Payakaraopet Constituency: పాయకరావుపేటలో అంతకుముందు అనితకు ఎదురైన పరిస్థితే.. ఇప్పుడు బాబురావుకు..

తొలినాళ్లలో రాజకీయం అర్థం చేసుకోలేక.. విశాఖ జిల్లా టీడీపీలో భిన్న దృవాలైన మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వర్గ రాజకీయాలకు అనిత బలైపోయారనే చెబుతారు.

Payakaraopet Constituency: పాయకరావుపేటలో అంతకుముందు అనితకు ఎదురైన పరిస్థితే.. ఇప్పుడు బాబురావుకు..

Payakaraopet Assembly Constituency Ground Report

Payakaraopet Assembly Constituency: వంగలపూడి అనిత (vangalapudi anitha) ఏపీ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నేత. తన వాగ్దాటితో ప్రత్యర్థులపై మాటల దాడి చేసే మహిళా నేత. టీచర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. చాలా తక్కువ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో దూసుకుపోయారు అనిత. అధికార పార్టీకి టార్గెట్‌గా మారినా.. పోరాట పంథా వీడలేదు. అలాంటి అనిత గత ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానాన్ని వదులుకున్నారు. ఓటమి పాలయ్యారు. ఐతే ఈసారి మళ్లీ తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటపై ఫోకస్ పెట్టారు. విజయమో వీరస్వరమో అన్న స్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావు (Golla Babu Rao)పై వ్యతిరేకత పెరగడం అనితకు కలిసొస్తుందా? పాయకరావుపేటలో ఈసారి కనిపించబోయే సీనేంటి?

ఏపీ రాజకీయాల్లో హాట్ సీట్ పాయకరావుపేట. ఎస్సీ నియోజకవర్గమైనా ఇక్కడ రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై గ్రూపులు కట్టడం ఈ నియోజకవర్గంలో చాలా కామన్. అధికార వైసీపీ అయినా.. ప్రతిపక్ష టీడీపీ అయినా.. ఎమ్మెల్యేలకు ముప్పతిప్పలు పెట్టే ద్వితీయశ్రేణి నాయకులకు కొదవే లేదు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో ఇతర సామాజిక వర్గ నేతల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఇప్పుడు అనుభవిస్తున్నా.. అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ నేత అనితకు ఎదురైంది.

Golla Babu Rao

Golla Babu Rao

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గొల్ల బాబూరావు గెలిచినా.. ఆయన ప్రత్యర్థి మాత్రం అనిత కాదు.. 2019 ఎన్నికల వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన అనితకు ఇక్కడ క్యాడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవ్వడంతో అనితను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు మార్చింది తెలుగుదేశం అధిష్టానం.. ఆ ఎన్నికల్లో అనిత ఇక్కడ నుంచి మరోచోటకు మారడానికి ప్రధాన కారణం ఆమె స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నించడమే ప్రధాన కారణమనే విశ్లేషణలే ఎక్కువ ఉన్నాయి. 2014లో తొలిసారిగా గెలిచిన అనిత.. వాక్ చాతుర్యంతో తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాడానికి ముందు టీచర్‌గా పనిచేశారు అనిత.

vangalapudi anitha

Vangalapudi Anitha

ఉన్నత విద్యావంతురాలు.. ఉద్యోగస్తురాలు కావడంతో టీడీపీ అధిష్టానం పిలిచి టిక్కెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు అనిత. తొలినాళ్లలో రాజకీయం అర్థం చేసుకోలేక.. విశాఖ జిల్లా టీడీపీలో భిన్న దృవాలైన మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వర్గ రాజకీయాలకు అనిత బలైపోయారనే చెబుతారు. కానీ, 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఓడిపోవడం.. ఆ తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఆమెకు బాధ్యతలు అప్పగించడంతో టీడీపీలో కీలక నాయకురాలిగా ఎదిగారు అనిత. ఇప్పుడు ఆమె ఏ నేత మద్దతు అవసరం లేకుండా నియోజకవర్గంలో స్వతంత్రంగా పనిచేసుకోగలగుతున్నారు. అధికార వైసీపీలో వర్గ విభేదాలు ఈ సారి అనితకు అనుకూలించే చాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు.

అధిష్టానంలో పట్టు ఉండటంతో అనితకు పోటీ దాదాపు ఖరారైరందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో అధిష్టానం కొవ్వూరుకు మార్చినా.. పార్టీ ఆదేశాన్ని శిరసావహించి అక్కడికి వెళ్లి పోటీ చేశారు అనిత. ఈసారి కొద్ది మంది నాయకులు ఆమెను వ్యతిరేకించినా పార్టీ అగ్రనాయకత్వంలో అనిత పరపతి ముందు.. వారి వ్యతిరేకత ఏమాత్రం పనిచేయదని అంటున్నారు. ప్రజల్లో అనిత పట్ల వ్యతిరేక లేకపోవడం.. టీడీపీకి పాయకరావుపేటలో గట్టి ఓటు బ్యాంకు ఉండటంతో అనితకే టిక్కెట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

ఇక అధికార వైసీపీలో కుమ్మలాటలు క్యాడర్‌ను కలవరపెడుతున్నాయి. పాయకరావు పేట మెుదటి నుంచి టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఏడు సార్లు టీడీపీయే ఇక్కడ గెలిచిందింది అలాంటిది సైకిల్ జోరుకు బ్రేక్ వేసి తొలిసారి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావు. ఆ తర్వాత జగన్‌కు మద్దతుగా 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో అమలాపురం ఎంపీగా పోటీ చేసిన గొల్ల బాబూరావు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో పాయకరావుపేట టిక్కెట్ తెచ్చుకుని.. వైసీపీ హవాలో టీడీపీ అభ్యర్థి బంగారయ్యపై ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జగన్ ప్రభావం.. టీడీపీలో అనైక్యత బాబూరావుకి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఐతే ఇప్పుడు సీన్ కాస్త మారిందని చెబుతున్నారు.

Also Read: వైసీపీ, టీడీపీలోనూ అసమ్మతి కుంపట్లు.. ఎవరు తగ్గుతారో, ఎవరు నెగ్గుతారో!

ప్రస్తుతం నియోజకవర్గంలో అసంతృప్తి రాగాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గొల్ల బాబురావు వద్దు.. వైసీపీ ముద్దు అంటూ స్థానిక నాయకులు నిరసనలకు దిగడం ఎమ్మెల్యేను కలవరపెడుతోంది. సొంత పార్టీ వారినే ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని నిరసిస్తూ ఎస్‌.రాయవరం ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి (Bolisetti Sharada kumari) రాజీనామా చేయడం వైసీపీలో గ్రూప్ వార్‌ను తెలియజేస్తోంది. బదిలీలు, కాంట్రాక్టుల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. తమ కారణంగానే బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచినా, తమకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ముఖ్య నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

Also Read: సాలూరులో టీడీపీకి బహు నాయకత్వ సమస్య.. రాజన్నదొర ఆలోచనకు అధిష్టానం అంగీకరిస్తుందా?

మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యే, ఇతర ముఖ్యనాయకుల మధ్య సయోధ్య కుదిర్చినా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లే వ్యవహరిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబూరావుకు నిరసనలు ఎదురవుతుండటంతో.. వైసీపీని టెన్షన్ పెడుతోంది. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చకుని టిక్కెట్ కొట్టేయాలని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు చూస్తున్నారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి తనకే టిక్కెట్ దక్కుతుందని.. మళ్లీ ఎమ్మెల్యేగా తెలుస్తానని చెబుతున్నారు గొల్ల బాబూరావు.

pedapati ammaji

Pedapati Ammaji

ఐతే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నాయకులు గ్రూపు కట్టడం.. ఈసారి ఇక్కడి నుంచి టీడీపీ మహిళా నేత అనిత పోటీ ఖరారు కావడంతో.. ఆమెపై మహిళా నేతను పోటీకి పెడితే బాగుంటుందని భావిస్తోంది వైసీపీ. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు (chengala venkat rao) టిక్కెట్ కోసం జోరుగా ప్రయత్నిస్తున్నా.. మంత్రి దాడిశెట్టి రాజా మద్దతుతో ఏపీ SC కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ (pedapati ammaji) అనితపై పోటీకి సిద్ధమవుతున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన పాయకరావుపేట వైసీపీని ఏకతాటిపైకి తీసుకొస్తానని.. అమ్మాజీ చెబుతున్నారు.

Also Read: టీటీడీ చైర్మన్ పదవి రేసులో నలుగురు.. మాజీ మంత్రివైపు అధిష్టానం మొగ్గు!

మొత్తానికి అధికార పార్టీ టార్గెట్ మాత్రం టీడీపీ నేత అనితను ఓడించడమే అని చెబుతున్నారు. అనిత కూడా ప్రభుత్వ విధానాలపై మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు. పార్టీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు అనిత. వీలు దొరికనప్పుడల్లా నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనటం.. గత ఎన్నికల్లో తనను వ్యతిరేకించిన వారిని సర్దిచెబుతూ విజయం కోసం శ్రమిస్తున్నారు. వైసీపీలో గ్రూప్ వార్ అనితకు కలిసొస్తుందని.. లేదంటే ఆమె శ్రమించక తప్పదనే విశ్లేషిస్తున్నారు పరిశీలకులు.