Pawan Kalyan : పవర్ కోసం పవన్ యుధ్ధం

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన జనసేన పార్టీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. మరో రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెట్టారు

Pawan Kalyan : పవర్ కోసం పవన్ యుధ్ధం

Pawan Kalyan

Pawan Kalyan :  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన జనసేన పార్టీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. మరో రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెట్టారు గబ్బర్‌సింగ్. 2024 ఎన్నికలే టార్గెట్‌గా తాడేపల్లి సభ వేదికగా.. పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు రెడీ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న మీటింగ్‌ కావడంతో తమ సేనాని ఏం చెప్పనున్నారో అంటూ జనసైనికులు ఎదురుచూస్తున్నారు.

ఏపీలో 2024లో ఎన్నికలు జరగనున్నాయి. ఆవిర్భావ సభతోనే ఆనాటి ఎన్నికలకు సమరశంఖం పూరించాలని భావిస్తున్నారు జనసేనాని. గతంలా కాకుండా పూర్తిస్థాయిలో యుద్ధభేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వరుసగా మీటింగ్స్‌ పెడుతూ పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు పవన్. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లే ఉండటంతో మరింత దూకుడు పెంచాలని ప్లాన్‌ చేశారు. దీన్ని సోమవారం జరిగే ఆవిర్భావ సభతోనే ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

అధికార పక్షం వైసీపీపై సమయం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు పవన్‌ కల్యాణ్‌. సమస్య దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని కార్నర్‌ చేస్తున్నారు. ఉద్దానం సమస్యపై యుద్ధం చేసినంత పని చేశారు. అమరావతి రైతులకు అండగా ఉంటామంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. మహిళలకు రక్షణ లేదంటూ ఆడవారిలోనూ జనసేన పట్ల ఆదరణ పెరిగేలా వీలు చిక్కిన ప్రతిసారి వారి పక్షాన మాట్లాడారు. మంత్రులనైతే తన మాటలతో ఓ ఆట ఆడుకున్నారు. దీంతో పవన్‌ను టార్గెట్‌ చేసేందుకే వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్‌ రేట్ల విషయం తెరపైకి తెచ్చారనేది కూడా జనసైనికుల వాదన. ఇలా వైసీపీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసి యుద్ధం ప్రకటించారు జనసేనాని.
Also Read : Bhagwant Mann : తగ్గేదేలే…అంటున్న పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్‌

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. ఈ సభ ఏర్పాటు కాబోతుండడం ఆసక్తికరంగా మారింది. బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతున్న నేపథ్యంలో భీమ్లానాయక్‌ నుంచి ఎలాంటి ప్రకటనలు, భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు వెలువడతాయనేది అంతా చర్చించుకుంటున్నారు. ఆయన ప్రసంగం మీద బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇటు జనసైనికులు కూడా ఎప్పుడెప్పుడు తమ అధినేత వస్తారో.. ఏం చెప్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Telangana Police : పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా స్పెషల్ సాంగ్‌ రిలీజ్ చేశారు. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ స్టైల్‌లో సాగుతూ.. జన జన జన జనసేనా అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ జనసైనికులను, పవన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌పై భవిష్యత్తు జెండాని మోయడం కంటే బాధ్యత ఏముంటుంది… ఒకతరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది అంటూ పార్టీ శ్రేణులకు పవన్‌ సందేశమిచ్చారు.

ఇక, పార్టీ ఆవిర్భావ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరినీ ఆహ్వానించారు. జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని జనసేనాని తెలిపారు. ఏపీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జనసైనికులకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో.. ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారో ఈ సభ ద్వారా వివరిస్తామని చెప్పారు.

ఫ్యాన్స్‌ను ఓట్లుగా మార్చుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం.. పొత్తులను పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో చేయడం.. పవన్‌ ముందున్న ప్రణాళికలు. వీటిలో పవన్‌ ఎంతవరకు సక్సెస్‌ అవుతారనేది ముందు ముందు వేచి చూడాలి.