AP Covid Hospitals : కొవిడ్ ఆస్పత్రుల్లో బాధితులకు ఏ లోటు ఉండొద్దు.. సీఎం జగన్

కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఏ లోటు లేకుండా చూడాలన్నారు ఏపీ సీఎం జగన్.. ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారు.

AP Covid Hospitals : కొవిడ్ ఆస్పత్రుల్లో బాధితులకు ఏ లోటు ఉండొద్దు.. సీఎం జగన్

Ap Covid Hospitals

AP Covid Hospitals : కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఏ లోటు లేకుండా చూడాలన్నారు ఏపీ సీఎం జగన్.. ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సేవల్లో ఏ మాత్రం లోపం ఉండకూడదని అధికారులకు సీఎం సూచించారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ఇంజక్షన్లు,ఇతర మందులను ఎక్కడ అందుబాటులో ఉన్నా సేకరించాలన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందేలా చూడాలని తెలిపారు. వారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.10 లక్షలను వీలైనంత వరకు ఎక్కువ ఆదాయం వచ్చే చోట్ల డిపాజిట్‌ చేయాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న కేసుల సంఖ్య కూడా తగ్గుతోందని అధికారులు తెలిపారు. కరోనా  పాజిటివిటీ రేటు 13.02కు తగ్గినట్టు పేర్కొన్నారు. గత మే 16న పాజివిటీ రేటు 25.56 శాతంగా నమోదు కాగా.. యాక్టివ్‌ కేసులు మే 17న 2.11 లక్షలకు చేరింది. జూన్‌ ప్రారంభం నాటికి 1.43 లక్షలు గా ఉంది.

కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతోందని, కేసులు కన్నా వారి సంఖ్య అధికంగానే ఉందన్నారు. కొవిడ్ రికవరీ రేటు 90.98 శాతానికి పెరిగిందని చెప్పారు. కొవిడ్‌ కారణంగా క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య కూడా తగ్గిందన్నారు. ఐసీయూ బెడ్స్‌ మే 15న కేవలం 380 ఖాళీగా ఉంటే.. జూన్‌ 2న 1,582 అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆక్సిజన్‌ బెడ్లు మే 17 నాటికి 433 మాత్రమే ఖాళీగా ఉంటే.. ప్రస్తుతం 7,270 పడకలు ఖాళీగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

జనరల్‌ బెడ్స్‌ మే 19న 9,378 ఖాళీలు ఉంటే.. ప్రస్తుతం 11,708 ఖాళీగా ఉన్నాయన్నారు. 7 వారాల డేటాను పరిశీలిస్తే.. అన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ బాధితులు తగ్గారు. ప్రస్తుతం 14,057 మంది మాత్రమే ఉండగా.. 104 కాల్‌ సెంటర్‌కు 3,645కు కాల్స్ తగ్గిపోయాయి. 104 కాల్‌ సెంటర్‌కు మే 4న 19,175 కాల్స్‌ వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 51,03,821 మందికి తొలి డోస్, 25,47,784 మందికి రెండు డోస్‌ల కోవిడ్‌ వాక్సిన్‌ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలకు సంబంధించి కేంద్రం మొత్తం 36,94,210 వాక్సిన్లు కేటాయించగా, ఇప్పటి వరకు 5,08,710 పంపిణీ చేసిందని అధికారులు తెలిపారు. ఇంకా ప్రభుత్వ పరంగా ఈ నెలలో 20,74,730 వాక్సిన్లు సేకరించాలని నిర్ణయించామని అధికారులు చెప్పారు.

బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 1187 ఉన్నాయని తెలిపారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి మొత్తం 89 విజిలెన్సు కేసులు నమోదు కాగా.. 66 ఆస్పత్రులపై రూ.9.9 కోట్లు పెనాల్టీ విధించారు. నాన్‌ ఆస్పత్రుల కేసులు 23 ఉన్నాయి. కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన 93 మంది పిల్లలను గుర్తించగా వారిలో 46 మందికి రూ.10 లక్షల సహాయం డిపాజిట్‌ చేసినట్టు అధికారులు వివరించారు.