Chandrababu: అచ్చెన్నాయుడి ప్రకటన.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారా.. బాబు స్కెచ్ ఏంటో?

ఈ రెండు కార్యక్రమాలకు ఒక్క రోజు వ్యవధిలోనే ప్రకటనలు రావడం.. అదికూడా చంద్రబాబు, అచ్చెన్నాయుడు ములాఖత్ తర్వాతే నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.

Chandrababu: అచ్చెన్నాయుడి ప్రకటన.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారా.. బాబు స్కెచ్ ఏంటో?

lokesh padayatra pawan kalyan varahi vijaya yatra resumes what chandrababu plan

Chandrababu Naidu: ఒకవైపు లోకేశ్ పాదయాత్ర.. మరోవైపు జనసేన వారాహియాత్ర.. రెండు రోజుల వ్యవధిలో రెండు అతిముఖ్య కార్యక్రమాలపై ఏపీ ప్రతిపక్ష పార్టీలు ప్రకటనలు చేశాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత నిలిచిపోయిన రాజకీయ కార్యక్రమాలపై మళ్లీ దృష్టిపెట్టాయి టీడీపీ, జనసేన. అదీ కూడా చంద్రబాబు రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లొచ్చిన తర్వాతే ఈ రెండు అతిముఖ్య ప్రకటనలు విడుదలయ్యాయి. అచ్చెన్న ప్రకటన చూస్తే చంద్రబాబు ఏదో మాస్టర్ ప్లాన్ వేసినట్లే కనిపిస్తోంది.. బాబు స్కెచ్ ఏంటో.. టీడీపీ, జనసేన యాక్షన్‌ప్లాన్ ఏంటో తెరవెనుక రాజకీయం ఎలా ఉందో చూద్దాం.

లోకేశ్ పాదయాత్ర పునః ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జనసేనాని పవన్ నాలుగోవిడత వారాహియాత్రకు రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ నెల 28 శుక్రవారం నుంచి లోకేశ్.. వచ్చేనెల 2 నుంచి పవన్‌కల్యాణ్ వారాహియాత్ర మొదలుకానున్నాయి. ఈ రెండు కార్యక్రమాలకు ఒక్క రోజు వ్యవధిలోనే ప్రకటనలు రావడం.. అదికూడా చంద్రబాబు, అచ్చెన్నాయుడు ములాఖత్ తర్వాతే నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీతో తాడోపేడో తేల్చుకోడానికి టీడీపీ అధినేత చంద్రబాబు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. తన అరెస్టుతో నిలిచిపోయిన యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించడంతోపాటు లోకేశ్‌ను అరెస్టు చేస్తామనే ప్రభుత్వ బెదిరింపులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. మరో వైపు పొత్తుప్రకటన తర్వాత జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్న టీడీపీ.. పవన్ నాలుగో విడత వారాహియాత్రను వాడుకోవాలని చూస్తోంది.

ఇటు లోకేశ్, అటు పవన్ ద్వారా చంద్రబాబు అరెస్టుపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లో సానుభూతికి ప్లాన్ చేస్తోంది టీడీపీ. చంద్రబాబు అరెస్టుతో ఈ నెల 9 నుంచి లోకేశ్ పాదయాత్ర నిలిచిపోయింది. ఆ తర్వాత కోర్టు పనులపై 15వ తేదీన ఢిల్లీ వెళ్లిన లోకేశ్ ఇప్పటికీ అక్కడే ఉన్నారు. బుధవారం రాత్రి రాజమండ్రి రానున్న లోకేశ్.. శుక్రవారం నుంచి పాదయాత్ర నిలిచిపోయిన రాజోలు నియోజకవర్గం నుంచే మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. అక్కడికి రెండు రోజుల తర్వాత ప్రారంభమయ్యే పవన్ వారాహి యాత్రలో కూడా టీడీపీ శ్రేణులు భాగస్వామ్యం అయ్యేలా చంద్రబాబు ప్లాన్ చేశారని చెబుతున్నారు. అందుకే అచ్చెన్నాయుడితో ములాఖత్ తర్వాత యువగళం పాదయాత్ర, వారాహియాత్రలపై ప్రకటన విడుదలైందంటున్నారు. ఇక బాబు అరెస్టు తర్వాత ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగిందని అంచనా వేస్తున్నారు ఆ పార్టీ సీనియర్లు. ఐవీఆర్‌ఎస్ సర్వేల్లో 48శాతం మంది చంద్రబాబుకు అనుకూలంగా స్పందిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సానుభూతిని క్యాష్ చేసుకోడానికి బ్రాహ్మణిని రంగంలోకి దింపుతున్నారు టీడీపీ నేతలు.

Also Read: జైల్లో చంద్రబాబు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమా? సీఎం జగన్ నిర్ణయం ఏంటి?

బెయిల్ వచ్చేవరకు చంద్రబాబు జైల్లో ఉండక తప్పదుకనుక.. పార్టీని సమర్థంగా నడిపేలా 14 మందితో ఓ కమిటీ వేసిన టీడీపీ.. లోకేశ్ పాదయాత్రతోపాటు బ్రాహ్మణిని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సభ చొప్పున బ్రాహ్మణితో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చూస్తోంది టీడీపీ. అచ్చెన్నతో ములాఖత్‌లో చంద్రబాబు ఈ విషయంపై ఎలాంటి సూచనలు చేశారోగాని.. ముందుగా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించాలని.. ఒకవేళ ఏదైనా కారణాలతో లోకేశ్‌ను అరెస్టు చేసి పాదయాత్రను అడ్డుకుంటే బ్రాహ్మణితో ఆ కార్యక్రమం కొనసాగించేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ. ఏదైనాసరే వచ్చే ఎన్నికలకు బాబు అరెస్టు ద్వారా సానుభూతి అస్త్రం ప్రయోగించాలని టీడీపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

Also Read: విశాఖ తూర్పు నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. ఎమ్మెల్యేగా ఎంపీకి చాన్స్!