నవంబరు వరకు సాగుచేయవచ్చు. నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు సాగుకు అనుకూలంగా వుంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి  120నుంచి 150రోజులలో పంట పూర్తవుతుంది. యాజమాన్యం సక్రమంగా పాటించిన రైతులు ఉల్లిసాగులో ఎకరాకు 100నుంచి120క్వింటాళ్ల వరకు దిగుబడిని నమోదు చేస్తున్నారు. ఈ పంటలో సాగుచేసే కాలాన్ని బట్టి రకాలను ఎంచుకోవలసి వుంటుంది.  అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, అర్క నికేతన్, అర్క కళ్యాణ్, అర్క ప్రగతి, యస్-53 రకాలు ఖరీఫ్ కాలానికి అనువుగా వుంటాయి. సాధారణంగా మన రైతులు ఉల్లిని కాలానుగుణంగా రెండు రకాలుగా నాటుతూవుంటారు.

భూమిని బాగా దుక్కిదున్ని, బోదెలు చేసి, దానికి ఇరువైపులా నాటటం ఒక పద్ధతి అయితే….సమతల మళ్ళలో నాటుకోవటం మరొక పద్ధతి . ఖరీఫ్ లో వర్షాలు ఎక్కువగా వుంటాయి. కనుక బోదెలు చేసి, నాటే పద్ధతిని ఆచరిస్తే గడ్డలు నాణ్యంగా వుంటాయి. ఆరోగ్యవంతమైన నారు, అధిక దిగుబడులకు మూలం. కాబట్టి, సంప్రదాయ పద్ధతులకు తోడుగా శాస్త్రీయతను జోడించి తగిన మెళకువలు పాటించినట్లైతే, మంచి ఆరోగ్యవంతమైన నారు పొందే అవకాశం వుంటుంది. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 3నుంచి 4కిలోల విత్తనం సరిపోతుంది.నారు పెంపకానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పొలాన్ని 3,4సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి.ఒక్కోనారుమడి 1మీటరు వెడల్పు, 3మీటర్ల పొడవు, 15సెంటీమీటర్ల ఎత్తు వుండే విధంగా ఎత్తు మళ్ళను చేసుకుని, 2 మడుల మధ్య 1అడుగు దూరం వుంచుకోవాలి.

ఇలా వుంచటం వల్ల నారుమడుల మధ్య నడుస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టటానికి అనువుగా వుంటుంది.ఈవిధంగా ఎకరాకు  200నుంచి 250చదరపు మీటర్ల  స్థలంలో పెంచిన నారు సరిపోతుంది. రైతులు 50శాతం నీడనిచ్చే షేడ్ నెట్ లను ఉపయోగించినట్లయితే మొలకశాతం బాగుండి, నారు మరింత నాణ్యంగా వుంటుంది. ముందుగా కిలో విత్తనానికి 8గ్రాముల ట్రైకోడెర్మావిరడి కలిపి శుద్ధి చేయాలి. లేదా 3 గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్ కూడా ఉపయోగించి శుద్ధి చేసుకున్నట్లయితే చీడపీడల బారినుంచి పైరును కాపాడినవాళ్ళమవుతాం. నారుమళ్ళను 10రోజులకొకసారి, లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి మళ్ళను బాగా తడుపుకున్నట్లయితే నారుకుళ్లు తెగులును అరికట్టి, నాణ్యమైన నారును పొందవచ్చు.

ముందుగా ప్రధానపొలాన్ని 3,4సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. 30సెంటీమీటర్ల ఎడంతో బోదెలు చేసుకుని ఇరువైపులా నాటుకోవాలి.నాటేముందు నారును 1శాతం బోర్డోమిశ్రమంలో ముంచి నాటడం వల్ల భూమి నుంచి ఆశించే తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతోపాటు 24కిలోల భాస్వరం ఎరువును వేసి కలియదున్నుకోవాలి. 60నుంచి80కిలోల నత్రజని, 24కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను 2సమభాగాలుగా చేసుకుని నాటేటపుడు ఒకసారి, నాటిన 30రోజులకు 2వ సారి వేసి, నీటితడి ఇచ్చినట్లయితే గడ్డలు బాగా ఊరుతాయి.

ఖరీఫ్ లో అడపాదడపా పడే వర్షాలకు కలుపు సమస్య ఎక్కువగా వుంటుంది. కాబట్టి నారు నాటే ముందు, భూమిలో తగినంత తేమ వున్నప్పుడు ఎకరాకు 1.3లీటర్ల నుంచి 1.6లీటర్ల వరకు పెండిమిథాలిన్ లేదా 200మిల్లీ లీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్, 200లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును అదుపులో వుంచవచ్చు. విత్తిన 30, 45రోజుల దశలో ఒకసారి కలుపు తీయించి, మొదళ్లకు మట్టిని ఎగదోసినట్లయితే గడ్డలు దృఢంగా ఊరి, నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు.  నాటిన 60రోజుల వరకు వాతావరణ పరిస్థితులను అనుసరించి 4,5తడులను ఇవ్వాలి. గడ్డ ఊరేదశలో వారానికి ఒకతడిని ఇస్తే సరిపోతుంది. కోతకు 15రోజుల ముందే నీటితడులను ఇవ్వటం ఆపేయాలి.

ఉల్లి దిగబడులను ప్రభావితం చేసే చీడపీడలలో తామరపురుగులు ప్రధానమైనవి. ఇవి ఆకుల అడుగుభగాన చేరి రసం పీల్చటం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీన్ని రైతులు మజ్జిగతెగులుగా పిలుస్తారు. తామర పురుగుల నివారణకు లీటరు నీటికి 2మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ కలిపి10రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేసుకోవాలి. ఉల్లి 50శాతం ఆకుల పూర్తిగా నేలపై వాలిపోయిన దశలో తీతలు జరపినట్లయితే, నిల్వలో జరిగే నష్టాన్ని అధిగమించి, నాణ్యమైన ఉత్పత్తులను పొందినవాళ్ళమవుతాం.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు