Groundnut Farming : వేరు శనగలో అధిక దిగుబడి సాధనకోసం విత్తనాల ఎంపికే కీలకం!

విత్తనం కొరకు ఉంచిన వేరుశనగను, కాయల రూపంలో నిల్వచేసి విత్తే ముందు గింజలను వేరు చేయాలి. గింజలను వేరుచేసేటపుడు గింజపై పొర బాగా వుండి రంగు సమానంగా వున్న విత్తనాలను ఎన్నుకోవాలి.

Groundnut Farming : వేరు శనగలో అధిక దిగుబడి సాధనకోసం విత్తనాల ఎంపికే కీలకం!

Groundnut farming

Groundnut Farming : వేరుశనగ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న నూనె గింజల పంట. భారతదేశం ప్రపంచంలో వేరుశనగ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది. మనదేశంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలలో ఎక్కువగా సాగుచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా యాసంగిలో మహబూబ్ నగర్ , వరంగల్, నల్గొండ, అనంతపురం మరియు కరీంనగర్ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. తేలిక పాటి నేలలు మరి నేలలు, తుంపర పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. వేరుశెనగ నూనె వివిధ ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నూనె అవసరాలను తీరుస్తుంది.

ఇసుకతో కూడిన గరప నేలలు లేదా నీరు త్వరగా ఇంకే ఎర్ర చల్కా నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి. ఎక్కువ బంకమన్ను కలిగిన నల్లరేగడి నేలల్లో ఈ పంట వేయరాదు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కిచేసి చదును చేయాలి. ఖరీఫ్ లో వేరుశనగ పంటను జూలై వరకు విత్తుకోవచ్చు.యాసంగిలో ఉత్తర తెలంగాణలో అక్టోబరు లోపు, దక్షిణ తెలంగాణలో సెప్టెంబరు నుండి నవంబరు వరకు విత్తుకోవచ్చు.

విత్తన ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

నాణ్యత కలిగిన మంచి మొలకశక్తి కలిగిన విత్తనాలను ఎన్నుకోవాలి. గుత్తిరకాలలో 90-95% వరకు , తీగ రకాల్లో 85-90 % మొలక శక్తి ఉండేలా చూసుకోవాలి. మొలక శక్తి 85% కన్నా తక్కువ కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోరాదు. విత్తనం కొరకు ఉంచిన వేరుశనగను, కాయల రూపంలో నిల్వచేసి విత్తే ముందు గింజలను వేరు చేయాలి. గింజలను వేరుచేసేటపుడు గింజపై పొర బాగా వుండి రంగు సమానంగా వున్న విత్తనాలను ఎన్నుకోవాలి. బీజకవచం తొలగిన గింజలను కాని లేక బద్దలైన గింజలను కాని విత్తుకోటానికి ఉపయోగించకూడదు.

విత్తనశుద్ధి విషయానికి వస్తే కిలో విత్తనానికి 1 గ్రా., టెబ్యుకొనజోల్ లేదా 3 గ్రా., మాంకోజెబ్ పొడి మందు పట్టించాలి. కాండం ఖరీ కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో ఒక మి.లీ., ఇమిడాక్లోప్రిడ్ ను 7 మి.లీ. నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మి.లీ., క్లోరిపైరిఫాస్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు ఎకరాకు సరిపడే కిలో విత్తనానికి 200 గ్రా., రైజోబియం కల్చరుని పట్టించాలి. వేరుకుళ్ళు, మొదలు కుళ్ళు, కాండము కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే పరిస్థితులలో కిలో విత్తనానికి విత్తుకోవా 10గ్రా. ట్రైకోడెర్మా విరిడిని పట్టించటం వల్ల సమస్యను అదిగమించవచ్చు.