Guntur GGH : కంటి ఆపరేషన్ కు వెళ్తే ప్రాణం తీశారు.. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి

అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతులు తమ ఐదేళ్ల చిన్నారి ఆరాధ్యను చిన్న కంటికురుపు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ఆ క్షణాన వారికి తెలియదు. తమ చిన్నారి అనారోగ్యానికి మించిన నిర్లక్ష్య రోగం అక్కడి సిబ్బందిలో ఉందని.

Guntur GGH : కంటి ఆపరేషన్ కు వెళ్తే ప్రాణం తీశారు.. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి

Child Died

Guntur GGH : అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వస్తామన్న గ్యారంటీ లేదు. అసలు ప్రాణాలతో తిరిగొస్తామన్న హామీనే లేదు. మనిషికి సోకిన అనారోగ్యానికి మించిన నిర్లక్ష్యం, అజాగ్రత్త, అశ్రద్ధ.. ప్రభుత్వాసుపత్రుల్లో తాండవిస్తున్నాయి. వాటికి నిండుప్రాణాలు బలైపోతున్నాయి. ఓ పక్క ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదరణ పెంచాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తోంటే.. అక్కడి సిబ్బంది మాత్రం.. బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంలా మారుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యానికి ఐదేళ్ల చిన్నారి బలైపోయింది.

అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతులు తమ ఐదేళ్ల చిన్నారి ఆరాధ్యను చిన్న కంటికురుపు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ఆ క్షణాన వారికి తెలియదు. తమ చిన్నారి అనారోగ్యానికి మించిన నిర్లక్ష్య రోగం అక్కడి సిబ్బందిలో ఉందని. నవ్వుతూ.. తుళ్లుతూ.. సంతోషంతో ఆడిపాడుతూ.. చక్కగా స్కూలుకెళ్లి చదవుకుంటున్న తమ చిన్నారిని.. ఆ నిర్లక్ష్య రోగం బలి తీసుకోబోతోందని. ఆరాధ్యకు ఎడమ కనురెప్పపై చిన్న కణితి వచ్చింది. వైద్యులకు చూపిస్తే ప్రమాదమేమీ లేదన్నారు. తల్లిదండ్రులు అలా వదిలేస్తే.. ఆరాధ్య ఆరోగ్యంతో నిండునూరేళ్లూ జీవించేదేమో. కణితి చిన్నవయసులోనే తొలగించివేస్తే.. పెద్దయ్యాక ఎలాంటి ముప్పూ ఉండదని ముందు జాగ్రత్తపడడమే ఆ తల్లిదండ్రులకు శాపమయింది.

Nalgonda : ఆపరేషన్ తర్వాత దూది, వేస్ట్‌క్లాత్‌ను మహిళ కడుపులోనే పెట్టి కుట్టేసిన డాక్టర్లు

ఆరాధ్య చికిత్స కోసం జీజీహెచ్‌ చిన్న పిల్లల శస్త్రవిభాగం వైద్యులను తల్లిదండ్రులు సంప్రదించారు. చిన్నపాటి సర్జరీ చేస్తామని చెప్పి.. వైద్యులు పాపను అడ్మిట్ చేసుకున్నారు. సరిగ్గా వారం క్రితం ఉదయం 11 గంటల సమయంలో చిన్నారిని సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. సర్జరీ చాలా చిన్నదని.. పదంటే పదినిమిషాల్లో అయిపోతుందని.. గంట తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చని ఆపరేషన్‌కు ముందు చెప్పారు. కానీ సర్జరీ పూర్తయిందని.. చిన్నారి కణితి తొలగించామని.. ఇంటికి తీసుకెళ్లొచ్చని.. ఎప్పుడెప్పుడు వైద్యులొచ్చి చెబుతారా అని ఆతృతంగా ఆపరేషన్ థియేటర్ బయట ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ఆస్పత్రి సిబ్బంది షాకింగ్ న్యూస్ వినిపించారు.

ఆపరేషన్ సమయంలో ఇబ్బందులు తలెత్తాయని చెప్పి.. చిన్నారికి ఇంకేమైనా జబ్బులున్నాయా అని తల్లిదండ్రులపై ఎదురు నిందలు వేశారు. పరీక్షలన్నీ చేయించుకొచ్చిన తర్వాతే.. సర్జరీకి వెళ్లిన విషయం తల్లిదండ్రులు గుర్తుచేశారు. దీంతో ఇబ్బంది పడ్డ సిబ్బంది.. తమకేమీ తెలియదని.. చిన్నారి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై పెట్టామని, రెండు రోజుల్లో కోలుకుంటుందని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. ఈ మాటలు విన్న ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పాప సర్జరీ తర్వాత అందంగా, ఆరోగ్యంగా తిరిగివస్తుందనుకుంటే.. ఐసీయూలో ఉంచామన్న ఆస్పత్రి సిబ్బంది సమాధానం వారిని నివ్వెరపరిచింది. పాపను మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు.

Dog Vaccine for Corona : కరోనా టీకాకు బదులు కుక్కల వ్యాక్సిన్ వేసిన డాక్టర్లు..!

అక్కడ ఐదురోజులపాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరాధ్య చనిపోయింది. ఈ వార్త విని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే తమ చిన్నారి ప్రాణం తీసిందని వారు ఆరోపిస్తున్నారు. కంటి ఆపరేషన్ సమయంలో కంటికి మాత్రమే మత్తు ఇవ్వాల్సిన సిబ్బంది.. మొత్తం శరీరానికి మత్తు ఇచ్చారని, అలాగే ఆ సమయంలో ఆక్సిజన్ సరఫరా సరిగ్గా ఉందా లేదా అన్నది కూడా చూసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ సమయంలో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడం వల్లే పాప పరిస్థితి విషమించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ఘటన మంత్రి విడదల రజని దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం నివేదిక కోరింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై సీరియస్ అయిన కలెక్టర్ ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇవాళ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. నిర్లక్ష్యంతో తమ చిన్నారి ఉసురుతీసిన ఆస్పత్రి సిబ్బందిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత అసలు చిన్నారి కోలుకోలేదని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం దక్కలేదని వారు విలపిస్తున్నారు.