రైతు బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,766కోట్లు

రైతు బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,766కోట్లు

AP Rythu Bharosa : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 29) రూ.1,766 కోట్లను జమ చేయనుంది. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను అందించనుంది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద నిధులను జమ చేస్తోంది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద దాదాపు రూ.646 కోట్లను విడుదల చేసింది.

తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌ మీట నొక్కి ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఏ సీజన్‌లో పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పెట్టుబడి రాయితీ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగానే సీఎం జగన్ అమలు చేస్తున్నారు. నవంబర్‌ నెలాఖరులో నివర్‌ తుపాను వల్ల భారీవర్షాలు, వరదలకు వ్యవసాయ, ఉద్యానపంటలు దెబ్బతిన్న రైతులకు అతి స్వల్ప సమయంలో పెట్టుబడి రాయితీ జమ చేస్తున్నారు.

2020 ఖరీఫ్‌లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షాలు, వరదలతో నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు రూ.135.73 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని అక్టోబర్‌ 27న రైతుల ఖాతాల్లో జమ చేసింది. అక్టోబరులో వరదలవల్ల నష్టపోయిన రైతులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా నెల రోజుల్లోనే రూ.132 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించింది. నవంబర్‌ నెలాఖరులో సంభవించిన నివర్‌ తుపాను 8.34 లక్షల మంది రైతులు నష్టపోయారు.

రైతుల ఖాతాల్లో రూ.645.99 కోట్ల పెట్టుబడి రాయితీని సీఎం జగన్‌ జమ చేయనున్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టా భూముల్లో సాగు చేసే గిరిజనులకు అక్టోబరు 27న ఒకేసారి రూ.11,500 అందించారు. మిగిలిన రూ.2 వేలు జమ చేయనున్నారు. ఈ సొమ్మును బ్యాంకులు బాకీల కింద తీసుకోవడానికి వీల్లేకుండా సీఎం చర్యలు తీసుకున్నారు. 51.59 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.1,120 కోట్లు మొత్తాన్ని జమ చేస్తున్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా 155251 హెల్ప్‌లైన్‌ నంబరు ద్వారా సంప్రదించవచ్చు.