గుడివాడలో మళ్లీ విజయకేతనం ఎగరేస్తా: ఎమ్మెల్యే కొడాలి నాని

20 ఏళ్లు ఎక్కడ ఉన్నాడో తెలిదు, ఎక్కడ నుంచి వచ్చారో.. ఎవరో తెలియని వ్యక్తి.. చంద్రబాబు దగ్గర టిక్కెట్ కొనుక్కొని.. గుడివాడలో పోటీ చేస్తున్నారు. 

గుడివాడలో మళ్లీ విజయకేతనం ఎగరేస్తా: ఎమ్మెల్యే కొడాలి నాని

Updated On : April 25, 2024 / 1:54 PM IST

Kodali Nani Files Nomination: గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు తనదేనని, 20 వేలకంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. మరోసారి గుడివాడలో విజయకేతనం ఎగరేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా గురువారం ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు రాజేంద్రనగర్ లోని తన స్వగృహం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్, ఇతర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నామినేషన్ వేసిన అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గద్దెనెక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మళ్ళీ జగనే సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. మహిళ ఓటర్లు ఈసారి ఏకపక్షంగా ఓట్లు వేస్తారని, తమ పార్టీ 151కి మంచి సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక సీట్లను వైసీపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

టీడీపీకి చెందిన కొంత మంది తమను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో తాము సంయమనంతో ఉన్నామని వెల్లడించారు. 2014లో చంద్రబాబు ప్రజలను ఏవిధంగా మోసం చేశారో మళ్ళీ అవే మోసాలతో ఎన్నికలకు వెళ్తున్నారని.. ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల నమ్మకం పొందడమే ముఖ్యమని అన్నారు.

Also Read: వీళ్లా వైఎస్ఆర్ వారసులు? పులివెందుల సభలో షర్మిలకు సీఎం జగన్ కౌంటర్

టీడీపీ అభ్యర్థికి కౌంటర్
”పరాయి దేశంలో డబ్బు సంపాదించుకుని, అక్కడ సంపాదించిన సొమ్ము మదంతో గుడివాడలో రాజకీయాలు చేస్తున్నారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బలా చంద్రబాబుకు, ఆయనను నమ్ముకున్న NRI లకు గుణపాఠం తప్పదు. NRI లకు టీడీపీ సీట్లను చంద్రబాబు అమ్ముకున్నారు. డబ్బు సంచులతో వచ్చిన NRI లు రిజల్ట్స్ తర్వాత రిటర్న్ టిక్కెట్ తో వెళ్లి పోతారు. 20 ఏళ్లు ఎక్కడ ఉన్నాడో తెలిదు, ఎక్కడ నుంచి వచ్చారో.. ఎవరో తెలియని వ్యక్తి.. చంద్రబాబు దగ్గర టిక్కెట్ కొనుక్కొని.. గుడివాడలో పోటీ చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గ స్థితిగతులు తెలియని వాళ్లు ఇక్కడకు వచ్చి పికేది ఏం లేద”ని కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.

Also Read: ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారే చాన్స్‌.. ఈసారి అక్కడ ఎగిరే జెండా ఏది?