చంద్రబాబు కీలక నిర్ణయం, విధేయతకు పట్టం, ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

  • Published By: naveen ,Published On : September 22, 2020 / 12:30 PM IST
చంద్రబాబు కీలక నిర్ణయం, విధేయతకు పట్టం, ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

ఏపీ టీడీపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 27న రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ప్రకటించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమిస్తున్న టీడీపీ… పార్టీలో యువతకు ఎక్కవ ప్రాధాన్యతనిస్తోంది.

ఏపీలో మారిన పరిస్ధితుల్లో అధికార వైసీపీ వ్యూహాలకు దీటుగా స్పందించడంలో 4 దశాబ్దాల అనుభవమున్న టీడీపీ విఫలమవుతోంది. గతేడాది ఎన్నికల్లో ఎదురైన పరాభవం ఆ పార్టీని ఇప్పటికీ వెంటాడుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత చుట్టూ చక్కర్లు కొట్టిన నేతలంతా ఇప్పుడు ఆయనకు మద్దతిచ్చేందుకు సైతం ముందుకు రావడం లేదు. దీంతోపాటు మూడు రాజధానుల వ్యవహారం కూడా ఆ పార్టీని కుదిపేస్తోంది. దీంతో పార్టీకి విధేయతగా ఉంటున్న కింజరాపు కుటుంబానికే బాధ్యతలు అప్పగిస్తే బావుంటుందనే చర్చ టీడీపీలో సీరియస్‌గా సాగింది.

వరుస దెబ్బలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి:
గతేడాది ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన టీడీపీకి ఆ తర్వాత అంత కంటే పెద్ద దెబ్బలు తగిలాయి. గెలిచిన 23 మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి వైసీపీకి మద్దతు ప్రకటించడం, గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన శిద్గా రాఘవరావు వంటి వారు సైతం వైసీపీ జెండా కప్పుకోవడం, మూడు రాజధానుల కారణంగా ఓ వర్గం ప్రజలు దూరం కావడం, అదే సమయంలో ఇద్దరు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర సీరియస్‌ క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఇప్పుడు అధినేత చంద్రబాబుకు తప్పనిసరిగా మారింది.

గతంలో ఎన్నికల్లో ఓటమి తర్వాత కింజరాపు కుటుంబ వారసుడు, యువనేత రామ్మోహన్ నాయుడుకు పగ్గాలు అప్పగించేందుకు అంతా సిద్ధమైనా ప్రస్తుత పరిస్ధితుల్లో ఆయన అనుభవం చాలదని, ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు సీనియర్‌ నేతలకూ ఇబ్బంది ఎదురవుతుందని అధిష్టానం భావించింది. దీంతో ఆ ప్రతిపాదన అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు దాని స్ధానంలో మరో ప్రతిపాదన సిద్ధమైంది.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు:
ఏపీలో మారిన పరిస్ధితుల్లో ఈఎస్‌ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీకి ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఆయనపై నమోదైన ఈఎస్‌ఐ స్కాం కేసు ఎలాగో వైసీపీ కక్షసాధింపే అన్న వాదన టీడీపీ తెరపైకి తెచ్చింది. మరోవైపు కింజరాపు కుటుంబానికి చెందిన ఆయన మాజీ మంత్రిగా, సీనియర్‌ నేతగా పార్టీకి అండగా ఉన్నారు. అసెంబ్లీలోనూ, ఉత్తరాంధ్రలోనూ టీడీపీకి ఆయన సేవలు చాలా అవసరం.

దీంతో అచ్చెన్నాయుడును అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న చర్చ టీడీపీలో సీరియస్‌గా సాగుతోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును అప్పట్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా తెరపైకి తెచ్చారు. కానీ ఇప్పుడు ఆయన గత ఎన్నికల్లో ఓటమి తర్వాత యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో అదే ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడు పేరు అధ్యక్ష రేసులోకి వచ్చింది.

పార్టీ బలోపేతం, పునర్ వైభవం అచ్చెన్నతోనే సాధ్యం:
ప్రస్తుతం అమరావతి నుంచి రాజధానిని విశాఖ తరలించేందుకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం కూడా దీనికి వంత పాడుతోంది. ఇవాళ కాకపోయినా రేపైనా రాజధాని విశాఖకు తరలిపోవడం ఖాయమైనే వాదన సాగుతోంది. ఇలాంటి తరుణంలో విశాఖ నగరం నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు మోసేందుకు సిద్ధంగా లేరు.

దీంతో మరోసారి ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడుని అధ్యక్షుడిగా నియమిస్తే స్ధానికంగా పార్టీ బలోపేతం కావడంతో పాటు ఉత్తరాంధ్రలో పునర్‌ వైభవం సాధించేందుకు కూడా వీలు పడుతందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇకపై విశాఖ కేంద్రంగా సాగే రాజకీయాల్లో అచ్చెన్నాయుడు చురుకైన పాత్ర పోషించగలిగితే పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే చర్చ సాగుతోంది.