Chili Narumadi : అధిక దిగుబడుల కోసం మిరప నారుమడిలో యాజమాన్యం

విత్తిన తర్వాత నారుమడికి వారం రోజులపాటు ఉదయం, సాయంత్రంపూట రోజ్ కేన్ తో పలుచగా నీరందించాలి. నారుమడిపై విత్తనం మొలకెత్తే వరకు గడ్డిని పరిచినట్లైతే తేమ ఆవిరికాకుండా వుండి విత్తనం త్వరగా మొలకెత్తుతుంది. 

Chili Narumadi : అధిక దిగుబడుల కోసం మిరప నారుమడిలో యాజమాన్యం

Chili Narumadi

Chili Narumadi : మిరప సాగులో మనదేశం ఉత్పత్తి, వాడుక, ఎగుమతుల్లో ప్రధమస్థానంలో వుంది. మొత్తం ఉత్పత్తిలో 40శాతం దిగుబడి, 75శాతం ఎగుమతులు మన ప్రాంతం నుంచే వుండటం విశేషం.  ప్రధానంగా గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, వరంగల్, కర్నూలు, కడప, విజయనగరం వంటి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో మిరపను సాగుచేస్తున్నారు. మిరపసాగులో అధిక దిగుబడి సాధించాలంటే మైలైన రకాల ఎంపికతోపాటు, ఆరోగ్యవంతమైన నారు పెంపకం తప్పనిసరి.  అన్ని ప్రాంతాల్లోను ప్రస్థుతం మిరప నారుమళ్లు పోసుకోవటానికి అనువైన సమయం. నాణ్యమైన నారు వుత్పత్తికి, మిరప నారుమళ్లలో పెంపకంలో పాటించాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Ginger Crop : అల్లంపంటలో దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగులు నివారణ

భారత దేశంలో మిరప ఉత్పత్తికి మన ప్రాంతం పేరుగాంచింది. మిరపలో జాతీయ సగటు దిగుబడి హెక్టారుకు ఒకటిన్నర టన్ను వుండగా మన ప్రాంతంలో అది 3టన్నులుగా వుంది. అయినా సాగు ఖర్చులతో పోలిస్తే ఈ సగటు దిగుబడి తక్కువనే చెప్పవచ్చు.. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ దిగుబడిని మరింత వృద్ధిచేసుకునే అవకాశం వుంది. ప్రస్థుతం రైతాంగం మిరప నారుమళ్లను పోసుకునే పనిలో వున్నారు. ఈ దశలో అధిక దిగుబడినిచ్చే మిరప రకాల ఎంపికతోపాటు, నాణ్యమైన నారు ఉత్పత్తి అనేది సాగులో కీలకమైన అంశం.

ప్రాంతాలకు అనుగుణంగా, ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులను బట్టి శాస్త్రవేత్తలు అనేక మిరప రకాలను రూపొందించారు. వీటిలో ప్రధానంగా జి-3, జి-4, జి-5,  సి.ఎ-960, సి.ఎ-1068 వంటి రకాలతో పాటు గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం నుంచి విడుదల చేసిన ఎల్.సి.ఎ -200, 235, 206, ఎల్.సి.ఎ- 305, 334, 353, వంటి రకాలు రైతులకు అందుబాటులో వున్నాయి. వీటితోపాటు ఎగుమతి ప్రాధాన్యత కలిగిన పాప్రికా మిరప రకాలు కూడా రైతులు సాగుచేయవచ్చు.మన ప్రాంతంలోఎక్కువగా వివిధ ప్రైవేటు హైబ్రిడ్ మిరప రకాలు ప్రాచుర్యంలో వున్నాయి.

READ ALSO : Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

రైతాంగం వర్షాధారంగా,నీటిపారుదల కింద రెండు విధాలుగా మిరపను సాగుచేస్తున్నారు. కొంతమంది రైతులు మిరపను మొదట్లో పచ్చిమిరప కోసం పెంచి 4,5కోతలు తీసుకున్న తర్వాత చివరి కోతలను ఎండు మిరప కోసం వదిలేయటం జరుగుతోంది. వర్షాధారంగా సాగుచేసే ప్రాంతాల్లో ఎండు మిరప సాగు ఒకటి రెండు కోతలకే పరిమితమవుతుంది. అందువల్ల రైతులు,  ప్రాంతానికి అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే మిరప రకాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుని నారుమళ్లు పోసుకోవాలి.

ఖరీఫ్ లో మిరప విత్తటానికి జూలై, ఆగష్టు నెలలు అనుకూలం. సాధారణంగా మిరప నారుమళ్లను నీటివసతి వున్న ప్రాంతాల్లో పెంచటం జరుగుతుంది. విత్తేటప్పుడు సాంప్రదాయ పద్ధతులకు తోడుగా శాస్త్రీయతను జోడించి సాగులో తగిన మెళకువలు పాటించినట్లైతే, మరింత ఆరోగ్యవంతమైన నారు పొందే అవకాశం వుంటుంది. నారు పెంపకానికి సాధ్యమైనంత వరకు ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. భూమిని నాలుగైదు సార్లు బాగా కలియదున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల చొప్పున పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 1 మీటరు వెడల్పు, 15సెంటీమీటర్ల ఎత్తు వుండేటట్లు నారుమడి తయారుచేసుకోవాలి. మడికి మడికి మధ్య 30 సెంటీమీటర్ల కాలవలు వుండేటట్లు ఏర్పాటుచేసుకోవాలి.

READ ALSO : Ladies Finger Planting : వేసవి పంటగా 2 ఎకరాల్లో బెండ సాగు.. 3 నెలలకే రూ. 2 లక్షల నికర ఆదాయం

ఒక సెంటు నారుమడిలో పోసిన నారు ఎకరానికి సరిపోతుంది. దీనికోసం 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తేముందు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి. కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ పట్టించాలి. తర్వాత 3 గ్రాముల కాప్టాన్ లేదా మాంకోజెబ్ కలిపి శుద్ధిచేయాలి. దీనివల్ల నారుమడిలో 20 రోజుల వరకు రసం పీల్చు పురుగులు,  విత్తనం, భూమి ద్వారా ఆశించే శిలీంధ్రపు తెగుళ్ల బెడద తగ్గుతుంది. ఇవే కాకుండా జీవశిలీంధ్రమైన ట్రైకోడెర్మా విరిడి ను 5 గ్రాములు ,కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవచ్చు. నారుమళ్లు తయారుచేసుకున్న తర్వాత విత్తనాన్ని వరుసల్లో విత్తుకోవాలి. వరుసల మధ్య 5 సెంటీమీటర్ల ఎడం వుండేటట్లు చూసుకుని చిన్న గాడిచేసి విత్తనాన్ని విత్తాల్సి వుంటుంది.

READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

విత్తిన తర్వాత వర్మీకంపోస్టు లేదా చివికిన పశువుల ఎరువులను పైపొరగా వేసి విత్తనంపై మట్టిని కప్పాలి.  ఈ విధంగా విత్తిన తర్వాత నారుమడికి వారం రోజులపాటు ఉదయం, సాయంత్రంపూట రోజ్ కేన్ తో పలుచగా నీరందించాలి. నారుమడిపై విత్తనం మొలకెత్తే వరకు గడ్డిని పరిచినట్లైతే తేమ ఆవిరికాకుండా వుండి విత్తనం త్వరగా మొలకెత్తుతుంది.  రెండవ వారం నుంచి రోజుకు ఒక పూట నీరందిస్తే సరిపోతుంది. విత్తనం నాటిన 9వ రోజు, 15వ రోజున కాపర్ ఆక్సీక్లోరైడ్ 30గ్రాములు, 1గ్రాము స్ట్రెప్టోసైక్లిన్, 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి నారుమళ్లను తడపాలి. దీనివల్ల నారుమడి తొలిదశల్లో వచ్చే నారుకుళ్లు, కేనోఫొరా ఎండుతెగులును సమర్ధవంతంగా అరికట్టవచ్చు.

READ ALSO : Okra Crop : బెండ‌సాగులో మేలైన యాజమాన్యం

నారుమడిలో సెంటు నారుమడికి 1కిలో వేపపిండిని చల్లినప్పుడు రసం పీల్చు పురుగుల బెడద తగ్గుతుంది. ఈ విధమైన జాగ్రత్తల మధ్య 6వారాల వరకు నారును పెంచి నాటుకోవచ్చు. సాధరణంగా మిరప నాటేందుకు అక్టోబరు, నవంబరు మాసాలు అనుకూలం. ఆగష్టు రెండవ పక్షంలో నారు పోసినట్లయితే అక్టోబరు మొదటి వారంలో నారు అంది వస్తుంది. 42 నుంచి 45రోజుల వయసున్న నారును నాటటానికి ఉపయోగించాల్సి వుంటుంది. కనుక రైతులు నారుమళ్ల పెంపకంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే, ప్రధాన పొలంలో నాటిన తర్వాత మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, రైతులు ఆశించిన ఫలితాలు పొందవచ్చు.