వాళ్లు మా మహిళా నేతలపై నేల్ కట్టర్లు, పదునైన వస్తువులతో దాడులు చేశారు : కేటీఆర్ ఆగ్రహం

ఈ సంఘటనను రాజకీయం చేసేందుకు మహిళ కాంగ్రెస్ కార్యకర్తలు మా మహిళా నేతలపై దాడులు చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాళ్లు మా మహిళా నేతలపై నేల్ కట్టర్లు, పదునైన వస్తువులతో దాడులు చేశారు : కేటీఆర్ ఆగ్రహం

KTR

KTR : మహాలక్ష్మీ ఉచిత ఆర్టీసీ బస్సు పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. బుద్ధ భవన్ లోని మహిళా కమిషన్ ఎదుట హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టాన్ని, మహిళలను గౌరవించాలని మహిళా కమిషన్ ముందు నేను విచారణకు హాజరయ్యానని తెలిపారు. ఈ సంఘటనను రాజకీయం చేసేందుకు మహిళ కాంగ్రెస్ కార్యకర్తలు మా మహిళా నేతలపై దాడులు చేశారు. ఈరోజు జరిగిన దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని కేటీఆర్ అన్నారు.

Also Read : మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మహిళా నేతల పోటాపోటీ నినాదాలు.. ఉద్రిక్తత

మహిళా కమిషన్ కు గత తొమ్మిది నెలల్లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై వివరించాను. యథాలాపంగా నేను చేసిన వ్యాఖ్యలపై ఆ వెంటనే క్షమాపణలు చెప్పాను. మరోసారి మహిళా కమిషన్ తనను విచారణకు హాజరు కావాలని కోరింది. రాష్ట్రంలో మహిళలకు, చిన్నారులకు భద్రత లేకుండా పోతుందని మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని కేటీఆర్ అన్నారు. షాద్ నగర్, కొల్హాపూర్ లలో మహిళలపై జరిగిన దాడులను తెలియజేశానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ మహిళా నేతలు మా మహిళా నేతలపై నేల్ కట్టర్లు, పదునైన వస్తువులతో దాడులు చేశారు. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఎంత వరకు సమంజసమని కేటీఆర్ ప్రశ్నించారు.