ఏపీ కేబినెట్ నిర్ణయాలు : శ్రీరామనవమి నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుక

  • Published By: madhu ,Published On : September 4, 2019 / 10:01 AM IST
ఏపీ కేబినెట్ నిర్ణయాలు : శ్రీరామనవమి నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుక

వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకాన్ని శ్రీరామనవమి నుంచి అమల్లోకి వస్తుందని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. సెప్టెంబర్ 04వ తేదీ బుధవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకానికి రూ. 750 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. బీసీలకు పెళ్లి కానుక కింద రూ. 50 వేలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెళ్లి కానుక కింద రూ. లక్ష, బీసీ కులం కులాంతర వివాహం చేసుకుంటే రూ. 70 వేలు, వికలాంగులకు రూ. లక్షా 50, భవన నిర్మాణ కార్మికులకు రూ. లక్ష రూపాయలు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో హామీనిచ్చిన వాటిని అమల్లోకి పెడుతోంది. అందులో వైఎస్ఆర్ పెళ్లి కానుక. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకానికి చంద్రన్న పెళ్లి కానుక పేరు ఉండేది. ఈ పేరును ఏపీ ప్రభుత్వం మార్చివేసింది. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే భారంగా మారిన పేద కుటుంబాలకు అండగా ఉంటామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, పెళ్లి మండపం, పెళ్లి భజంత్రీలు అన్నింటికీ కనీసం లక్ష అవుతుందనే ఆలోచనతో.. పెళ్లి చేసుకునే వారికి అక్షరాల రూ.లక్ష ఇవ్వాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

తప్పనిసరిగా ఉండాల్సిన సర్టిఫికేట్లు:
మీసేవా జారీ చేసిన నేటివిటి, కమ్యూనిటీ, బర్త్ సర్టిఫికేట్
వయస్సు నిర్ధారణ కోసం 10 తరగతి లేదా ఇంటిగ్రేటెడ్‌ మీ-సేవా సర్టిఫికెట్‌
కుల ధ్రువీకరణ పత్రం, వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌
తెల్లరేషన్‌ కార్డు లేదా మీ సేవ ఆదాయ ధ్రువీకరణ పత్రం
పెళ్లికూతురు బ్యాంకు ఖాతా జిరాక్స్‌
దివ్యాంగులైతే అందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ (కనీసం 40 శాతంగా ఉండి శాశ్వత అంగవైకల్యం ఉండాలి)
భవన నిర్మాణ కార్మికులైతే కార్మిక శాఖ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా గుర్తింపు కార్డు