DSP అయిన పోలీస్ కూతురికి పోలీస్ తండ్రి సెల్యూట్ : తండ్రిని మించిన తనయ

DSP అయిన పోలీస్ కూతురికి పోలీస్ తండ్రి సెల్యూట్ : తండ్రిని మించిన తనయ

AP police father Proud salutes daughter police officer  : పోలీసు డిపార్ట్‌మెంట్ లో పై అధికారులకు సెల్యూట్ చేస్తుంటారు. అది వారిమీద ఉండే గౌరవం. కానీ పోలీసు ఉద్యోగం చేసే ఓ తండ్రి తన కూతురుకి సెల్యూట్ చేశాడు. తండ్రిని మించిన తనయగా ఎదిగిన తన గారాల పట్టి ఆ తండ్రి పోలీస్ సెల్యూట్ చేశాడు. ఎందుకంటే తన కూతురు తనకంటే ఉన్నతస్థాయి పోలీసు ఉద్యోగంలో చేరినందుకు..

ఆ తండ్రి చేసే సెల్యూట్ లో ఆనందంతోపాటు ప్రేమ, గర్వం, గౌరం అన్నీ కలగలిసి ఆ పోలీసుల తండ్రి కళ్లల్లో కదలాడాయి. తండ్రి చేసిన ఆ సెల్యూట్ తో ఆ కూతురు కూడా ‘‘నాన్నా నీ కలను నెరవేర్చాను..అందుకు నాకు కూడా సంతోషంగా ఉంది’’అన్నట్లుగా నవ్వింది. ఈ అరుదైన సంఘటనకు ఏపీ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతి లో‌ నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి “ఇగ్నైట్” వేదికైంది.

ఏపీ తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విభజన తరువాత ఏపీ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో‌ నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి “ఇగ్నైట్” అని పేరు పెట్టారు. ఈ క్రమంలో గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా చార్జ్ తీసుకున్న కూతురు జెస్సీ ప్రశాంతికి తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్న శ్యామ్ సుందర్ సెల్యూట్ చాలా అరుదైన ఘటనగా నిలిచింది.

2018 బ్యాచ్ కి చెందిన జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో “దిశ” విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు జెస్సీ ప్రశాంతి. ఆమె తండ్రి శ్యామ్ సుందర్ తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్నారు.

తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటీలో ఉన్న తన కూతురిని చూస్తూ మురిసిపోయారు సర్కిల్‌ ఇంస్పెక్టర్ శ్యామ్ సుందర్. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో చేరినందుకు ఆ తండ్రి సంతోషంగా ఉప్పొంగిపోయారు. తన ఒడిలో ఆటలాడుకున్న ముద్దుల కూతురు ఇంతింతై ఎదిగి తన కళ్లముందే ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండటం దూరం నుంచి చూస్తూన్న ఆ తండ్రి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు శ్యామ్.

అలా పోలీసు డ్రెస్ లో ఉన్న తన కూతుర్ని కళ్లనిండా నింపుకుని తన గారాలపట్టి ప్రశాంతి దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు శ్యామ్. ఆ కూతురు కూడా వెంటనే సెల్యూట్ చేసి ‘ఏంటి నాన్నా?’ అంటూ తాను డ్యూటీలో ఉన్నాననే విషయం కూడా మరచిపోయి గట్టిగా నవ్వేశారు ప్రశాంతి.

‘పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంతగా సంతోషిస్తారో..ఆ పిల్లలే పెద్దై ప్రయోజకులు అయినప్పుడు కన్నవారికి వచ్చే సంతోషం ముందు ఏ కోటాను కోట్ల ఆస్తులు సరిపోవని ఆ తండ్రి మనస్సు చదివితే తెలుస్తుంది. ఉన్నతస్థాయిలో ఉన్న తన కూతురు నవ్వుకు..పలకరింపుకు ఆ తండ్రి తెగ మురిసిపోయారు.

తండ్రిగా తనకు ఇంతకంటే సంతోషం మరోకటి ఉండదని సంతోషంగా వ్యక్తంచేశారు. నా బిడ్డ నీతి నిజాయితీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉంది.’ అని అన్నారు సీఐ శ్యామ్ నుందర్. పోలీస్ తండ్రి పోలీస్ కూతురిని చూసి స్పందించిన తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. “ఇటువంటి అరుదైన సన్నివేశం సినిమాలో చూస్తుంటాం… కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చూస్తున్నాం..తిరుపతి డ్యూటీ మీట్ లో తండ్రీకూతురు ఇలా యూనిఫాం ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతంగా చాలా గర్వంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రశాంతి” అని డీఎస్పీ ప్రశాంతిని అభినందించారు ఎస్పీ రమేష్ రెడ్డి.