Pomegranate Cultivation : దానిమ్మ సాగులో కొమ్మ కత్తిరింపులు, పూత,నియంత్రణలో యాజమాన్యం!

ఏ సీజన్‌లో పంట తీసుకోవాలి, ఏ సమయంలో అధిక రేటు లభిస్తుందో నీటి సదుపాయం, భూమి లక్షణాలు, పురుగులు మరియు తెగుళ్ళు వలన కలిగే నష్టం మరియు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించుకోవాలి. బాక్టీరియా తెగులు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది.

Pomegranate Cultivation : దానిమ్మ సాగులో కొమ్మ కత్తిరింపులు, పూత,నియంత్రణలో యాజమాన్యం!

Pomegranate Cultivation : వాణిజ్య పరంగా పండించే పంర్లలో దానిమ్మ ముఖ్యమైనది. అత్యంత ఔషధ విలువలతో కూడిన రసాన్ని దానిమ్మ పండ్లనుండి పొందవచ్చు. పండ్ల చర్మం, రసం, ఆకులు మరియు వేర్లు అనేక రకాలైన ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పంటను కరువు ప్రాంతాలలో విజయవంతంగా సాగు చేయవచ్చు. మహారాష్ట్ర కర్దాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ గుజరాత్‌ మరియు రాజస్థాన్‌ రాష్ట్రాలలో దానిమ్మను వాణిజ్యపరంగా సాగుచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం దానిమ్మ సాగు చేయబడుతుంది. మంచి దిగుబడిని ఇస్తుంది.

పొడి వాతావరణం గల ప్రాంతాలలో నాణ్యమైన పండ్లను పండించవచ్చును. ఈ ప్రాంతాలలో తేమ శాతం అధికంగా ఉండి చీడ, పీడల ఉధృతి అధికంగా వుంటుంది. పండు నాణ్యత తగ్గుతుంది. దానిమ్మ సాగుకు అన్ని రకాల నేలలు పనికి వస్తాయి. సున్నపు శాతం, క్షారత కొద్దిగా అధికంగావున్న నేలల్లో కూడా దానిమ్మను సాగు చేయవచ్చు. లోతైన, సారవంతమైన, మురుగు నీరు పోయే వసతి గల నేలల్లో, ఉదజని సూచిక 7.0 నుండి 8.5 వరకు ఉన్న పొలాల్లో అధిక దిగుబడులతో దానిమ్మను సాగు చేయవచ్చును. 60 సెం.మీ. లోతున్న భూములు అనుకూలం. చీని, నిమ్మ, మామిడిలాంటి పండ్లతోటకు అనుకూలంగా కాని భూములలో కూడా దానిమ్మను లాభసాటిగా సాగు చేయవచ్చు. దానిమ్మ సాగులో గణేష్‌ భగువ, మృదుల, రూబీ, పూలే అరక్త, కాంధారి, జ్యోతి, పి-26, ధోల్కా పూలే భగువ సూపర్‌ మొలైన రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి.

నీటి యాజమాన్యం : నేలలో తేమ శాతం ఒకే విధంగా ఉండాలి. లేకపోతే కాయలు పగులుతాయి. మార్చి నుండి జులై వరకు భూమిలో తేమ సమంగా వుండేలా నీటి తడులు ఇవ్వాలి. దానిమ్మకు 0.5 మిల్లి మోల్స్‌ సెం.మీ. విద్యుత్‌ వాహకత గల ఉప్పు నీరు కూడా ఉపయోగించవచ్చు. గ్రిప్‌ పద్ధతి ద్వారా నీరు పెడితే చెట్టు పెరుగుదల, కాయల సంఖ్య మరియు బరువును 35 శాతం వరకు పెంచవచ్చు. ఫర్టిగేషన్ పద్ధతిలో కాయల బరువు, నాణ్యత పెరుగుతుంది. చెట్టుపై పూత కాయలు లేని సమయంలో నీటితడులు తగ్గించాలి. వేరు శనగ పొట్టు లేదా వరిపొట్టుతో 8 సెం.మీ. మందంతో చెట్ల పాదులందు మల్చింగ్‌ చేయాలి.

కత్తిరింపులు : ప్రతి మొక్కకు బలంగా పెరిగిన నాలుగు కొమ్మలను కాండాలుగా ఉంచి మిగిలిన కొమ్మలను కత్తిరించాలి. 2 – 3 సంవత్సరాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ కొమ్మలను తగు రీతిగా పెంచి సరైన ఆకారం తీసుకురావాలి. నేలకు ప్రాకే కొమ్మలు, గుబురుగా పెరిగే కొమ్మలు. నీటి కొమ్మలను కత్తిరించాలి. చెట్లకు విశ్రాంతినిచ్చే సమయంలో చివరి కొమ్మలను 10-15 సెం.మీ. పొడవు కత్తిరించాలి. కత్తిరించిన తర్వాత వచ్చిన చిగుర్లలో 2-3 ఉంచి మిగిలిన చిగుర్లను తీసివేసినచో బలమైన కొమ్మలపై పిందెలు ఏర్పడి కాయ సైజు పెరుగుతుంది. చెట్టుకు 60-80 కాయలు ఉంచి మిగతావి తీసివేయడం వలన కాయల సైజు, నాణ్యత పెరుగుతుంది. కత్తిరింపులకు వాడే కత్తెరలను 1 శాతం హైపోక్లోరైడ్‌ ద్రావణంలో శుద్ధి చేసి వాడాలి.

పూతకాలం మరియు నియంత్రణ : దానిమ్మకు సంవత్సరం పొడవునా పూత పూసే గుణం ఉన్నప్పటికీ, 3 సీజన్‌లలో జనవరి – ఫిబ్రవరి, జూన్‌ – జులై మరియు సెప్టెంబర్‌ – అక్టోబర్‌ నెలల్లో పూత ఎక్కువగా వస్తుంది. ఏ సీజన్‌లో పంట తీసుకోవాలి, ఏ సమయంలో అధిక రేటు లభిస్తుందో నీటి సదుపాయం, భూమి లక్షణాలు, పురుగులు మరియు తెగుళ్ళు వలన కలిగే నష్టం మరియు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించుకోవాలి. బాక్టీరియా తెగులు వర్నాక్రాలంలో ఎక్కువగా ఉంటుంది. గనుక సెప్టెంబర్‌ రెండవ వారంలోగాని అక్టోబర్‌ మొదటి వారంలో కాని వచ్చే పూతను నిలపడం మంచిది. జూన్‌ నెలల నుండి నీటి తడులు ఆపివేయడం వలన మొక్కలు అకులు రాల్చి నిద్రావస్థలోకి వెళతాయి. ఆ తరువాత కత్తిరింపులు చేసి, ఎరువు వేసి, తడులివ్వడం వలన మొక్కలన్నీ ఒకేసారి పుష్టిస్తాయి. కాయలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకు తయారవుతాయి. ఈ కాయలకు మంచి గిరాకీ ఉంటుంది.