Minister Gudivada Amarnath : ఎన్నికలకు ముందే మూడు రాజధానులు.. పొలిటికల్ హీట్ పెంచిన మంత్రి వ్యాఖ్యలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని మంత్రి తేల్చి చెప్పారు. మూడు రాజధానుల విషయంపై త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు మంత్రి అమర్నాథ్.

Minister Gudivada Amarnath : ఎన్నికలకు ముందే మూడు రాజధానులు.. పొలిటికల్ హీట్ పెంచిన మంత్రి వ్యాఖ్యలు

Minister Gudivada Amarnath : ఏపీ రాజకీయాల్లో మరోసారి మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని మంత్రి తేల్చి చెప్పారు. మూడు రాజధానుల విషయంపై త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు మంత్రి అమర్నాథ్. అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లు తెస్తామని సీఎం జగన్ ఇదివరకే చెప్పారని మంత్రి గుర్తు చేశారు.

విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి అమర్నాథ్.. మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. త్వరలో జరగబోతున్న రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ తాము నెరవేరుస్తామని చెప్పలేదని, గొప్పలు చెప్పకున్నా అందులో 90 శాతానికి పైగా వాగ్దానాలను పూర్తి చేశామని వివరించారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

ప్రతిష్టాత్మకమైన బల్క్ డ్రగ్స్ పార్క్ రాష్ట్రానికి వస్తుంటే.. టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. ఏపీకి బల్క్ డ్రగ్స్ పార్క్‌ వద్దని టీడీపీ నేత యనమల కేంద్రానికి లేఖ రాయడం బాధాకరం అన్నారు. ఆంధ్రప్రదేశ్.. ఫార్మా రంగానికి హబ్‌గా మారుతోందని, అందుకు దోహదపడే ఏ పరిశ్రమ వచ్చినా తాము స్వాగతిస్తామని మంత్రి వివరించారు.

టీడీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ ఫైర్ అయ్యారు. వారిని ఈ రాష్ట్రం నుంచే వెళ్లగొట్టాలన్నారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దని ఆర్బీఐకి టీడీపీ నేతలు లేఖలు రాశారని మంత్రి ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్న తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్‌లను జైలుకు పంపాలన్నారు. విభజన హామీలను కేంద్రానికి తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి విమర్శించారు.

”వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో మూడు రాజధానులపై చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. అయినా 90 శాతానికిపైగా హామీలు అమలు చేశాం. మిగతా వాటిని కూడా పూర్తి చేస్తాం. బల్క్ డ్రగ్ ప్రాజెక్టు రాష్ట్రానికి వస్తుంటే వద్దంటూ టీడీపీ నేత యనమల కేంద్రానికి లేఖ రాయడం దారుణం. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ నేతలు, చంద్రబాబును రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలి” అని మంత్రి అమర్‌నాథ్ ఫైర్ అయ్యారు.