Nara Bhuvaneswari : చంద్రబాబును కాదు.. రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్బంధించారు : నారా భువనేశ్వరి

లోకేష్ ను సైతం యువగళం యాత్రలో ఇబ్బంది పెట్టారని.. మాట్లాడే మైక్, చివరకు స్టూల్ కూడా లాక్కెల్లిపోయారని వాపోయారు. ఇవాళ కాక రేపు అయినా ఆయన జైలు నుంచి వస్తారని తెలిపారు.

Nara Bhuvaneswari : చంద్రబాబును కాదు.. రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్బంధించారు : నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra

Updated On : October 25, 2023 / 8:17 PM IST

Nara Bhuvaneswari – AP Government : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. బ్రిటీష్ వారితో పోరాడినట్లుగా ఉందన్నారు. తెలుగు వారి పౌరుషం చూపాలన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కాదు.. రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్బంధించారని పేర్కొన్నారు. అసలు ఇక్కడ పరిపాలన ఉందా అని ప్రశ్నించారు. చంపడం, కేసులు, రేప్ లు, గంజాయి, భయపెట్టడం.. ఇవే రాష్ట్రంలో కనిపిస్తున్నాయని అభివృద్ధి ఎక్కడుందని ఎద్దేవా చేశారు.

ఇదివరకు గ్రామంలో కుటుంబంతో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తుకొచ్చి తన గుండె పిండేసిందని అన్నారు. నిజం గెలవాలి… అనే ఈ పోరాటం తన ఒక్కరిది కాదు… మన అందరిది అని అన్నారు. మన బిడ్డలు, మన భావితరాల కోసం ఈ పోరాటమని పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో నిర్వహించిన ‘నిజం గెలవాలి’ బహిరంగ సభలో నారా భువనేశ్వరి ప్రసంగించారు.

Also Read : అదాన్ డిస్టిలరీస్ వెనుక వైసీపీ నేత విజయసాయి రెడ్డి : పురందేశ్వరి

నందమూరి కుటుంబంలో పుట్టడం తన అదృష్టం అని అన్నారు. తమ నాన్న ఎన్టీఆర్ తమను క్రమశిక్షణతో పెంచారని తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు మూడు వేల మంది అనాధ పిల్లలకు చదువు చెప్పించామని తెలిపారు. అనేక ఆపద సమయాల్లో పేదలను ఆదుకున్నామని పేర్కొన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ప్రజల కోసమే ఆలోచించారని తెలిపారు.

హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఆయనను చూసి నవ్వారని పేర్కొన్నారు. చంద్రబాబు తప్పులను మొదట తానే ఎత్తి చూపే దాన్ని కానీ, ఆయన ఒక విజన్ తో ఆలోచించేవారని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన్ను జైలులో నిర్బంధించారని పేర్కొన్నారు. స్కిల్ స్కాంలో ఎలాంటి ఆధారాలు లేవని, అనేక కొత్త కేసులు పెడుతున్నారని తెలిపారు. ఎందులోనూ ఆధారాలు లేవని చెప్పారు.

Also Read : నారా భువనేశ్వరి నిజం గెలవాలి బస్సు యాత్ర

రాష్ట్ర విభజన సమయంలోనూ చంద్రబాబు ఎంతో ఆవేదన చెందారని వాపోయారు. ‘మీ ఆరోగ్యం చూసుకోమని నేను ఆయనకు చెప్పేదాన్ని’ అని పేర్కొన్నారు. మొన్న చిత్తూరు జిల్లాలోనూ చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు. పుంగనూరులో సైకిల్ యాత్ర చేస్తున్నవారిపై అత్యంత దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మీరు ఎంత బాధ పెట్టినా మా వాళ్ళు తగ్గరని తేల్చి చెప్పారు.

లోకేష్ ను సైతం యువగళం యాత్రలో ఇబ్బంది పెట్టారని.. మాట్లాడే మైక్, చివరకు స్టూల్ కూడా లాక్కెల్లిపోయారని వాపోయారు. ఇవాళ కాక రేపు అయినా ఆయన జైలు నుంచి వస్తారని తెలిపారు. మానసికంగా ఇబ్బంది పెడితే దెబ్బ తీయవచ్చని అనుకుంటున్నారు కానీ, ఆయన చాలా స్ట్రాంగ్ అని వాళ్ళకి తెలియదన్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన ఇంకా కష్టపడతారని తెలిపారు. చేయి చేయి కలిపి పోరాడాలని పిలుపునిచ్చారు.