CM Jagan : వీళ్లా వారసులు? పులివెందుల సభలో షర్మిలకు సీఎం జగన్ కౌంటర్

వైఎస్ఆర్, జగన్ లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలో వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని జగన్ అన్నారు.

CM Jagan : వీళ్లా వారసులు? పులివెందుల సభలో షర్మిలకు సీఎం జగన్ కౌంటర్

CM Jagan counter to Sharmila : వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం పులివెందుల అసెంబ్లీ స్థానంకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు పులివెందుల సీఎస్ఐ చర్చి మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలకు వివేకా హత్య కేసు విషయంలో జగన్ కౌంటర్ ఇచ్చారు. నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం. ప్రతీ కష్టంలో నా వెంట నడిచిన ప్రతీఒక్కరికీ రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పులివెందులలో ఏం ఉంది అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు అనే స్థాయికి చేరుకున్నామని చెప్పారు.

Also Read : Visakhapatnam North Assembly Race Gurralu : ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారే చాన్స్‌.. ఈసారి అక్కడ ఎగిరే జెండా ఏది?

వైఎస్ఆర్, జగన్ లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలో వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని జగన్ అన్నారు. వైఎస్ వారసులెవరో ప్రజలే చెప్పాలన్నారు. వైఎస్ఆర్ వ్యతిరేకులతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలు కుట్రలో భాగం అయ్యారు. పసుపు చీరలు కట్టుకొని వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వైఎస్ఆర్ వారసులు అంటూ షర్మిలను ఉద్దేశించి జగన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డనైన నాకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేందుకు కాదు.. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు.. పేదలందరికీ మంచి చేసేందుకు మాత్రమే. ఆ పేదలకు మేలు చేసేందుకు ఈ ముఖ్యమంత్రి పదవి నాకు ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మమ్మల్ని పక్కన పెట్టాడని మాట్లాడుతున్న నా బంధువులకు చెబుతున్నా అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

Also Read : CM Jagan : పథకాలు కొనసాగాలంటే అదొక్కటే దారి- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

నా చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి.. జిల్లా ప్రజలకు తెలుసు. వివేకాకు రెండో భార్య ఉంది.. సంతానం ఉన్నది అనేది నిజం కాదా అని జగన్ ప్రశ్నించారు. ఎవరు ఫోన్ చేస్తే అవినాశ్ అక్కడికి వెళ్లాడు? పలు ఇంటర్వ్యూల్లో అవినాశ్ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా. వైఎస్ అవినాశ్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే.. నేను అతనికి టికెట్ ఇచ్చానని జగన్ చెప్పారు. అవినాశ్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని మీరంతా అతన్ని దూషించడం, తెరమరుగు చేయాలనుకోవటం దారుణమైన విషమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మా అందరికన్నా అవినాశ్ చాలా చిన్నవాడు.. అలాంటి అవినాశ్ జీవితం నాశనం చేయాలని పెద్దపెద్ద వాళ్లు కుట్రల్లో భాగమవుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాపై, అవినాశ్ పై బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో మీ అందరికీ కనిపిస్తోంది. పసుపు మూకలతో మన చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం అయ్యారు. చిన్నాన్నను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్లతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. వైఎస్ఆర్ పై కుట్రలు చేసిన వాళ్లు అందిస్తున్న స్ర్కిప్ట్ చదువుతున్న వీళ్లా వైఎస్ఆర్ వారసులు అంటూ షర్మిల, సునీతలపై జగన్ విమర్శలు చేశారు.