ACB Court : కోర్టు హాల్‌లోనే చంద్రబాబు, సీఐడీ లాయర్ల మధ్య వాగ్వాదం.. జడ్జి తీవ్ర ఆగ్రహం

ACB Court

ACB Court : కోర్టు హాల్‌లోనే చంద్రబాబు, సీఐడీ లాయర్ల మధ్య వాగ్వాదం.. జడ్జి తీవ్ర ఆగ్రహం

ACB Court Judge Angry

ACB Court Judge Angry : చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ రికార్డుపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో సీఐడీ తరపు న్యాయవాదులకు, చంద్రబాబు తరపు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. న్యాయవాదుల తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాగైతే విచారణ నిలిపి వేస్తామని స్పష్టం చేశారు. కోర్టు హాల్ లో అరుచుకున్న న్యాయవాదుల వివరాలు రికార్డు చేయాలని ఆదేశించారు. ఘర్షణ పూరితంగా వ్యవహరిస్తే ఈ కేసు విచారణ నేను చేయలేను అంటూ న్యాయమూర్తి బెంచ్ దిగి వెళ్లిపోయినట్లు సమాచారం.

చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ రికార్డులపై విచారణ జరపాలంటూ నెల రోజుల క్రితం చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇవాళ ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై వాదోపవాదాలు జరిగాయి. దీనిపై విచారణకు అనుమతించిన న్యాయమూర్తి.. సోమవారం చంద్రబాబును కోర్టుకి తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసు ముగిసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ లిస్ట్ కావాలని మేము పిటిషన్ దాఖలు చేశాము, దీనిపై మా వాదనలు వినాలి అంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అయితే కాల్ లిస్ట్ కి సంబంధించి వాదనలు వినాల్సిన అవసరం లేదని సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద వాదించారు.

Also Read : చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం లేదని అమిత్ షా చెప్పారు : నారా లోకేశ్

ఆయనీ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో చంద్రబాబు తరపు లాయర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు ఎవరెవరితో మాట్లాడారో ఆ కాల్ లిస్ట్ మాకు కావాలని, ఆ కాల్ లిస్టు అందితేనే అసలు కుట్ర ఎలా జరిగింది? చంద్రబాబు అరెస్ట్ కు ఎవరెవరు సహకరించారు? ఎవరెవరి సలహాలు తీసుకున్నారు? ఈ విషయాలన్నీ తెలుస్తాయని చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. న్యాయవాదుల అరుపులతో కోర్టు హాల్ దద్దరిల్లింది. దీంతో న్యాయమూర్తి కొంత అసహనం వ్యక్తం చేశారు. లాయర్ల తీరుపై సీరియస్ కూడా అయ్యారు.

ఇది కోర్టు హాల్. నా ముందే మీరిలా వాదులాడుకోవడం సబబు కాదు. దయచేసి అంతా సంయమనం పాటించండి. నేను చెప్పేది వినండి అంటూ ఇరువర్గాల లాయర్లను న్యాయమూర్తి వారించారు. అయితే, మీరు మా వాదనలు వినడం లేదు.. కేవలం సీఐడీ తరపు లాయర్ల వాదనలే వింటున్నారు, నెల రోజుల క్రితం కాల్ లిస్ట్ కావాలని పిటిషన్ వేసినా ఇప్పటివరకు దానికి సంబంధించి వాదనలు జరగలేదని చంద్రబాబు తరపు లాయర్లు కూడా న్యాయమూర్తితో అన్నారు. న్యాయమూర్తి చట్టం వైపు మాట్లాడుతున్నారు. ఎవరినీ సపోర్ట్ చేయడం లేదు అని సీఐడీ తరపు లాయర్లు చెప్పుకొచ్చారు. కాగా, లాయర్ల తీరుతో కొంత అసహనానికి గురైన న్యాయమూర్తి.. బెంచ్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Also Read : జగన్ కు దమ్ముంటే మ్యానిఫెస్టోలో మూడు రాజధానుల అంశం పెట్టి ఎన్నికలకు వెళ్ళాలి : గంటా శ్రీనివాసరావు