మాటల మంటలు : జేసీ క్షమాపణలు చెప్పాల్సిందే పోలీసులు

  • Published By: madhu ,Published On : December 19, 2019 / 01:29 AM IST
మాటల మంటలు : జేసీ క్షమాపణలు చెప్పాల్సిందే పోలీసులు

జేసీ దివాకర్‌రెడ్డి… కాంట్రవర్సీకి ఈయన కేరాఫ్ అడ్రస్. ఈయన నోరు విప్పితే అన్ని వివాదాలే. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం చాలా కష్టం. తాజాగా పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలతో మరోసారి సెంటరాఫ్‌ది న్యూస్‌గా మారిపోయారు. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం పోలీసులను ఉద్దేశించి జేసీ మాట్లాడారు. జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై అనంతపురం పోలీసు అధికారుల సంఘం మండిపడింది.

పోలీసుల ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా జేసీ మాట్లాడడాన్ని తప్పుపట్టింది. జిల్లాలో ఎవరు ఎవరి బూట్లు నాకారో ప్రజలందరికి తెలుసని పోలీసు సంఘం నేతలు అన్నారు. దివాకర్‌రెడ్డి తన స్థాయిని మరచిపోయి మాట్లాడారని, తక్షణమే పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించకపోవడం బాధాకరమన్నారు పోలీసు సంఘం నేతలు. జేసీ దివాకర్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

తాము అధికారంలోకి వస్తే బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామంటూ కామెంట్ చేశారు జేసీ. ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని, పోలీసులు ఎన్నేళ్లు ఉద్యోగంలో ఉంటారో ఆలోచించుకోండని హెచ్చరించారు. అంతటితో ఆగ లేదు జేసీ దివాకర్‌రెడ్డి. 
అనంతపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనూ.. పోలీసులపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎమ్మెల్యేలకు సెల్యూట్ కొడుతున్నారని, టీడీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందన్నారు. బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామన్న ఆయన.. ప్రస్తుతం ఉన్న పోలీసులపై తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించారు.
Read More : పోర్టులు చకచకా : నా టాప్ ప్రాధాన్యతలు ఇవే – సీఎం జగన్