CM Jagan Letter : ‘వరద సాయంగా రూ.1000 కోట్లు ఇవ్వండి’..మోదీ, అమిత్‌షాకు సీఎం జగన్ లేఖలు
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం జగన్ లేఖలు రాశారు. భారీ వర్షాలతో పంటలకు అపారనష్టం జరిగిందని పేర్కొన్నారు. వర్షాలు, వరదలలో 6054 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు.

Jagan Letter
CM Jagan letters to Modi and Amit Shah : ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఏపీ సీఎం జగన్ వేర్వేరుగా లేఖలు రాశారు. అతి భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం జరిగిందని జగన్ లేఖలో పేర్కొన్నారు. వర్షాలు, వరదలలో 6054 కోట్ల నష్టం వాటల్లిందని వివరించారు. 1.43 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని చెప్పారు. రోడ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అత్యవసర సాయం కింద రూ.1000 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయాలని కోరారు.
భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. నాలుగు జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైందన్నారు. చాలా చోట్ల 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేట వంటి ప్రాంతాలు భారీ వర్షాలకు నీట మునిగాయని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని చెప్పారు. 196 మండలాలు నీట మునిగాయని పేర్కొన్నారు. 324 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయని పేర్కొన్నారు. చెరువులకు గండ్లు పడడం ద్వారా చాలా ప్రాంతాలు నీటమునిగాయని తెలిపారు.