CM Jagan : రాష్ట్ర చరిత్రలో ఈరోజు మైలురాయి.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్
రాష్ట్రానికి సంబంధించి కేంద్రం తరఫున చేసిన మంచి పనులన్నింటికి ఏపీ ప్రజల తరఫున ఎలాంటి సంకోచాలు, రాజకీయాలకు తావు లేకుండా సంతోషం తెలుపుతున్నానని, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా..

Cm Jagan Projects
CM Jagan : ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం తరఫున చేసిన మంచి పనులన్నింటికి ఏపీ ప్రజల తరఫున ఎలాంటి సంకోచాలు, రాజకీయాలకు తావు లేకుండా సంతోషం తెలుపుతున్నానని, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్ చెప్పారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం విజయవాడ వచ్చారు. పలు రహదారుల పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని, భూసేకరణతో పాటు అన్ని అంశాల్లో సత్వరమే నిర్ణయం తీసుకుంటున్నామని జగన్ వెల్లడించారు. రహదారుల అభివృద్ధికి రూ.10,600 కోట్లు కేటాయించినట్టు వివరించారు.
”రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. రూ.20 వేల కోట్లతో 51 ప్రాజెక్టులకు ముందడుగు పడుతోంది. రాష్ట్ర చరిత్రలో ఈరోజు మైలురాయి లాంటి రోజు. గడ్కరీ సహకారంతో బెజవాడ బెంజి సర్కిల్ వేగంగా పూర్తయింది. అలాగే, రాష్ట్రానికి మరికొన్ని రోడ్ల నిర్మాణం కూడా అవసరం. ఆయా రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపుతున్నాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాటిని ఆమోదించాలని కోరుతున్నా. ఏపీలో జాతీయ రహదారులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రంలో రూ.10,400 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపడుతున్నాం. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో వెళ్తోంది. జాతీయ రహదారుల పరిధి 4,190 కిలోమీటర్ల నుంచి 8 వేల కిలోమీటర్లకు పైగా పెరిగింది” అని జగన్ అన్నారు.
”2019 ఆగస్టులో విజయవాడ బెంజ్ సర్కిల్‌లో పశ్చిమ వైపు రెండో ఫ్లైఓవర్ కావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా. నా విజ్ఞప్తి పట్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెంటనే అనుమతి ఇచ్చారు. ఆయన సహకారంతో రెండున్నరేళ్లలో ఫ్లైఓవర్ పూర్తయింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మేలు పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశా. విజయవాడకు బైపాస్ రోడ్డు అవసరం. ఇప్పటికే పశ్చిమ బైపాస్‌కు అనుమతి ఇచ్చారు. తూర్పు బైపాస్‌కు కూడా అనుమతి ఇవ్వాలి” అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు సీఎం జగన్.
Nitin Gadkari : అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపదు-నితిన్ గడ్కరీ
విశాఖ తీరంలో విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా రిషికొండ, భీమిలి కొండలను తాకుతూ సముద్ర తీరాన టూరిజంకే వన్నె తెచ్చే విధంగా ఆరు లేన్ల రహదారి ఎంతో అవసరమని సీఎం జగన్ చెప్పారు. విజయవాడ తూర్పున కృష్ణా నదిపై వంతెన సహా దాదాపు 40 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు అవసరమని స్పష్టం చేశారు. నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుందని అన్నారు. విజయవాడ పశ్చిమ బైపాస్ కు అనుమతి ఇచ్చారని, అలాగే తూర్పు బైపాస్ కు కూడా అనుమతి ఇవ్వాలని నితిన్ గడ్కరీని కోరారు జగన్. ఏపీలో కొత్త జాతీయ రహదారులకు ఈరోజు శంకుస్థాపన జరిగింది.
కడప జిల్లా భాకరా పేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బేస్తవారపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్నగొట్టిగల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకు ఉన్న రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరారు జగన్.
తెలుగువాడైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పుడూ నాలుగడుగులు ముందుకు వేస్తున్నారని, ఆయన మరోసారి చొరవ చూపాలని సీఎం జగన్ కోరారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం అన్ని విధాలుగా దోహదపడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం, సింహాద్రి, అన్నవరం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.21 వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. రహదారుల అనుసంధానంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అన్ని రాష్ట్రాల సమాన అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతోందని కిషన్ రెడ్డి అన్నారు.