Chandrababu Arrest : చంద్రబాబుకి మరో షాక్.. హౌస్ రిమాండ్ పిటిషన్ కొట్టివేత
హౌస్ రిమాండ్ పిటిషన్ తీర్పుపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. Chandrababu House Remand
Chandrababu House Remand
Chandrababu House Remand : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులో మరో షాక్ తగిలింది. జ్యుడీషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలన్న చంద్రబాబు పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై నిన్న సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇవాళ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సీఐడీ వాదనతో ఏకీభవించిన కోర్టు.. చంద్రబాబు పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో హౌస్ రిమాండ్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందా అని సర్వత్రా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది.
చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై నిన్న(సెప్టెంబర్ 11) సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువర్గాలు తమ తమ వాదనలు వినిపించాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పుని రిజర్వ్ చేశారు. నేడు(సెప్టెంబర్ 12) తీర్పు వెల్లడించారు.
చంద్రబాబుకి జైల్లో ప్రాణహాని ఉందని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదించారు. చంద్రబాబు వయసు, హోదా, ఆయనకు ఉన్న భద్రత వంటి అంశాలతో హౌస్ రిమాండ్ కు అంగీకరించాలని సిద్ధార్ధ లూథ్రా న్యాయస్థానాన్ని కోరారు. అయితే, చంద్రబాబు హౌస్ రిమాండ్ కు సీఐడీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబుకి జైల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించామని, చంద్రబాబుకి అన్ని విధాలుగా జైలే ఉత్తమం అని సీఐడీ వాదించింది. చంద్రబాబుని హౌస్ రిమాండ్ చేస్తే కేసుని ప్రభావితం చేసే అవకాశం ఉందని వివరించింది. సీఐడీ చేసిన ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను కొట్టివేసింది.
