Thangalaan : ‘తంగలాన్’ మూవీ రివ్యూ.. బంగారం కోసం యుద్ధం..
తంగలాన్ పూర్తిగా పీరియాడిక్ యాక్షన్ మాత్రమే కాక రా & రస్టిక్ సినిమా కూడా.
Thangalaan Movie Review : తమిళ్ స్టార్ హీరో విక్రమ్, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. కోలార్ బంగారు గనులను ఎలా కనిపెట్టారు అని 200 ఏళ్ళ క్రితం కథతో పీరియాడిక్ యాక్షన్ గా ‘తంగలాన్’ తీశారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ నిర్మాణంలో తంగలాన్ సినిమా నిర్మించారు. ఈ సినిమా నేడు ఆగస్టు 15 థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. 1850 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు అప్పుడప్పుడే మనల్ని రూల్ చేస్తున్న సమయంలో ఈ కథ సాగుతుంది. ఆంధ్ర, కర్ణాటక బోర్డర్ లో ఓ చిన్న గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ తంగలాన్(విక్రమ్), అతని భార్య(పార్వతి) జీవిస్తుంటారు. ఆ గ్రామ పెద్ద పన్ను కట్టాలని అతని భూమి మొత్తం తీసుకొని తంగలాన్ ని అతని భూమికే కూలీగా మారుస్తాడు. అదే సమయంలో ఆ ఊరికి కొంత దూరంలో బంగారం ఉందని, బ్రిటిష్ వాళ్ళు అది కనిపెట్టాలని అనుకుంటారు. ఆల్రెడీ గతంలో ఆ బంగారం కోసం వెళ్లి చాలా మంది చావు బారిన పడ్డారు.
ఆరతి అనే ఓ ట్రైబల్ రాణి ఆ బంగారం ఉండే భూమిని కాపాడుతూ ఉంటుంది. తంగలాన్ తాతలు కూడా ఆ బంగారం కోసం వెళ్లి మరణించారు. బ్రిటిష్ వాళ్ళు తంగలాన్ ఊరికి వచ్చి కొంతమందిని బంగారం వెతకడం కోసం పనిలోకి తీసుకెళ్తారు. మొదట అక్కడికి వెళ్లినవాళ్లంతా చనిపోతున్నారని భయపడినా బంగారం వస్తే జీవితాలు బాగుపడతాయని తంగలాన్ అందరికి నచ్చచెప్పి వెళ్తారు. అలా కొంతమంది బ్రిటిష్ వాళ్ళు, తంగలాన్, మరి కొంతమంది బంగారం వెతుక్కుంటూ వెళ్తారు. ఈ దార్లో వాళ్ళు ఎదుర్కున్న సమస్యలు ఏంటి? అసలు ఆ బంగారాన్ని ఎవరు కాపాడుతున్నారు? తంగలాన్ తాతల కథేంటి? చివరకు తంగలాన్ కి, బ్రిటిష్ వాళ్ళకి బంగారం దొరికిందా? బ్రిటిష్ వాళ్ళు బంగారం కోసం ఏం చేసారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Double Ismart : ‘డబల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ.. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ మెప్పించిందా?
సినిమా విశ్లేషణ.. తంగలాన్ పూర్తిగా పీరియాడిక్ యాక్షన్ మాత్రమే కాక రా & రస్టిక్ సినిమా కూడా. అలాగే సినిమా చూస్తుంటే ఇది ప్యూర్ తమిళ సినిమా అని అర్థమయిపోతుంది. ఈ సినిమా తమిళ్ ప్రేక్షకులకు నచ్చినా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కష్టమే. ఇప్పుడు ఉన్న కోలార్ బంగారు గనులు 200 ఏళ్ళ క్రితం అసలు ఎలా కనిపెట్టారు అనే కథని, బంగారం కాపలా కాసేవాళ్ళు, బంగారం కోసం వచ్చే వాళ్ళ మధ్య యాక్షన్ సీక్వెన్స్ లతో కథని చెప్పారు.
ఫస్ట్ హాఫ్ లో తంగలాన్ ఫ్యామిలీ, ఊరు, అతని కష్టాలు, బ్రిటిష్ వాళ్ళతో కలిసి బంగారం కోసం వెళ్లడం, దార్లో పడే ఇబ్బందులతో కొంచెం స్లో నేరేషన్ లో సాగుతుంది. బంగారం కోసం బయలుదేరినప్పటి నుంచి వచ్చే సీన్స్ యుగానికి ఒక్కడు సినిమా గుర్తొస్తుంది. సెకండ్ హాఫ్ లో ఆ బంగారాన్ని పూర్తిగా కనిపెట్టే క్రమంలో వీళ్ళు పడ్డ కష్టాలు, ఆ బంగారం కాపలాదారుల కథతో కొంచెం ఆసక్తిగానే సాగుతుంది. సినిమా స్టార్టింగ్ కచ్చితంగా బోర్ కొడుతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే తంగలాన్ తాతల కథ మాత్రం ఆసక్తిగా ఉంటుంది. తమిళ్ రా & రస్టిక్ సినిమాలు చూసే వాళ్లకు తంగలాన్ నచ్చొచ్చు. సినిమా విక్రమ్ ఒక్కడే భుజాలపై వేసుకొని నడిపించినట్టు అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. విక్రమ్ ప్రతి సినిమాకి తనని తాను మలుచుకొని ఎంతైనా కష్టపడతాడు పాత్ర కోసం. తంగలాన్ ఫస్ట్ లుక్ రిలీజయినప్పటి నుంచి అందరూ విక్రమ్ కోసమే ఈ సినిమా చూడాలనుకున్నారు. దానికి తగ్గట్టు తంగలాన్ పాత్రలో విక్రమ్ తన పర్ఫార్మెన్స్ తో మరోసారి అదరగొట్టి అందర్నీ మెప్పించాడు. మాళవిక మోహనన్ బంగారాన్ని కాపాడే ఆరతి పాత్రలో యాక్షన్ సీక్వెన్స్ లతో ట్రైబల్ గెటప్ లో అదరగొట్టేసింది. తంగలాన్ భార్యగా పార్వతి తిరువొతు కూడా బాగా నటించింది. పశుపతి, డానియల్.. మిగిలిన నటీనటులు కూడా బాగానే నటించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. లొకేషన్స్ ఆ కాలానికి తగ్గట్టు పర్ఫెక్ట్ గా చూసుకున్నారు. పాటలు జస్ట్ ఓకే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ఓ కొత్త కథ తీసుకున్నా పాత కథనంతోనే డైరెక్టర్ పా రంజిత్ బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ పర్ఫెక్ట్ గా కనపడేలా కాస్ట్యూమ్స్ కూడా కరెక్ట్ గా డిజైన్ చేసుకున్నారు.
మొత్తంగా ‘తంగలాన్’ సినిమా ఓ బంగారం ఉండే ప్రదేశాన్ని కనుక్కోవాలని బ్రిటిష్ వాళ్ళు, తంగలాన్ చేసే యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.