YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల ఎంట్రీకి అడ్డుపడిందెవరు?

షర్మిల ప్రయత్నాలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రేణుకాచౌదరి, వీహెచ్ లాంటి నేతలు ఎక్కడికక్కడే బ్రేక్లు వేస్తూ వచ్చారు. షర్మిల పార్టీ విలీనం వల్ల తెలంగాణలో నష్టమే తప్ప లాభం లేదని అధిష్టానానికి గట్టిగానే చెప్పారు ఈ నేతలంతా.

YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల ఎంట్రీకి అడ్డుపడిందెవరు?

why ys sharmila not merging her party in congress?

YS Sharmila- Telangana Congress: సినిమాల్లోని సస్పెన్స్.. సీరియల్స్‌లోని సాగదీత.. చివరికి ఊహించని ట్విస్టు.. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీన వ్యవహారం అత్యంత నాటకీయంగా సాగుతోంది. నాలుగు నెలల ప్రయత్నంలో ఆశించిన ఫలితం రాకపోవడంతో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల మరో దారి వెతుక్కునే పనిలో పడ్డారు. విలీనంపై ఏదో ఒకటి తేల్చాలని డెడ్‌లైన్ విధించినా.. కాంగ్రెస్ నుంచి ఏ స్పందనా రాకపోవడంతో ఒంటరి పోరాటానికే రెడీ అవుతున్నారు షర్మిల.. కాంగ్రెస్‌లో విలీనానికి ఎందుకు బ్రేక్ పడింది? ఈ బ్రేక్ తాత్కాలికమా.. శాశ్వతంగానే డోర్లు మూసుకుపోయాయా..? కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎంట్రీకి అడ్డుపడిందెవరు? తెరవెనుక ఏం జరిగింది?

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు వైఎస్ షర్మిల. కాబోయే తెలంగాణా సీఎంను కూడా తానేనంటూ ప్రకటించేశారు కూడా. ఉమ్మడి రాష్ట్రంలో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తన పార్టీకి మంచి రాజకీయ భవిష్యత్తుగా మారతాయని ఆశించిన షర్మిలకు నిరాశే మిగిలింది. పార్టీ పెట్టగానే వైఎస్‌తో అనుబంధం ఉన్న నేతలంతా తండోపతండాలుగా తరలివస్తారని ఆశించారు షర్మిల. ఒకరిద్దరు తప్ప.. ముఖ్య నేతలెవరూ షర్మిల పార్టీ వైపు కూడా చూడలేదు.. ఆ పార్టీ గడప కూడా తొక్కలేదు. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా రాష్ట్రంలో సుమారు 3 వేల 8 వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు వైఎస్ షర్మిల. అవకాశం దొరికినప్పుడల్లా ప్రజా సమస్యలపై రోడ్డు ఎక్కడమే కాకుండా ఓ సారి జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు. వ్యక్తిగతంగా తన ఇమేజ్ పెరిగిందే తప్ప.. పార్టీకి మాత్రం ఎలాంటి మైలేజ్ రాలేదు. దీంతో పునరాలోచనలో పడ్డ వైఎస్ఆర్ తనయ.. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తే ఓ పని అయిపోద్దనుకున్నారు. అనుకున్నదే తడువుగా తమ కుటుంబ మిత్రుడు, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం ద్వారా హైకమాండ్తో సంప్రదింపుల దాకా వెళ్లిపోయారు. అగ్రనేతలు సోనియా, రాహూల్ గాంధీతో చర్చించి విలీనానికి సై అనేశారు.

Also Read: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

కానీ, షర్మిల ప్రయత్నాలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రేణుకాచౌదరి, వీహెచ్ లాంటి నేతలు ఎక్కడికక్కడే బ్రేక్లు వేస్తూ వచ్చారు. షర్మిల పార్టీ విలీనం వల్ల తెలంగాణలో నష్టమే తప్ప లాభం లేదని అధిష్టానానికి గట్టిగానే చెప్పారు ఈ నేతలంతా. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా షర్మిలకు తెలంగాణాకు సంబంధమే లేదంటూ కుండబద్దలు కొడుతూ వచ్చారు. చివరకు షర్మిలకు అధిష్టానానికి మధ్యవర్తిగా ఉన్న డీకే శివకుమార్ను స్వయంగా కలిసి తన మనసులోని మాటను చెప్పేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ ఊపునకు షర్మిల పార్టీ విలీనం వల్ల బ్రేక్ పడుతుందని.. గత ఎన్నికల్లోనూ చంద్రబాబు రాకను కేసీఆర్ ఏ విధంగా అనుకూలంగా మార్చుకుందీ వివరించారు. ఇదేసమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు సైతం షర్మిల రాకపై పెద్దగా ఇంట్రస్ట్ చూపకపోవడంతో వైఎస్ఆర్టీపీ విలీనాన్ని పక్కన పెట్టేసింది కాంగ్రెస్ అధిష్టానం.

Also Read: అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ తర్జనభర్జన.. టికెట్ల ప్రకటన ఎప్పుడు?

ఇక దారులన్నీ మూసుకుపోవడంతో ప్రజాక్షేత్రంలో ఒంటరి పోరాటానికి రెడీ అవుతున్నారు షర్మిల. కాంగ్రెస్ అధిష్టానం కలిసొచ్చినా లేకపోయినా తన పార్టీ తరఫున పోటీకి రెడీ అవుతున్నారు. ముందే ప్రకటించినట్లు పాలేరు నుంచి అసెంబ్లీ బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇతర నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి ఉన్నవారి నుంచి ఈ నెల 9 తర్వాత దరఖాస్తులు తీసుకోడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరినీ చేర్చుకుంటున్న కాంగ్రెస్.. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె విషయంలో కఠినంగా వ్యవహరించడం ఇప్పుడు రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తోంది.