Management of Cultivation : రబీకి అనువైన అపరాల రకాలు.. అధిక దిగుబడుల కోసం సాగు మేలైన యాజమాన్యం

తొలకరిలో వేసిన స్వల్పకాలిక పంటలైన వరి,  పెసర, మినుము పూర్తయిన చోట్ల, రెండవ పంటగా కందిని సాగుచేయవచ్చు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీ దిగుబడులు నాణ్యంగా వుంటాయి. తొలకరిలో వేసిన కంది ఎక్కువ ఎత్తు  పెరగటం వల్ల చీడపీడల ఉధృతి అధికంగా వుంటుంది.

Management of Cultivation : రబీకి అనువైన అపరాల రకాలు.. అధిక దిగుబడుల కోసం సాగు మేలైన యాజమాన్యం

Matti Manishi

Management of Cultivation : దీర్ఘకాలం పాటు భూమిలో వుండే సంప్రదాయ పంటల కన్నా, తక్కువ కాల పరిమితి కలిగిన పంటలే రైతుకు కొండంత అండగా వుటున్నాయి. ముఖ్యంగా స్వల్పకాలంలో పూర్తయ్యే అపరాల పంటలు ఇటు రైతుకు రొక్కాన్ని, అటు భూమికి బలాన్నిస్తూ వుంటున్నాయి. గతంలో నామమాత్రంగా వున్న వీటిసాగు నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌తో సాగుచేసే రైతుకు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా పెసర, మినుము, శనగ, కంది పంటలు విత్తుకోవటానికి ప్రస్తుతం అనువైన సమయం. మరి వీటిలో మేలైన రకాలేవో, సాగులో పాటించాల్సిన మెలకువలేవో తెలుసుకుందామా.

READ ALSO : YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల ఎంట్రీకి అడ్డుపడిందెవరు?

రానురాను తెలుగురాష్ట్రాలలో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గతకొంత కాలంగా ఆకర్షణీయంగా వున్న మార్కెట్ ధరలు… సంప్రదాయ పంటలకన్నా స్వల్పకాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణలు సైతం సూచిస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమయింది. అన్ని పంటల సరళిలో ఒద్ధికగా ఒదిగిపోవటం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవటం, ఏక పంటగానే కాక పలు అంతర, మిశ్రమపంటల కలయికతో వీటిసాగు ఆశాజనకంగా వుంది. తక్కువ వ్యవధిలోనే పంటచేతికొచ్చి, తర్వాత వేయబోయే పంటలకు అనువుగా వుండటంతో సాగు మరింత లాభదాయకంగా వుంది. ఖరీఫ్‌లో వేసిన పంటలు ప్రస్తుతం చివరి దశకు చేరుకోవటం, అలాగే ఏపంటా వేయకుండా ఖాలీగా వున్న ప్రాంతాల్లో ప్రస్తుతం అపరాలు విత్తేందుకు అనువైన సమయం.

ఉభయ రాష్త్టాలలో పెసర దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ, ఒకటిన్నర లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. ఉత్పాదకత పరంగా చూస్తే మనం ఇంకా వెనుకబడే వున్నాం. ఇందుకు గల కారణాలను గమనిస్తే సీజన్‌కు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోకపోవటం, యాజమాన్య, సస్యరక్షణ విషయాల్లో సరైన అవగాహణ లేకపోవటంతో ఆశించిన మేరకు దిగుబడులు పొందలేకపోతున్నాం. రబీకి అనువైన పెసర రకాలను గమనిస్తే.. లాంఫాం నుంచి విడుదలైన ఎల్.జి.జి. – 407, 410, 450, 460 రకాలు, అలాగే మధిర పరిశోధనా స్థానం నుంచి విడుదలైన ఎమ్.జి.జి. – 295, 347, 348 రకాలు వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన డబ్ల్యు.జి.జి. – 2, 37, 42, టి.ఎమ్ – 96 – 2 రకాలు రబీసాగుకు అనువుగా వుంటాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణా, కృష్ణా-గోదావరి, దక్షిణ మండలం మరియు ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబరుమాసంలో విత్తుకోవచ్చు.

READ ALSO : Cabbage and Cauliflower Cultivation : క్యాబేజి, కాలీప్లవర్ సాగులో అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

ఎకరాకు 12నుంచి 14కిలోల విత్తనం సరిపోతుంది. రబీలో సాగుచేయదగ్గ మరొక పంట – మినుము. రెండు తెలుగురాష్ట్రాలలో దాదాపు 11లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ, దాదాపు 3లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. వీటిలో రబీకాలానికి అనువైన రకాలను చూస్తే… యల్.బి.జి. – 20, 623, 645, 752, టి- 9, డబ్ల్యు.బి.జి. – 26, పి.యు. – 31 రకాలు అనువుగా వుంటాయి. ఎకరాకు 8నుంచి 10కిలోల విత్తనం సరిపోతుంది. మన ప్రాంతంలో ఖరిఫ్ వరి తర్వాత మాగాణి మినుమును సాగుచేయటం పరిపాటి. ఇలాంటి ప్రాంతాల్లో వరి కోయటానికి 2,3రోజుల ముందుగా విత్తనాన్ని వెదజల్లుతారు. ఇలా వెదజల్లే విధానంలో ఎకరాకు 16కిలోల విత్తనం అవసరమవుతుంది. పెసర, మినుము పంటల్లో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య – పల్లాకు తెగులు. ఈతెగులు సమస్యగా వున్న ప్రాంతాల్లో తట్టుకునే రకాలును ఎన్నుకుని, విధిగా విత్తనశుద్ధి చేసి, విత్తుకోవాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 30గ్రాముల కార్భోసల్ఫాన్ లేదా 5మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5గ్రాముల థయోమిథాక్సోమ్ కలిపి శుద్ధి చేసుకోవాలి.

రబీకాలంలో సాగుచేసుకోదగ్గ మరొక పంట – శనగ. నల్లరేగడినేలల్లో నిలువ వుండే తేమను, శీతాకాలంలోని మంచును ఉపయోగించుకుని ఈపంట పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 16లక్షల ఎకరాలలో సాగుచేయబడుతూ.. 9లక్షల టన్నుల దిగుబడినిస్తోంది. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఈపంటను విత్తుకోవటానికి అనువైన సమయం. నవంబరు తర్వాత సాగుచేస్తే దిగుబడులు తగ్గుతాయి. దీని సాగుకు సారవంతమైన నల్లరేగడి భూములు అనుకూలంగా వుంటాయి. చౌడు భూములు పనికరావు.

READ ALSO :Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

ఈపంటలో జె.జి.-11, కె.ఎ.కె. – 2, పూలే జి – 95311, క్రాంతి, శ్వేత, అన్నెగిరి, ఐ.సి.సి.వి. 10 రకాలు అనువుగా వుంటాయి. విత్తనమోతాదు మనం ఎన్నుకునే రకాలను బట్టి మారుతుంది. ఎకరాకు దేశీరకాలైతే 30నుంచి 40కిలోలు, కాబూలీ రకాలైతే 40-50కిలోల విత్తనం సరిపోతుంది. విత్తేముందు కిలో విత్తనానికి 3గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్ కలిపి విత్తనశుద్ధి చేసినట్లయితే భూమినుంచి ఆశించే శిలీంధ్రపు తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఎండుతెగులు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి  4గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తుకున్నట్లయితే మంచి ఫలితం వుంటుంది.

ఉభయరాష్ట్రాలలో పెసర, మినుము తర్వాత అధిక విస్తీర్ణంలో సాగుచేయబడుతున్న అపరాల పంట – కంది. సుమారుగా 12లక్షల ఎకరాలలో సాగుచేయబడుతూ, 3లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. కందిని ఏకపంటగానే కాక పలు పంటలతో కలిపి అంతర, మిశ్రమ పంటగా సాగుచేసుకునే వీలుండటం రైతుకు ఆర్థికంగా కలిసివచ్చే అంశం. రబీలో సెప్టంబరు 15నుంచి, అక్టోబరు 15వరకు ఈపంటను విత్తుకునే అవకాశం వుంది. అధిక వర్షాలు, బెట్ట పరిస్థితులతో ఖరీఫ్‌లో ఏపంటా వేయని ప్రాంతాల్లోను, లేదా పంటలు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లోను ప్రస్తుతం కందిని విత్తుకోవటానికి అనువైన సమయం.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

తొలకరిలో వేసిన స్వల్పకాలిక పంటలైన వరి,  పెసర, మినుము పూర్తయిన చోట్ల, రెండవ పంటగా కందిని సాగుచేయవచ్చు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీ దిగుబడులు నాణ్యంగా వుంటాయి. తొలకరిలో వేసిన కంది ఎక్కువ ఎత్తు  పెరగటం వల్ల చీడపీడల ఉధృతి అధికంగా వుంటుంది. అదే రబీకంది అనువుగా వుండి, జనవరిలో పూతకు రావటం వల్ల, ఈసమయంలో శనగపచ్చ పురుగు తాకిడి తక్కువగా వుంటుంది. రబీకాలానికి ఎల్.ఆర్.జి. – 30, 38, 41, ఐ.పి.యల్. 85063, యం.ఆర్.జి. 66, డబ్ల్యు.ఆర్.జి. 27, పి.ఆర్.జి. 158 రకాలు అనువుగా వుంటాయి. ఎకరాకు 6నుంచి 8కిలోల విత్తనం అవసరం పడుతుంది. ఎకరాకు సరిపడా విత్తనానికి 200గ్రాముల రైజోబియంను కలిపి విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. ఎండుతెగులు ఉధృతి ఎక్కువగా వున్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 5గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తితే తెగులును అరికట్టవచ్చు.