Crop Holiday : రైతులు టీడీపీ వలలో పడి క్రాప్ హాలిడే పాటించవద్దు-మంత్రి విశ్వరూప్

క్రాప్ హాలిడే పేరుతో తెలుగుదేశం పార్టీ,  ప్రభుత్వంపై  బురద చల్లడానికి ప్రయత్నం చేస్తోందని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.

Crop Holiday : రైతులు టీడీపీ వలలో పడి క్రాప్ హాలిడే పాటించవద్దు-మంత్రి విశ్వరూప్

MInister Vishwaroop

Crop Holiday : క్రాప్ హాలిడే పేరుతో తెలుగుదేశం పార్టీ,  ప్రభుత్వంపై  బురద చల్లడానికి ప్రయత్నం చేస్తోందని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈరోజు ఆయన అమలాపురం కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ లబ్దికోసం తెలుగుదేశం పార్టీ ఆడుతున్న నాటకం ఇది అన్నారు.

నిజమైన రైతులు తెలుగుదేశం పార్టీ  ప్రలోభాలకు లొంగకుండా క్రాప్ హాలీడే ప్రకటనను ఖండించాలని ఆయన కోరారు. రైతు భరోసా అమలుతో  రైతులకు మేలు చేస్తున్నందుకు క్రాప్ హాలీడే ప్రకటిస్తారా అని ఆయన కోనసీమ రైతు పరిరక్షణ సమితిని ప్రశ్నించారు.  రైతులు పార్టీ కార్యకర్తల్లా కాకుండా రైతుల ప్రయోజనాల కోసం పోరాడాలని ఆయన అన్నారు.

జూన్ 1వ తేదీకే సాగునీటి విడుదలతో మూడు పంటలు పండించటానికి అవకాశం ఉందని… రైతులు తెలుగుదేశంపార్టీ వలలలో పడొద్దని సలహా ఇచ్చారు. రైతులు నిరభ్యంతరంగా మొదటి పంట సాగు చేసుకోవచ్చని… బకాయి పడ్డ ధాన్యం డబ్బులు 48 గంటల్లో జమ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

కాగా జిల్లాలోని 12 మండలాల్లో క్రాప్ హాలిడే పాటించాలని కోనసీమ రైతు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలోనే క్రాప్ హాలిడే పాటిస్తున్నామని రైతులు అంటున్నారు.