పాక్‌ అండతో రెచ్చిపోతున్న ఉగ్రవాద గుంపులు.. అసెంబ్లీ ఎన్నికల ముందు అలజడి సృష్టించే ప్లాన్

ఈ ఒకటి రెండు ఘటనలే కాదు..ఈ మధ్య ఉగ్రవాద చొరబాట్లు బాగా పెరిగిపోయాయి.

పాక్‌ అండతో రెచ్చిపోతున్న ఉగ్రవాద గుంపులు.. అసెంబ్లీ ఎన్నికల ముందు అలజడి సృష్టించే ప్లాన్

ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఏ రూపంలో ఉగ్రమూక దూసుకొస్తుందో నిఘాకు చిక్కడం లేదు. పాకిస్థాన్ ఆర్మీ సహకారంతో..ఉగ్రవాద సంస్థలన్నీ ఉమ్మడి కుట్రలతో భారత్‌ను టార్గెట్‌ చేస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వేదికగా చేసుకుని..ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. వరుస టెర్రర్ అటాక్స్‌తో అలజడి సృష్టిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లో అశాంతిని క్రియేట్ చేసేందుకు పక్కా స్కెచ్‌ వేసిన పాక్.. తాము వెనకుండి నడిపిస్తున్న ఉగ్రవాద సంస్థలతో కొత్త కుట్రలకు స్కెచ్ వేస్తోంది. పదుల కొద్ది టెర్రరిస్ట్ సంస్థలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సమావేశమై.. భారత్‌లోని జమ్మూకశ్మీర్‌లో దాడులకు రూట్‌మ్యాప్ క్రియేట్‌ చేసినట్లు మన నిఘా సంస్థలు పసిగట్టాయి.

ఇండిపెండెన్స్ డేకు ఒక రోజు ముందు జమ్మూకశ్మీర్‌లో జరిగిన టెర్రర్ అటాక్‌లో భారత ఆర్మీ అధికారి కెప్టెన్ దీపక్ సింగ్ వీరమరణం పొందాడు. దోడా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయాడు దీపక్‌సింగ్. ఓ టెర్రరిస్ట్‌ను హతం చేశాయి భారత బలగాలు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి సమీక్షలు జరుగుతున్నాయి. ఆర్మీ టాప్‌ లెవల్‌ ఆఫీసర్‌పై కాల్పులకు దారి తీసిన పరిస్థితులు ఏంటో తేల్చే పనిలో ఉన్నాయి అధికారులు.

ప్రధాని మోదీ మూడోసారి పీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి బార్డర్‌లో ఉగ్రవాదుల కవ్వింపులు పెరిగిపోయాయి. అనంతనాగ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. కతువా, ఉధంపూర్, దోడా వంటి జిల్లాల్లో ఆర్మీ కాన్వాయ్‌లపై పలుమార్లు దాడులు, ఎదురుకాల్పులు జరిగాయి. నెల రోజుల క్రితమే ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైలెవల్ మీటింగ్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశారు. పెరుగుతున్న ముప్పుపై ఇప్పుడు మరోసారి అలర్ట్ అయింది కేంద్రం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

భారత్‌కు మరో రూపంలో పరీక్ష
సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఉగ్రమూకలను ఖతం చేస్తున్నాయి భారత బలగాలు. అయినా టెర్రర్ యాక్టివిటీ తగ్గడం లేదు. టెర్రరిస్టులకు పాక్ ఆర్మీ సహకారం ఉండటం దీనికి కారణమని తెలుస్తోంది. భారత భూభాగంలోకి దొంగచాటున చొరబడి..జమ్మూకశ్మీర్‌లో అటాక్స్ చేస్తున్నారు ఉగ్రవాదులు. ఈ ఏడాది జూలై 21 వరకు జరిగిన 11 ఉగ్రవాద ఘటనల్లో 28మంది భద్రతా సిబ్బంది, పౌరులు చనిపోయినట్లు హోంశాఖ ప్రకటించింది. దోడా ఎన్‌కౌంటర్‌లో జైషే-ఈ-మొహమ్మద్ హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు భారత అధికారులు.

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కోసం చేసిన సెర్చింగ్‌లో ఈ ఏడాది 21 మందిని మట్టుబెట్టినట్లు చెప్తోంది ఆర్మీ. 370 ఆర్టికల్ రద్దు తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయనుకున్న భారత్‌కు మరో రూపంలో పరీక్ష పెడుతోంది పాక్. ప్రతీవారం రోజుల్లో రెండు, మూడు మేజర్ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. దీనికి కారణం పాక్ సైన్యం కవ్వింపులు, కుట్రలే అని తేలిపోయింది. జమ్మూకశ్మీర్‌ కుప్వారాలో ఓ ఉగ్రదాడిపై కీలక విషయాలు బయటపెట్టింది భారత ఆర్మీ. కుప్వారాలో దాడి చేసింది.. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమేనని స్పష్టం చేసింది. పాక్‌ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్.. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడటానికి సాయం చేస్తోంది. ఈ ప్రాసెస్‌లో భారత ఆర్మీ ఆఫీసర్లే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.

అయితే ఈ ఒకటి రెండు ఘటనలే కాదు..ఈ మధ్య ఉగ్రవాద చొరబాట్లు బాగా పెరిగిపోయాయి. టైట్‌ సెక్యూరిటీ పెట్టినా, నిఘా వ్యవస్థను పటిష్టం చేసినా, స్థానికంగా ఇన్‌ఫార్మర్ వ్యవస్థ పనిచేస్తున్నా.. ఉగ్రవాద చర్యలు పెరగడంపై భారత్ బలగాలకు అంతు చిక్కలేదు. అయితే అచ్చం పాకిస్థాన్ సైన్యంలా పైకికవరింగ్‌ ఇస్తూ..గుట్టు చప్పుడు కాకుండా..నిఘాకు చిక్కకుండా.. భారత్‌ సైన్యంపై కాల్పులు జరిపి ప్రాణాలు బలి తీసుకోవడం పనిగా పెట్టుకున్నారు టెర్రరిస్ట్‌లు. ఈ కుట్రలను పసిగట్టిన భారత్‌ సైన్యం కౌంటర్ ఆపరేషన్‌ స్టార్ట్ చేసింది.

తలో పని..
రిక్రూట్‌మెంట్‌ నుంచి కోఆర్డినేషన్‌ వరకు.. ఫండింగ్‌ నుంచి స్లీపర్ సెల్స్ మెయింటెన్‌ చేసే వరకు తలో పని. టెర్రరిస్ట్‌ లీడర్లు మనిషికో డ్యూటీ. జైషే ఈ మహ్మద్‌, ఐఎస్‌ఐ..ఇలా ఏ టెర్రరిస్ట్ సంస్థ అయినా పాక్‌ ప్రభుత్వ దిశానిర్ధేశంలో పని చేయాల్సిందే. ఫండింగ్‌ కోఆర్డినేషన్, ట్రైనింగ్, రిక్రూట్‌మెంట్‌, డ్రగ్ నెట్‌వర్క్‌, మనీలాండరింగ్‌, పనిని శాఖలుగా విభజించి..టాప్ టెర్రర్ లీడర్లకు బాధ్యతలు అప్పగించింది పాక్. స్వయంగా ఆ దేశ ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లోనే ఈ కుట్రలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. తెరవెనక ఉండి..నలుదిక్కుల భారత్‌ను ఇబ్బంది పెట్టే స్కెచ్ వేస్తుంది.

భక్త్‌ జమీన్ ఖాన్‌..
భక్త్‌ జమీన్ ఖాన్‌..ఆల్ బదర్‌ ఉగ్రసంస్థ చీఫ్‌. ఓవరాల్‌ టెర్రరిస్ట్ సంస్థలకు ఫండింగ్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిలిటెంట్ గ్రూప్‌ను నడిపిన అనుభవంతో.. పాకిస్థాన్ తరపున తన కిరాయి సైనికులతో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. టెర్రర్ సంస్థలను సమన్వయం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించింది పాక్. పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను సందర్శిస్తూ..టెర్రర్ గ్రూపులను కోఆర్డినేట్ చేస్తుంటారు భక్త్ జమీన్ ఖాన్.

మసూద్ అజార్..
జైషే ఈ మహ్మద్ చీఫ్‌ మసూద్ అజార్..టెర్రరిస్ట్‌ల ట్రైనింగ్‌లో కీరోల్ ప్లే చేస్తున్నారు. సప్లయింగ్ చైన్‌లో టాప్ లీడర్. అజార్ నాయకత్వంలో కొత్త రిక్రూట్‌మెంట్లు, ఆయుధ శిక్షణ కొనసాగుతోంది. హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్ దశాబ్దాలుగా కశ్మీర్‌లో అలజడికి కారణం అవుతున్నాడు. కశ్మీర్ స్వాతంత్ర్య పోరాటం పేరుతో యువతను ఉసిగొల్పుతున్నాడు. లష్కరే తోయిబాకు చెందిన సైఫుల్లా సాజిద్ జుట్ పాకిస్తాన్‌లో డ్రగ్స్-స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు. డ్రోన్ల ద్వారా ఆయుధాలను స్మగ్లింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ముగ్గేరే కాదు మరో ఏడుగురితో కలిపి మొత్తం పది మందితో టెర్రరిస్ట్ క్యాబినెట్‌ను ఏర్పాటు చేసింది పాక్.

త్వరలో జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు
త్వరలో జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దీంతో జమ్మూకశ్మీర్‌లో అలజడి సృష్టించి ఎలక్షన్‌ సాఫీగా జరగకుండా చేయాలని కుట్ర చేస్తోంది పాక్. ఉగ్రవాదులు, కశ్మీర్‌ స్వతంత్రను కోరుకునే కొందరు యువతతో కలసి అశాంతిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే అదనపు బలగాలను మోహరించింది. ఉగ్రవాదుల కోసం హెలికాప్టర్లు, డ్రోన్లతో ముమ్మరంగా గాలిస్తున్నారు. భారత్‌లోకి 50మంది ఉగ్రవాదులు చొరబడ్డారన్న అనుమానంతో..టెర్రరిస్ట్‌ల ఏరివేతకు 5వందల మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను రంగంలోకి దించారు.

జమ్మూ, రాజౌరి, పూంచ్, రియాసి, కతువా జిల్లాలు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారుతుండటంతో భద్రతా దళాలు విస్తృతంగా సెర్చ్‌ ఆపరేషన్ చేస్తున్నాయి. ఉగ్రవాదుల వ్యూహాలు, వారి దగ్గరున్న అత్యాధునిక ఆయుధాలు..పాకిస్థాన్‌ మాజీ సైనికుల దగ్గరి నుంచి కలెక్ట్ చేసుకున్నవని ఇంటలిజెన్స్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. జమ్మూకశ్మీర్​కతువాలో సైనిక వాహనంపై మెరుపుదాడి చేశారు ఉగ్రవాదులు. అదే సమయంలో భారత సైన్యం కూడా ప్రతిదాడులతో విరుచుకుపడింది. గాయపడిన సైనికులను కాపాడుకునేందుకు మిగతా జవాన్లు ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారు.

ఏకంగా 5 వేలకు పైగా రౌండ్ల కాల్పులు జరిపి, దాదాపు రెండు గంటల పాటు టెర్రరిస్ట్‌లకు చుక్కులు చూపించారు జవాన్లు. మరోవైపు ఉగ్రవాదుల ఏరివేత కోసం యాంటీ నక్సల్ ఆపరేషన్ స్పెషలిస్ట్‌ను రంగంలోకి దించారు. ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్‌ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ డీజీగా నియమితులయ్యారు. ఏపీ క్యాడర్‌కు చెందిన 1992 ఐపీఎస్ అధికారి అయిన 55 ఏళ్ల నళిన్ ప్రభాత్..ఆంధ్రప్రదేశ్‌లోని యాంటీ నక్సల్స్ ఫోర్స్ గ్రేహౌండ్స్‌ను నడిపించారు. ఆయనకు కశ్మీర్‌లో CRPF ఆపరేషన్ను నిర్వహించిన అనుభవం ఉంది.

పాక్‌, టెర్రరిస్టుల ఉమ్మడి కుట్రలను తిప్పే కొట్టేందుకు సరికొత్త వ్యూహం అమలు చేస్తోంది కేంద్రప్రభుత్వం. CRPF, ఆర్మీ, BSF అన్ని భద్రతాబలగాలను కోఆర్డినేట్‌ చేస్తూ..జాయింట్ ఆపరేషన్ చేసేలా పకడ్బందీ వ్యూహం అమలు చేస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు సాఫీగా నిర్వహించి తీరాల్సిందేనని..అప్పుడే పాక్‌ కుట్రలకు చెక్‌ పెట్టినట్లు అవుతుందని భావిస్తోంది.

Also Read: బాంబు బెదిరింపు.. మాల్స్‌ నుంచి కస్టమర్లు, సిబ్బందిని ఖాళీ చేయించిన పోలీసులు