Kadapa : కడప మఠం పీటముడి, ప్రభుత్వం ఏం చేయనుంది ?

కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కడప మఠం పీటముడిని విడిపించడంలో మఠాధిపతుల పాత్ర అయిపోయింది. ఏకగ్రీవంగా వారంతా పెద్ద భార్య కుమారుడికే పట్టం కట్టాలని నిర్ణయించారు. తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అందించనున్నారు. ఇదే సమయంలో సంచలన ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. ముగిసిందనుకున్న వ్యవహారంలో మళ్లీ అగ్గి రాజేశారు.

Kadapa : కడప మఠం పీటముడి, ప్రభుత్వం ఏం చేయనుంది ?

Kadapa

Brahmamgari Matam Issue : కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కడప మఠం పీటముడిని విడిపించడంలో మఠాధిపతుల పాత్ర అయిపోయింది. ఏకగ్రీవంగా వారంతా పెద్ద భార్య కుమారుడికే పట్టం కట్టాలని నిర్ణయించారు. తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అందించనున్నారు. ఇదే సమయంలో సంచలన ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. ముగిసిందనుకున్న వ్యవహారంలో మళ్లీ అగ్గి రాజేశారు. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఓ వైపు… పీఠాధిపతుల నిర్ణయాన్ని అడ్డుకునేందుకు రెండో భార్య ఎలా వ్యవహరిస్తారనేది మరో వైపు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కడప మఠం మంటలు తగ్గించేందుకు వెళ్లిన పీఠాధిపతులు.. సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరింత అగ్గిరాజుకుంది. వారసత్వం ఎంపిక కాస్తా.. అవినీతి ఆరోపణలు, అక్రమాల విమర్శలతో సంచలనంగా మారింది. శైవక్షేత్రం పీఠాధిపతి కన్వీనర్‌గా వెళ్లిన పీఠాధిపతులంతా దివంగత మఠాధిపతి వెంకటేశ్వరస్వామి మొదటి భార్య పెద్ద కుమారుడి వైపే మొగ్గు చూపారు. కొంతకాలంగా మఠంలో చర్చలు జరిపిన పీఠాధిపతుల బృందం చివరగా.. వెంకటాద్రిస్వామినే మఠాధిపతిని చేయాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది పీఠాధిపతుల బృందం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పీఠాధిపతుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే ఇదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుపటి మఠాధిపతి మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. మఠంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శివస్వామి ఆరోపణలను ఖండించారు వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ. డీజీపీకి ఫిర్యాదు చేసినందుకే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మఠాధిపతులుగా మైనర్లు, మహిళలు చేశారంటూ వ్యాఖ్యానించారు.

మొదటి భార్య కుమారులంతా ఏకాభిప్రాయంతో వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా ఎన్నుకున్నారని… పీఠాధిపతులు చెబుతుంటే… రెండో కుమారుడు మాత్రం భిన్న స్వరం వినిపిస్తున్నారు. తన అమ్మ కోసం కిడ్నీ ఇచ్చానని… అప్పుడు తనకు వీలునామా రాసిచ్చారని చెబుతున్నారు. అయితే అంతకుముందే ఈ విషయంపైన దృష్టిసారించిన ప్రభుత్వం.. మఠం పర్యవేక్షణ కోసం ఫిట్ పర్సన్‌గా కడప అసిస్టెంట్ కమిషనర్‌ను నియమించింది. గొప్ప చరిత్ర ఉన్న మఠంపై వివాదాలు చేయొద్దని కోరారు మంత్రి వెల్లంపల్లి. కాస్త ఆలస్యమైనా.. బ్రహ్మంగారి మఠం వివాదాన్ని అర్థవంతంగా పరిష్కరిస్తామన్నారు. మఠాధిపతిని ప్రకటించడానికి ఎవరికీ అధికారం లేదని.. ఎవరికి వారు మఠాధిపతిని ప్రకటిస్తామనడం సరికాదన్నారు వెల్లంపల్లి.

మొత్తానికి మఠాధిపతి ఎంపికతో ముగుస్తుందనుకున్న ఈ వ్యవహారం.. ఇప్పుడు అవినీతి, అక్రమాల ఆరోపణల వైపు సాగుతోంది. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read More : పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష