AP High Court: ఏపీ హైకోర్టు తీర్పులో మార్పు.. కోర్టు సమయం ముగిసేవరకూ నిల్చొనే ఉండండి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం ఇద్దరు సీనియర్ ప్రభుత్వ అధికారులకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానాతో పాటు వినూత్నమైన శిక్ష విధించింది. సింగిల్ జడ్జ్ బెంచ్ నేతృత్వంలో కోర్టు ధిక్కార కేసులో విచారణ జరిగింది.

AP High Court: ఏపీ హైకోర్టు తీర్పులో మార్పు.. కోర్టు సమయం ముగిసేవరకూ నిల్చొనే ఉండండి

Ap High Court

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం ఇద్దరు సీనియర్ ప్రభుత్వ అధికారులకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానాతో పాటు వినూత్నమైన శిక్ష విధించింది. సింగిల్ జడ్జ్ బెంచ్ నేతృత్వంలో కోర్టు ధిక్కార కేసులో విచారణ జరిగింది. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరికి హైకోర్టు 9 రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది.

కోర్టును క్షమాపణ కోరి కోర్టు ఇక నుంచి ఉత్తర్వుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పారు. వయస్సును, ప్రస్తుత కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ తీర్పును సవరించింది. జరిమానాను అలానే ఉంచి, పనివేళలు ముగిసేంత వరకు కోర్టులోనే నిలబడి ఉండాలని ఆదేశం ఇచ్చింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మూడు రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

తప్పెక్కడ జరిగింది:
విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదే నెలలో సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసి గతంలో నిర్ధేశించిన కొన్ని అర్హతలను తొలగించింది. దీనిని సవాలు చేస్తూ ఎస్‌.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గతేడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, సవరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.

పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వాటిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్‌‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తర్వాత హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు. మంగళవారం ఈ పిటిషన్‌ మరోసారి విచారణకు వచ్చింది.