YS Jagan: మాకు ఓటేస్తేనే పథకాల కొనసాగింపు ఉంటుంది.. ఆయనకు వేశారో..: జగన్

శ్రీకాకుళం జిల్లా రూపురేఖలను మార్చామని జగన్ చెప్పారు.

YS Jagan: మాకు ఓటేస్తేనే పథకాల కొనసాగింపు ఉంటుంది.. ఆయనకు వేశారో..: జగన్

YS Jagan

Updated On : May 7, 2024 / 4:53 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమని సీఎం జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. తనకు ఓటేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నాయుడికి ఓటేస్తే పథకాలకు ముగింపు పలుకుతారని చెప్పారు.

వైసీపీ సర్కారు అవినీతి లేకుండా నేరుగా పథకాలను అందజేసిందని జగన్ తెలిపారు. మరోసారి చంద్రబాబు నాయుడి బూటకపు హామీలు నమ్మగలమా అని ప్రశ్నించారు. ఇంటికి వచ్చే పెన్షన్ సొమ్ము రెండు నెలలుగా ఇంటికి రాకుండా కుట్రలు చేసింది ఎవరో అర్థం కాలేదా అని అడిగారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పైన దేవుడు ఉన్నాడని అన్నారు.

ఓటు దెబ్బకు డిల్లీ పీఠం కూడా కదులతోందని జగన్ తెలిపారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించాలని, ఎవరు మంచి చేశారో అని ఆలోచించాలని కోరారు. తాను గత ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మ్యానిఫేస్టోని 99 శాతం అమలు చేసి, ఇప్పుడు ఈ ఎన్నికల్లో మళ్లీ ప్రజల ముందుకు వచ్చానని చెప్పారు.

రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి చేశామని జగన్ అన్నారు. ఏపీలో విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చేశామని చెప్పారు. అక్కచెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని అన్నారు. స్వయం ఉపాధికి గతంలో ఏ సర్కారూ తోడుగా లేదని, తాము రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అండగా ఉన్నామని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా రూపురేఖలను మార్చామని జగన్ చెప్పారు. 4 వేల కోట్ల రూపాయల మూల పేట పోర్టును వాయువేగంతో నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. ఉద్ధానం కిడ్నీ సమస్యల పరిష్కారానికి వంశధార శుద్ధ జలాల ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేశామని చెప్పారు.

Also Read: అలాంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు: ఈసీ