Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం.. తుపానుగా మారే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. మరింత బలపడి తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Cyclone
Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. మరింత బలపడి తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని కొద్ది ప్రాంతాల్లో వర్షాలు కురిసేలా కనిపిస్తున్నాయి. తర్వాత 12గంటల్లో తుపాను అండమాన్ దీవుల వెంట ఉత్తరం వైపు కదులుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు.
బుధవారం తాండ్వే (మయన్మార్) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీవ్ర వాయుగుండం ఏర్పడిన కారణంగా ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో 65.5 మిల్లీ మీటర్లు, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో 38.75, ప్రకాశం జిల్లా కనిగిరిలో 37, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో 35మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. విజయనగరం, ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
Read Also: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక: అప్రమత్తమైన కేంద్రం
విశాఖ మన్యంలో వడగళ్లు
విశాఖ మన్యంలోనూ అకస్మాత్తుగా కురిసిన వర్షంలో వడగళ్లు పడ్డాయి. నర్సీపట్నం, పాడేరు, కొయ్యూర్, హుకుంపేట, కోటవురట్ల మండలాల్లో ఈదురుగాలులతో వడగళ్లు పడ్డాయి. తోటలు, పంటపొలాలు దెబ్బతిన్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు మండలం గుమ్మిలేరు, విజయనగరం జిల్లాలో మెంటాడలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.