టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..అనపర్తిలో ఉద్రిక్తత…

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..అనపర్తిలో ఉద్రిక్తత…

Mla Nallamilli Ramakrishna Reddy

police arrest tdp ex mla nallamilli ramakrishna reddy: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనపర్తి మండలం రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి దగ్గరున్న సమయంలో టీడీపీ నేత‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డికి బావ వరుస అయిన సత్తిరాజు రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే రామకృష్ణారెడ్డే తన భర్తను చంపేశాడని ఆరోపిస్తూ మృతుడి రెండో భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇవాళ(మార్చి 12,2021) రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు.

రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడంతో అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. రామకృష్ణారెడ్డి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో రామవరం గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.

కాగా, కొద్ది రోజుల క్రితం రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రామకృష్ణారెడ్డి బిక్కవోలు ఆలయంలో ప్రమాణానికి సవాల్ చేశారు. రెండు వర్గాలు ఆలయంలో ప్రమాణం చేశాయి. ఆ తర్వాత కూడా రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి బావ హత్య అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.