ఆధిపత్యం కోసం విజయనగరం వైసీపీ వర్గాలుగా చీలిపోయిందా? గ్రూపు రాజకీయాలు మొదలైయ్యాయా?

ఆధిపత్యం కోసం విజయనగరం వైసీపీ వర్గాలుగా చీలిపోయిందా? గ్రూపు రాజకీయాలు మొదలైయ్యాయా?

విజయనగరం పట్టణంలో రాజకీయ దుమారం రేగింది. ప్రశాంతంగా ఉండే పట్టణంలో రెండు వర్గాల మధ్య కత్తుల దాడి జరిగింది. అధికార పార్టీకి చెందిన నాయకులే రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ప్రయత్నించడమే దాడులకు కారణం అయి ఉండొచ్చని అంటున్నారు. పట్టణంలోని 21వ వార్డులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వర్గీయులకు, మంత్రి బొత్స వర్గీయులుగా చెప్పుకునే అవనాపు కుటుంబ సభ్యులకు మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు వర్గాల నుంచి అభ్యర్థులు వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా… వీరిద్దరి మధ్య బీజేపీ అభ్యర్థిగా కాళ్ల నారాయణరావు నామినేషన్ దాఖలు చేశారు. అవనాపు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే నారాయణరావు అప్పటికప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకొని, నామినేషన్ వేశారనే అనుమానం ఎమ్మెల్యే కోలగట్ల వర్గీయుల్లో బలపడుతూ వచ్చింది.

కేవలం వార్డులోని ఓటు బ్యాంకు చీల్చేందుకే అవనాపు కుటుంబానికి చెందిన వైసీపీ నేతలు బీజేపీ నేతను తెరపైకి తెచ్చారని భావించారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదాపడినా… ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు మాత్రం చల్లారలేదు. కరోనా నివారణ కోసం కాళ్ల నారాయణరావు వార్డులో శానిటైజేషన్ చేయిస్తుండగా, మధ్యలో సంబంధిత వాలంటీరుకు, నారాయణరావుకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

వైసీపీ వర్గీయులు కూడా అక్కడకు చేరుకోవడం వివాదం మరింత రాజుకుంది. అప్పటికి ఇరువర్గాల మధ్య వివాదం చల్లారినా… సాయంత్రం మళ్లీ ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంలో ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ కార్యకర్త నారాయణరావుతో పాటు ఎమ్మెల్యే వర్గీయులకూ బలమైన గాయాలయ్యాయి.

ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆధ్వర్యంలో ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకు పోటీగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఎస్పీని కలిసి, తమ అనుచరులపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ వ్యవహారం మొత్తం వైసీపీలో ఉన్న విభేదాలను బయటపెట్టిందంటున్నారు కోలగట్ల, బొత్స మధ్య గ్రూపు రాజకీయాలే కారణమంటున్నారు.