Face Book : ఫేస్‌బుక్ ద్వారా 38 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా, తమ్ముళ్లు

చిన్నప్పుడు 7వ ఏట తప్పిపోయి వేరే వాళ్ల ఇంట్లో పెరిగి పెద్దదై, పెళ్ళి చేసుకుని, కూతురుకు పెళ్లి చేసిన మహిళ తన అల్లడు సహాయంతో .... 45 ఏళ్ళ వయస్సులో కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందోత్స

Face Book : ఫేస్‌బుక్ ద్వారా 38 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా, తమ్ముళ్లు

Missing Girl Mangamma

Face Book :  చిన్నప్పుడు 7వ ఏట తప్పిపోయి వేరే వాళ్ల ఇంట్లో పెరిగి పెద్దదై, పెళ్ళి చేసుకుని, కూతురుకు పెళ్లి చేసిన మహిళ తన అల్లడు సహాయంతో …. 45 ఏళ్ళ వయస్సులో కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. సినిమా స్టోరీలా ఉన్నాఈ కధనం మీరు చదవండి.

తెలంగాణ, వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం నెలివెడి  గ్రామానికి చెందిన క్యాసని నాగన్న, తారకమ్మల కూతురు మంగమ్మ  తన ఏడవ ఏట తండ్రితో   కలిసి హైదరాబాద్ లో జరిగే ఒక శుభకార్యక్రమానికి హాజరయ్యింది.  మూడు రోజులు అక్కడే ఉండటంతో తల్లిమీద బెంగపెట్టుకుంది.  దీంతో తండ్రికి చెప్పకుండా తన గ్రామం వెళ్దామని బయటకు వచ్చింది.

బస్టాండ్ కు వెళ్లే   రోడ్లపై తిరుగుతుండగా ఒక వృధ్ధుడు ఆమెను చూసి  తల్లి వద్దకు తీసుకువెళతానని మాయ మాటలు చెప్పి తనతో  తీసుకువెళ్లాడు.  ఆమెకు అల్పాహారం తినిపించి   రైలులో   విజయవాడ తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి ఆమెను గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపని తెలుగు బాప్టిస్టు చర్చి వద్దకు తీసుకువచ్చాడు.

అక్కడ పాప తన తల్లి కోసం ఏడుస్తూ ఉండటంతో, పాప తన మాట వినటం లేదనే కోపంతో కొట్టసాగాడు. ఇది చూసిన స్ధానికులు పాప ను ప్రశ్నించగా వివరాలు చెప్పింది.  ఆమెను ఎత్తుకొచ్చాడని నిర్ధారించుకున్న గ్రామస్తులు వృధ్ధుడ్ని అక్కడి నుంచి  వెళ్లగొట్టారు. పాప ఒంటరిదై పోవటంతో ఎవరూ ఆమె బాగోగులు చూసేందుకు ముందుకు రాలేదు.

అప్పడు గ్రామానికి చెందిన కనగాల సామేలు అనే వ్యక్తి  మంగమ్మను  తీసుకు వెళ్లి తన ఆరుగురి సంతానంతో  పాటు పెంచి పెద్దచేశాడు. ఆతర్వాత మంగమ్మను దావులూరుకు చెందిన అంబటి దాసు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు.  మంగమ్మ, దాసులకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.  వారిలో పెద్ద కుమార్తె శాంతకుమారిని యలమర్రుకు చెందిన కొండసీమ క్రిష్టఫర్ కి ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు.

Also Read : Aryan Khan : నేడు జైలు నుంచి విడుదల కానున్న ఆర్యన్

ఈ క్రమంలో మంగమ్మ   తన రక్త సంబంధీకులు గురించి అల్లుడు క్రిష్టఫర్ వద్ద వాపోయింది. దీంతో క్రిష్టఫర్ అత్త మంగమ్మ దగ్గర వివరాలు తీసుకుని ఫేస్ బుక్ ద్వారా తెలంగాణలోని నెలిమిడికి చెందిన భాస్కర్ అనే వ్యక్తితో  పరిచయం చేసుకున్నాడు. అతని సహాయంతో అత్త రక్త సంబంధీకుల వివరాలు ఇచ్చి వాకబు చేయమన్నాడు.  ఆ వివరాలు తీసుకున్న భాస్కర్ తక్కువ కాలంలోనే వారి వివరాలు సేకరించాడు.

మూడు రోజుల క్రితం వారిని ఫోన్ ద్వారా సంప్రదించాడు. ఆ నెంబరు క్రిష్టఫర్ కు ఇవ్వటంతో మంగమ్మ మూడో రోజుల క్రితం తన తమ్ముళ్లతో ఫోన్ లో మాట్లాడింది. వారు ఆమెను గుర్తు పట్టారు. మంగమ్మ ఇద్దరు తమ్ముళ్లు కృష్ణ,వెంకటేష్ లు శుక్రవారం యలవర్రు వచ్చిమంగమ్మను కలుసుకుని ఆనందసాగరంలో మునిగి తేలారు.

తమ తల్లితండ్రులు చిన్నతనంలో అక్క తప్పిపోయిందని చెప్పేవారని…. ఆమెను చూస్తామని అనుకోలేదని… 38 ఏళ్ల తర్వాత ఆమెను ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తన కుటుంబ సభ్యులను చూడకుండానే చనిపోతానేమోనని బాధపడ్డానని… తన అల్లుడి ద్వారా ఫేస్ బుక్ సాయంతో వారిని కలుసుకోవటం ఆనందంగా ఉందని మంగమ్మ చెప్పింది. తల్లి తండ్రులు, తోబుట్టువుల పేర్లు మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవటం, గ్రామం పేరు గుర్తు పెట్టుకోవటం వల్లే తన కుటుంబ సభ్యులను కలుసుకోగలిగినట్లు మంగమ్మ చెప్పుకొచ్చింది.