ఏపీలో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ

ఏపీలో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ

Corona vaccine distribution in AP : ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏపీలో ఈనెల 25 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

కోటికిపైగా కరోనా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించిందని విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ రెడీ వ్యాక్సిన్ ఇచ్చే వారికి ట్రెయినింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే వ్యాక్సిన్ల పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. కాగా ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం గమనార్హం.

కరోనా కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఆలోచన చేస్తోంది. కరోనా టెస్టులు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్ రాబోతోంది. దీనికి సంబంధించి ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పవచ్చు.

కరోనా టెస్టులకు సంబంధించిన అన్ని విషయాల్లో ముందున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ విషయంలోనూ ముందుచూపుతో ఉందని చెప్పవచ్చు. అనుమతులు వచ్చిన వెంటనే వ్యాక్సిన్లు రాష్ట్రానికి తెప్పించడం, రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పంపణీ చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో ఉంది.

డిసెంబర్ 25 తేదీ లోపు అనుమతులు వస్తాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులు వచ్చిన వెంటనే వ్యాక్సిన్ పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎక్కడెక్కడ ఎంతమందికి వేయాలి? ఎన్ని సెంటర్లు ఉన్నాయి? ఏ సెంటర్ నుంచి వ్యాక్సిన్ వేయాలి? అని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది.