ఏపీ నుంచి లక్షలాదిమంది గల్ఫ్‌కు వలస..మాతృభూమికి దూరంగా ఎడారిదేశాల్లో జీవనం

ఏపీ నుంచి లక్షలాదిమంది గల్ఫ్‌కు వలస..మాతృభూమికి దూరంగా ఎడారిదేశాల్లో జీవనం

25 lakh people migrated from AP to Gulf countries : ఏపీ నుంచి కూడా లక్షలాది మంది గల్ఫ్‌ దేశాలకెళ్లారు. రాయలసీమ, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్లినవారంతా బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కోవిడ్‌ ముందు ఉపాధి కోల్పోయి రాష్ట్రానికి వచ్చేసిన వారిలో కొందరు ఇప్పుడిప్పుడే గల్ఫ్‌ బాట పడుతున్నారు. మరికొందరు అరబ్‌ కంట్రీస్‌లో కష్టాలను తలచుకుని ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు.

ఏపీలోని వెనుకబడిన జిల్లాలే కాదు.. ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా.. వేలాది మంది గల్ఫ్‌లో ఉపాధి, ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్లారు. ముఖ్యంగా కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వలసలు కొనసాగాయి. మాతృభూమికి, కన్నవారికి, కట్టుకున్నవారికి దూరంగా వీరంతా పొట్టచేతబట్టుకుని అరబ్‌ దేశాలకు వెళ్లింది ఓ తరానికి సరిపడా సంపాదిద్దామని. వేలు, లక్షల రూపాయలు అప్పుచేసో, ఉన్న పొలం, స్థలం విక్రయించో ఏజెంట్ల చేతిలో పోసిన వాళ్లలో కొంతమంది బాగానే స్థిరపడ్డారు. కానీ చాలామందిని కదిలిస్తే కష్టాలే ఏకరువు పెడుతుంటారు. ఏజెంట్లు చేతిలో ఎలా మోసపోయిందో వెళ్లగక్కుతారు.

సౌదీ అరేబియా, దుబాయి, షార్జా, మస్కట్‌, ఒమన్‌, కువైట్‌, ఖతార్‌…ఇతరత్రా గల్ఫ్‌ కంట్రీస్‌, ఆ దేశాల్లోని నగరాల్లో ఆకాశహర్మ్యాల గురించి తోటి వారు చెబుతున్నా, సోషల్‌ మీడియాలో చూస్తున్నా సహజంగా అక్కడకెళ్లి ఉద్యోగాలు చేయాలనిపిస్తుంటుంది చాలామందికి. అందులోనూ వృత్తినే నమ్ముకున్నవారు…కష్టపడే కొన్నాళ్లయినా ఆయా దేశాలకెళ్లి కష్టపడితే, ఎక్కువగా సంపాదించవచ్చని, ఆ తర్వాత స్వదేశానికి వచ్చి భార్యాపిల్లలతో హాయిగా జీవించవచ్చని ఆశిస్తారు.

ఉన్న ఊళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్‌కు వెడితే లైఫ్‌లో హ్యాపీగా ఉండొచ్చని వెళుతుంటారు. ఇక ఏజెంట్లు చెప్పే మాటలకు మరింతగా ఉప్పొంగిపోతుంటారు. కానీ గల్ఫ్‌ దేశాలకు వెళ్లినవారి గోడు వేరేలా ఉంది. పనివేళలు ఎక్కువ, సరైన భోజన సదుపాయం ఉండదు, తల్లిదండ్రులు, భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ తాము ఏ కోల్పోతున్నామో చెబుతూ ఉంటారు. అక్కడ వారు అంతలా బాధపడుతుంటే…వారిని మించిన బాధ గ్రామాల్లోని వారి కుటంబసభ్యులను వేధిస్తుంటుంది.

ఏజెంట్లు గల్ఫ్‌ కంపెనీల్లో ఉద్యోగాలకని తీసుకెళతారు. కానీ అక్కడకు వెళ్లాక తెలుస్తుంది. తాము వెళ్లింది కంపెనీ వీసా మీద కాదు.. విజిటింగ్‌ వీసాపై అని. ఆ తర్వాత షరా కష్టాలు మామూలే. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచే దాదాపు 25 లక్షల మంది గల్ఫ్‌కు వెళ్లారని అంచనాలున్నాయి. ఇందులో కడప జిల్లా నుంచే అత్యధికంగా 5 లక్షల మంది వెళ్లారని అంచనాలున్నాయి. జిల్లాలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నుంచి ఉపాధి వెతుక్కుంటూ దుబాయ్‌, సౌదీ, ఖతార్‌, బహ్రెయిన్ తదితర దేశాలకు వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే వలస వెళ్లినవారిలో ఎక్కువ మంది మహిళలూ ఉన్నారు.

ఇంట్లో పని, వంట పని చేసే మహిళలకు ఉచితంగా వీసాలు జారీ చేస్తుండేసరికి.. ఆయా దేశాల్లో ఉండే ఏజెంట్లతో ఇక్కడి ఏజెంట్లు టచ్‌లో ఉంటూ ఆ వీసాలను కూడా అమ్ముకుని లక్షలు గడిస్తున్నారు. రాకపోకలకయ్యే ఖర్చులు కూడా సంబంధిత యజమానులే భరిస్తారు. కానీ ఈ విషయంలోనూ ఏజెంట్లు చేతివాటం కనబరుస్తూ వేల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారు. నిరక్షరాస్యులు, టెన్త్‌, ఇంటర్‌ విద్యార్హత ఉన్నవారికి, ముఖ్యంగా అమాయకులకు ఎక్కువగా గాలం వేస్తుంటారు ఏజెంట్లు. వారి మాటలను నమ్మి వెళితే ఎడారి దేశాల్లో ఎండనక, వాననక ఒంటెలు, గొర్రెలు, మేకలు కాపర్లుగా, వాచ్‌మన్‌లుగా కూలీగా పనిచేయాల్సి ఉంటుంది.

ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన మహిళలను… ఆయా దేశాల్లోని ఏజెంట్లు ఎయిర్‌పోర్ట్‌లలోనే వెల్‌కమ్‌ చెబుతారు. పాస్‌పోర్ట్‌తో సహా కీలకపత్రాలను తమ చేతిలోకి తీసుకుని, ఒక ఐడీ కార్డు ఇచ్చి అరబ్‌ షేక్‌కు అప్పగిస్తారు. 24 గంటలు పని చేయాల్సిందే. ఇక ఇంట్లో కాదు..మూడు, నాలుగు ఇళ్లలో పనిచేయాల్సిందే. జీతం ఇవ్వకపోయినా చెప్పుకునే అవకాశం ఉండదు. వచ్చేద్దామంటే ఏజెంట్‌ అమ్మేశాడు అనే మాటలు వినిపిస్తాయి. దీంతో నిర్ఘాంతపోతారు బాధితులు. నీపై ఇంత పెట్టుబడి పెట్టాను, అది కట్టి వెళ్లు అనేసరికి అప్పటికే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న మహిళలెందరో ఉన్నారు.

బాధిత మహిళను మరో షేక్‌కు అప్పగించిన ఉదంతాలు, లైంగిక వేధింపులు, శారీరక చిత్రహింసలకయితే కొదువే లేదు. గల్ఫ్‌ దేశాల్లోని వలస జీవుల్లో గతేడాది 13 వందల మంది బలవన్మరణం చెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం భారినపడ్డా, అనారోగ్యం పాలైనా, కోవిడ్‌తో ఉపాధి కోల్పోయినా వలసజీవులను ఆదుకునే వ్యవస్థేమీ లేదు. గల్ఫ్‌లో చనిపోతే … మృతదేహాన్ని ఇండియాకు తరలించాలంటే తోటివారు విరాళాలు వేయాల్సిన తప్పనిసరి పరిస్థితులున్నాయి. లేకపోతే అక్కడే అనాథకు జరిగినట్లు అంత్యక్రియలు జరిగిపోతుంటాయి.

లక్షలు అప్పు చేసి కువైట్‌, సౌదీ, బహ్రెయిన్‌ వెళ్లినవారు.. తమకు ఇష్టం ఉన్నా లేకున్నా శ్రమిస్తున్నారు. ఉన్నఫళంగా స్వదేశం వస్తే అప్పు తీర్చేదెలాగో తెలీక బాధల్ని కుటుంబసభ్యులకు సైతం చెప్పుకోలేకపోతున్నారు కొందరు. గతేడాది గల్ఫ్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆయా దేశాల ఆదేశాలతో కట్టుబట్టలతో ఏపీకి వచ్చేశారు వేలాది మంది. 10,15 ఏళ్లు గల్ఫ్‌లోనే జీవనోపాధి పొందినవారిలో కొందరు ఇప్పటికే తిరిగి అక్కడకు వెళ్లగా…మరికొందరు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఓ వైపు కరోనా భయం, ఇంకోవైపు గల్ఫ్‌లో బాధల భయంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక్కడే ఉందామంటే ఏం చేయాలి, ఎట్లా బతికేది అనేది సహజంగానే ప్రశ్నార్థకమవుతోంది.

పిల్లలకు ఉన్నత విద్య అందివ్వాలన్నా, ఘనంగా పెళ్లి చేయాలన్నా, సొంతిళ్లు సమకూర్చుకోవాలన్నా గల్ఫ్‌కు వెళ్లక తప్పదని కొంతమంది కంపెనీ ఉద్యోగులు భావిస్తున్నారు కానీ. చిన్న చిన్న ఉద్యోగాలు, చాలీచాలని జీతాలు, వేతనాలతో జీవించేవారు ఏపీలోనే ప్రత్యామ్నాయ ఉపాధి ఎంచుకోవాలని చూస్తున్నారు. ఈ ఆలోచనలతో తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు బాధితులు.