Chandrababu Pawan Kalyan Meeting : టార్గెట్ వైసీపీ.. ఒక్కటైన టీడీపీ, జనసేన..! చంద్రబాబు, పవన్ ఏం చర్చించారంటే..

ఏపీలో అధికార విపక్షాల మధ్య పోరు ఉధృతమైంది. వైసీపీని టార్గెట్ చేసేందుకు టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం చంద్రబాబు, పవన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Chandrababu Pawan Kalyan Meeting : టార్గెట్ వైసీపీ.. ఒక్కటైన టీడీపీ, జనసేన..! చంద్రబాబు, పవన్ ఏం చర్చించారంటే..

Chandrababu Pawan Kalyan Meeting : ఏపీలో అధికార విపక్షాల మధ్య పోరు ఉధృతమైంది. వైసీపీని టార్గెట్ చేసేందుకు టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం చంద్రబాబు, పవన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లో జరిగిన వీరి భేటీ సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.

వైసీపీ ప్రభుత్వం విధానాలపై పోరాటంపైనే పవన్ తో చర్చించినట్లు చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని, రాజకీయ పార్టీలన్నీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వం బ్రిటీష్ కాలం నాటి జీవో తెచ్చిందని, ఆ జీవోకు చట్టబద్దత ఉందో లేదో కూడా తెలియదన్నారు.

తన సొంత నియోజకవర్గం కుప్పంలోకి రాకుండా 2వేల మంది పోలీసులతో తనను అడ్డుకునేందుకు యత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు వస్తే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో పరిస్థితులు ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉన్నాయన్నారు చంద్రబాబు.

ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనలపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు తాను వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, పెన్షన్లు, శాంతి భద్రతలు తదితర అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. వైజాగ్ లో తన పర్యటన సమయంలో ప్రారంభమైన పరిణామాలు కుప్పం వరకు కొనసాగాయని పవన్ ధ్వజమెత్తారు.

ప్రతిపక్ష నేతలను ప్రజల వద్దకు వెళ్లకుండా నియంత్రించేందుకే జీవో నెంబర్ 1 పేరుతో చీకటి జీవో తెచ్చారని పవన్ మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట వెనుక వైసీపీ కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు పవన్ కల్యాణ్. తాను వారాహి వాహనం కోసం రుణం తీసుకుని కొనుగోలు చేస్తే కూడా వైసీపీ రాద్దాంతం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.

వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ విశ్వరూపం చూపిస్తుందని పవన్ హెచ్చరించారు. బీజేపీ తమ మిత్రపక్షమే అని పవన్ స్పష్టం చేశారు. పొత్తులపై సమయం వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తామన్నారు జనసేనాని పవన్.

టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11మంది మరణించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న జగన్ సర్కార్ జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. రోడ్డుపై సభలు, రోడ్ షో లు నిర్వహించరాదని, పోలీసులు ఎక్కడ అనుమతి ఇస్తే అక్కడ మాత్రమే సభ పెట్టుకోవాలని జీవో తెచ్చి ప్రభుత్వం. అయితే, ఈ జీవోను టీడీపీ, జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.